E.Santosh, News18, Peddapalli
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Government) పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆసరాగా నిలిచేందుకు ప్రతిష్టాత్మకంగా ఆసరా పెన్షన్ (Asara Pensions) కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి సారి ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్లు ఇచ్చిన రెండోసారి ప్రభుత్వం ఏర్పడే ముందు పెన్షన్ వయసును తగ్గించి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆశావాహులు ఎదురుచుపులు చూస్తున్నారు. ఆశ చూపిన ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. చివరిసారిగా 2021 అక్టోబర్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత సైట్ మూసివేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు సైట్ ఓపెన్ చేయక పోవడంతో మండల, జిల్లా కార్యాలయాలకు వెళ్లి స్వయంగా దరఖాస్తు చేసుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆసరా పథకం ద్వారా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ, కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, బోద కాలు బాధితులకు పింఛన్లు నెలకు రూ.3016, ఇతరులకు రూ.2016 రూపాయలు వారి ఖాతాల్లో జమచేస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం నెలనెలా ఇచ్చే పింఛన్ సొమ్మును దివ్యాంగులకు రూ.500 నుంచి రూ.1500కు, ఇతరులకు రూ.300 నుంచి రూ.1000 రూపాయలకు పెంచింది. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల సందర్భంగా పింఛన్ కింద ఇచ్చే డబ్బులను వెయ్యి నుంచి రూ.2016కు, రూ.1500 నుంచి రూ.3016 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ మేరకుమళ్లీఅధికారంలోకి వచ్చిన తర్వాత పించన్ ఇస్తున్నారు.
అలాగే వృద్ధాప్య పింఛన్ మంజూరు కోసం అర్హత వయసును 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో అనేకమంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ మంజూరు చేయలేదు. ఆ తర్వాత 2020, 2021 అక్టోబరులో మీ సేవా ద్వారా దర ఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇచ్చిన హామీ ప్రకారం గడిచిన ఏడాది ఆగస్టులో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి జిల్లావ్యాప్తంగా కొత్తగా 26,556 మందికి పింఛన్లు మంజూరు చేశారు. ఇందులో 57 ఏళ్లు నిండినవారిలో 16,531 మంది, 65 ఏళ్లు నిండినవారు 2,538 మంది, వితంతువులు 5,148 మంది. దివ్యాంగులు 1,258 మంది, చేనేత కార్మికులు 198మంది, గీత కార్మికులు 305 మంది, బీడీ కార్మి, కులు ఐదుగురు, ఏఆర్ టీ బాధితులు 268 మంది, ఫైలేరియా బాధితులు 18 మంది ఉన్నారు.
దీంతో పింఛన్ దారుల సంఖ్య 1,02,281కి చేరుకున్నది. 2021 అక్టోబరు తర్వాత నుంచి అనేక మంది 57ఏళ్లు నిండినవారు ఉన్నారు. అనేకమంది భర్తను కోల్పోయి వితంతువులుగా మారారు. అలాగే గీత, చేనేత కార్మికులు, ఇతరులు పింఛన్ మంజూ రు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి పలుసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో, పట్టణాల్లో ఆసరా పింఛనుకు అర్హులైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు పించన్ మంజూరు చేయాలని మొరపెట్టుకుంటున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సైట్ను ఓపెన్ చేయకపోవడంతో మండల పరిషత్ కార్యాలయాలకు, జిల్లా కార్యాలయానికి వెళ్లి ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం మాత్రం సైట్ ఓపెన్ చేయడం లేదని వాపోతున్నారు. పింఛన్ లేక అనేక మంది వృద్ధులు, వితంతువులు, ఇతరులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రం అమలుచేయని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆసరా సైట్ ఎందుకు మూసివేసిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.
పింఛన్ పొందే భర్త చనిపోయిన వారికే మంజూరు..
ఆసరా పథకం ద్వారా పింఛన్ పొందుతున్న మహిళల భర్త మరణిస్తేనే భార్యకు పింఛన్ మంజూరుచేస్తున్నారు. వాళ్లు ఇచ్చే దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేస్తున్నారు. 57 ఏళ్లు నిండిన వారు అయితే వృధాప్య పెన్షన్లు, తక్కువ అయితే వితంతు పెన్షన్ మంజూరు చేస్తున్నారు. వయసు ఉన్న మొత్తానికే పెన్షన్ రాని వారికి పెన్షన్ మంజూరు చేయడం లేదు. ఈ లెక్క ప్రకారం జిల్లాలో 333 మందికి పెన్షన్ మజురు అయ్యాయి. మిగతా వారంతా ప్రతి రోజూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నారు. పెన్షన్ లు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సైట్ ఓపెన్ చేయాలని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aasara Pension Scheme, Local News, Peddapalli, Telangana