PEDDAPALLI POLLUTION CONTROL BOARD APPROVES PRODUCTION AT TELANGANA RAMAGUNDAM FERTILIZER FACTORY SNR PSE NJ
Telangana : రామగుండంలో ఎరువుల ఉత్పత్తికి నో బ్రేక్ .. పర్మిషన్ ఇచ్చిన పొల్యూషన్ బోర్డ్
(ఎరువుల ఉత్పత్తికి గ్రీన్ సిగ్నల్)
రామగుండం ఫెర్టిలైజర్లో ఉత్పత్తులను నిలిపేయాలంటూ పొల్యూషన్ బోర్డు ఆదేశాలిచ్చి కూడా యాజమాన్యం కోరికమేరకు గడువును పెంచింది. ఆ లోపు సాంకేతిక సమస్యలను సరిచేయాలని సూచించింది. కానీ ఈ RFCLను మూసేయాలని ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
(santosh,News18,Peddapalli)
రామగుండం(Ramagundam)ఎరువుల కర్మాగారంలో నెల లో ఒకటి రెండు సార్లు అమ్మైనియ గ్యాస్ లీకేజీ(Ammonia gas leakage)అయ్యి పరిసర ప్రాంతాలలో దుర్వాసన కమ్ముకుంటుంది. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. ఆరోగ్యాలు ఎక్కడ దెబ్బ తింటాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఈ మధ్యే రామగుండం ఎమ్మెల్యే(Ramagundam MLA)కొరుకంటి చందర్(Korukanti Chander)కూడా ఈ విషయం పై స్పందించిగ్యాస్ లీకేజ్ కాకుండా యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ బోర్డు(Pollution Board)ను సంప్రదించారు.
గోదావరి నది కలుషితం
రామగుండం ఎరువుల కర్మాగారం నుండి అమ్మోనియా లీకేజీతో పాటు ఆర్.ఎఫ్.సి.ఎల్ వ్యర్థ నీరు గోదావరినదిలో కలవటం మూలంగా గోదావరి నది కలుషుతం అవుతుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో…హైదరాబాద్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సమావేశం నిర్వహించారు. మూడు రోజులపాటు సమావేశం నిర్వహించి పొల్యూషన్ బోర్డు రామగుండం ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి ( పీసీబీ ) ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల పాటు కర్మాగారంలో పీసీబీ తనిఖీలు చేపట్టింది.
12లోటుపాట్లు గుర్తించిన పీసీబీ..
ఈ పరిశ్రమపై కొంత కాలంగా అనేక ఫిర్యాదులొచ్చాయి. గ్యాస్ లీకేజీ తదితర అంశాలపై పలుసార్లు స్థానికులు ఆందోళనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే స్పందించి ఫిర్యాదు చేయడంతో కర్మాగారంలో పీసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 12 లోటుపాట్లు ఉన్నట్లు గమనించి కర్మాగార అధికారులకు సమాచారం ఇచ్చారు. లోపాలను సరి చేసే వరకు కర్మాగారాన్ని మూసేయాలని సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ఆస్కారం ఉన్న కర్మాగారం అయినా .. సిబ్బంది , స్థానిక ప్రజలకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోలేదని పీసీబీ వివరించింది .
గడువు కావాలని కోరిన యాజమాన్యం
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పిన మాటలని గౌరవిస్తూ రెండు రోజులు ఉత్పత్తిని నిలిపివేసిన RFCL యాజమాన్యం తమకు కొంత సమయం ఇవ్వాలని కోరింది. ఆ సమయంలోగా సమస్యలు సరి చేస్తామని చెప్పడంతో , గడువును పెంచుతూ PCB పెర్మిషన్ ఇచ్చింది. దీంతో మళ్లీ ఉత్పత్తి మొదలు పెట్టారు యాజమాన్యం.
ఇకనైనా నిర్లక్ష్యం వీడండి..
RFCL యాజమాన్యం ఇకనైనా నిర్లక్యం వీడాలని… ఈ ప్రాంతంలో నివసించే ప్రజల గురించి ఆలోచించాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. త్వరగా సాంకేతిక లోపాలను సరి చేసి… RFCL నుండి వచ్చే వ్యర్ధాలు, వ్యర్థ నీరుని శుద్ధి చేసిన తర్వాతే వదలాలని సామాజిక కార్యకర్త మద్దెల దినేష్ అన్నారు.
ఉత్పత్తిని ప్రకటించిన ఆర్ఎఫ్ సిఎల్ CGM విజయ్ కుమార్ బంగర్..
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారంలో May - 2022 ఉత్పత్తులను యాజమాన్యం ప్రకటించింది. దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ కర్మాగారాన్ని ప్రారంభించారు.. 2021 మార్చ్ 22న కర్మాగారంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతంప్లాంట్లో ఉత్పత్తి అయిన Neem coatedయూరియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.
May - 2022లో కర్మాగారం 102516.48 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేశామని విజయ్‌కుమార్ తెలిపారు. ఇందులో తెలంగాణకు 47217.96 మెట్రిక్ టన్నులు, ఆంధ్ర ప్రదేశ్ కు 14634.27 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 14877.72 మెట్రిక్ టన్నులు, కర్ణాటక కు 22769.37 మెట్రిక్ టన్నులు, చత్తీస్‌గఢ్‌కు 3017.16 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు.
ప్రత్యేక కృతజ్ఞతలు..
ఈ సందర్భంగా, సంస్థ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్ధ్యాన్నిమరియు 102516.48 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించటంలో కీలకపాత్ర పోషించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు RFCL ముఖ్య కార్య నిర్వహణ అధికారి అభినందనలు తెలిపారు. అలాగే సంస్థకు మద్దతుగా ఉన్న రాష్ట్ర, జిల్లా యంత్రాంగానికి, కేంద్ర ఎరువులు, రసాయానాలు మంత్రిత్వ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.