తెలంగాణ (Telangana) రాష్ట్రానికి వెలుగు కిరణాలను అందిస్తున్న ఎన్టీపీసీ గణనీయ పురోగతిని సాధిస్తోంది. 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 44 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఎన్టీపీసీ (NTPC) అంచెలంచెలుగా ఎదిగి 2,600 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకొంది. ప్రపంచ విద్యుత్ సంస్థలతో పోటీపడుతూ, ఎన్నో అవార్డులు సొంతం చేసుకొని, రాష్ట్ర ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేస్తోంది.
1978లో ప్రారంభమైన NTPC..
అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1978 నవంబర్ 14న నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ చేతుల మీదుగా ఎన్టీపీసీ పురుడు పోసుకుంది. 1983 అక్టోబర్ 23 నుంచి ప్లాంట్ వెలుగులు పంచడం మొదలుపెట్టింది. దేశంలోనే తొలిసారిగా ISO 14001 సర్టిఫికెట్ ‘సూపర్ థర్మల్ పవర్ స్టేషన్’ అవార్డు పొందింది.
200లతో ప్రారంభమై .. 2600 సామర్థ్యానికి ఎన్టీపీసీ..
200 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ఎన్టీపీసీ (NTPC) ప్రస్తుతం 2,600 మెగావాట్ల (MW) సామర్థ్యానికి చేరుకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నెలల్లోనే 11,048.100 మిలియన్ యూనిట్లను (MU) 82.78 శాతం పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో ఉత్పత్తి చేసింది. 2016–17 వార్షిక సంవత్సరం లో 19,597.497 మిలియన్ యూనిట్లను 86.04 శాతం పీఎల్ఎఫ్ (PLF)తో ఉత్పత్తి చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరి రాష్ట్రాలకు ఇక్కడి నుంచి విద్యుత్ సరఫరా అవుతోంది. ఇలా దక్షిణ భారతానికి వెలుగు దివ్వెలా మారుతోంది.
తెలంగాణ స్టేజీ-1తో NTPCకి పెరగనున్న సామర్థ్యం ..
రాష్ట్ర పునర్విభజన ప్రకారం తెలంగాణ (Telangana)కి త్వరలో ఎన్టీపీసీ మరింత వెలుగులు పంచబోతోంది. నిర్మాణ దశలో ఉన్న 1,600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తెలంగాణ ప్రాజెక్ట్ పూర్తయితే, ఆ రాష్ట్రానికి మరింత విద్యుత్ (Power) అందనుంది. తెలంగాణ స్టేజీ–1లో 800 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు యూనిట్ల నిర్మాణం ప్రస్తుతం సాగుతోంది. దీనితో ఎన్టీపీసీకి 1,600 మెగావాట్ల విద్యుత్ అదనంగా అందనుంది. తెలంగాణ స్టేజీ–1ను 2016లో ప్రధాని మోదీ (PM Narendra modi) ప్రారంభించారు.
సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో సంవత్సరానికి 8.0 మెట్రిక్ టన్నుల బొగ్గు, రెండు టీఎంసీల(TMC) ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి వినియోగం, మందాకిని–బి కోల్‌మైన్, ఒడిశా, డబ్ల్యూపీ ఎల్ కోల్ లింకేజీతో రూ.10,598.98 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణపనులు వేగంగా సాగుతున్నాయి. సోలార్ విద్యుత్‌ను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. సోలార్ ఫొటో వొల్టాయిక్ టెక్నాలజీతో క్రిస్టాలిన్ సిలికాన్ మోడ్యుల్స్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.
అమెరికా పవర్ మ్యాగజైన్ లోనూ ఎన్టీపీసీ (NTPC)కి గుర్తింపు:
ప్రపంచ స్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ ఎన్నో రికార్డులను నెలకొల్పింది. వాటిలో కొన్ని…
స్వర్ణశక్తి అవార్డు 2015–16 (విన్నర్ సీఎస్సార్–సీడి, రన్నర్ ప్రోడక్టివిటీలో)
ఎన్టీపీసీ బీఈ మోడల్ 2016–17లో ద్వితీయ స్థానం.
ఎంజీఆర్ విభాగం ఉద్యోగులకు విశ్వకర్మ పురస్కారం.
క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా చాప్టర్ అవార్డు.
గ్రీన్‌టెక్ సేఫ్టీ అవార్డు–2016
ఎనర్జీ ఎఫీషియెంట్ యూనిట్ అవార్డు
అంతేకాదు… రామగుండం ఎన్టీపీసీకి 2015 ప్రపంచ అత్యుత్తమ ప్రాజెక్టుగా అమెరికా పవర్ మ్యాగజైన్ గుర్తింపు దక్కింది. 442 రోజులు నిరంతర విద్యుత్ ఉత్పత్తి చేసి జాతీయ స్థాయి రికార్డును సొంతం చేసుకుంది.
ఎన్టీపీసీ ప్రకృతి అందాలు..
ఎన్టీపీసీ పచ్చదనంలోనూ ముందే ఉంటుంది. ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్ షిప్‌లోని పచ్చదనం చూస్తుంటే మనం గ్రీన్ సిటీ లోకి వచ్చామా అన్నట్లుగా ఉంటుంది. చెట్లతో (Trees) పచ్చదనం పరిచినట్లు కనిపిస్తుంది ఆ ప్రకృతి అందాలను (Nature beauty) తిలకించేందుకు చూడ ముచ్చటగా ఆహ్లాదంగా ఉంటుంది. ఎన్టీపీసీ వారి పరిధిలోనే కాకుండా చుట్టూ పక్క ప్రాంతాల పచ్చదనంపై కూడా దృష్టి సాధించింది
రామదుర్గంలో సాధారణం కంటే ఎక్కువ ఎండలు ఉంటాయి. ఆ ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచితే ఆ ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుంది. అందుకని మియవాకీ పద్ధతికి శ్రీకారం చుట్టింది NTPC.
మియావాకీ పద్ధతి అంటే?
తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా (Forest) పెంచే జపాన్ పద్ధతి మియావాకీ (Miyawaki) పద్ధతి అంటారు. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు (Plants) అత్యంత త్వరితంగా పెరగడమే కాక దట్టంగా పచ్చదనంతో వనం మాదిరిగా కనిపిస్తుంది. నగరాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయోగకరమైన ఈ విధానాన్ని జపాన్ (Japan)కు చెందిన వృక్ష శాస్త్రవేత్త అకీరా మియావాకీ కనుగొనడంతో ఈ పేరు వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం హరితహరం పేరుతో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేస్తుంది. అందులో భాగంగా కొన్ని నగరాల్లో ఈ మియావాకీ పద్ధతిని అనుసరిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వంతో కలిసి మరింత కృషి చేస్తున్నాయి. అదేవిధంగా NTPC కూడా తన ప్రాంతంలో ఈ మియావాకీ పద్ధతికి శ్రీకారం చుట్టింది.
మకాజిపల్లి పల్లి వద్ద మియవాకి పద్ధతిలో….1400 స్క్వేర్ యార్డ్ లో 2900 చెట్లు..అందులో 53 వెరైటీలతో మొక్కలను నాటారు. ప్రతి ఏటా హరిత హారంలో కూడా ఎన్టీపీసీ పెద్ద ఎత్తున మొక్కలు నాటుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ELectricity, NTPC, Peddapalli