(E.Santosh,News18,Peddapalli)
Kodurupaka village: తెలంగాణలోనిపెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఊర్లో సూర్యుడు పొద్దున ఉదయించడం కొద్దిగా ఆలస్యంగా, అస్తమించడం త్వరగా జరుగుతుంది.
ఈ కుదురుపాక గ్రామం చుట్టూ నాలుగు వైపుల గుట్టలు ఉన్నాయి. పచ్చదనం పరుచుకొని ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది, ఊర్లో నవాబుల కాలంలో నాటి గుడి, ఊరు చుట్టూ పారే కానాల వాగు, చల్లటి గాలులు, స్వచ్ఛమైన గాలి నడుమ ఈ గ్రామం ఎంతో అందంగా ఆహ్లదకరంగా ఉంటుంది
నాలుగు గుట్టల మధ్య కొదురుపాక
ఈ ఊరి చూట్టు ఉన్న నాలుగు గుట్టలను అక్కడ నాలుగు పేర్లతో పిలుస్తారు. తూర్పున(East) ఉన్న గుట్టను గొల్లగుట్ట అని పిలుస్తారు. పడమరన(West) రంగనాయకుల గుట్ట.. దక్షిణాన(North) పాముబండ గుట్ట, ఉత్తరంలో(North) నంబులాద్రి స్వామి గుట్ట ఉన్నాయి. ఇలా ఎత్తైనగుట్టలు కొదురుపాక ఊరూ చుట్టూ ఉన్నాయి. చూట్టూ ఆహ్లాదంగా ప్రకృతి పరిచినట్లు ఉంటుంది ఈ గ్రామం.
ఈ ఊరిలో ఎందుకిలా జరుగుతోంది?
ఈ ఊరికి నలువైపులా ఆవరించి ఉన్న గుట్టలు ఇక్కడి సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలపై ప్రభావం చూపిస్తున్నాయి. తూర్పున(East) ఉన్న గొల్లగుట్ట… గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ ఆలస్యంగా సూర్యోదయం అవుతుంది. అంటే మిగతా ప్రాంతాల కంటే సూర్యకిరణాలు(Sunrays) కొదురుపాకపై గంట ఆలస్యంగా పడతాయన్నమాట. ఇక.. 4 గంటల ప్రాంతంలో సూర్యుడు(sun)… గ్రామ పడమర(West) దిక్కున ఉన్న రంగనాయకుల గుట్ట వెనక్కి వెళ్తాడు. దీంతో ఈ గ్రామాన్ని చీకటి అలుముకుంటుంది. అంటే మూడో జాము సాయంత్రం సమయంలోనే చీకటిపడటంతో.. ప్రతి ఇంట్లో , వీధిలో విద్యుత్తు దీపాలు వెలుగుతాయి. ఈ ప్రాంతంలో కాంతి సహజ లక్షణాలైన పరావర్తనం, వక్రీభవనాలే కొదురుపాకలో ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
మూడు జాముల కొదురుపాకగా పేరు ...
సాధారణంగా రోజుకు ఎన్ని జాములుంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కదా. కానీ ఈ కొదురుపాక గ్రామంలో మాత్రం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి…ఈ మూడు జాములు మాత్రమే ఉంటాయి. సాయంత్రం జాము అస్సలు ఉండదు. ఎందుకంటే నాలుగు గంటలకే అక్కడ సూర్యుడు అస్తమిస్తాడు. అందుకే చుట్టుపక్కల గ్రామాలతో పోలిస్తే వీరికి పగటి సమయం తక్కువ. అందుకే ఈ గ్రామాన్ని 'మూడుజాముల కొదురుపాక' అని పిలుస్తారు. నవాబుల కాలంలో పొదలపాకగా ఉన్న గ్రామం ఇప్పుడు కొదురుపాకగా మారింది.
మధ్యాహ్నానికే ఇంటికి చేరుకుంటున్న మహిళలు
ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల ప్రభావం ఇక్కడి ప్రజల నిత్యజీవితంపై కూడా పడుతోంది. జనం తమ పనులు ముగించుకుని త్వరగా ఇంటికి చేరుకుంటారు. ఊర్లో పని చేసుకునే మహిళలు మధ్యాహ్నం మూడు గంటల వరకే ఇంటికి చేరుకుని ఇంట్లో పనులు చేసుకుంటారట.
పర్యాటక ప్రాంతం చేస్తే ఆదాయం
పర్యాటక ప్రాంతంగా ఈ ఊరికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఊరిలో సూర్యోదయ, సూర్యాస్తమయాలను చూసేందుకు పక్క గ్రామాలు, పట్టణాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. అంతేకాదు నాలుగు కొండల మధ్య ఉన్న ఈ ఊరు ప్రకృతి అందాలను తిలకించేందుకు కూడా చాలా మంది వస్తుంటారు, కాబట్టి ఈ ఊరు ప్రత్యేకతను ప్రభుత్వం గుర్తించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ సాగర్ కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Peddapalli, Sun, Village