(santosh, News18, Peddapalli)
ఏదైనా కళను ప్రదర్శించాలంటే మనలోని నైపుణ్యం ఆ కళకు తగ్గట్లుగా ఉండాలి. అలా ఉండాలంటే ఎక్కువగా శ్రమించాలి. ఆ శ్రమకు తగ్గట్లుగా ఆ కళ నైపుణ్య ఫలితం అనేది వస్తుంది. కానీ అంధులు ఒక కళను ప్రదర్శించాలి అంటే అదీ సాధ్యమేనా అనిపిస్తుంది. ఎందుకంటే వారికి కళ్ళు కనిపించవు కదా. ఎలా నేర్చుకుంటారు. ఎలా ప్రదర్శిస్తారు అనుకుంటారు. కానీ ఈ అంధులు మాత్రం అలా కాదు. ఆయన కళ చూస్తే ఓ అద్భుతం అని అనిపిస్తుంది.
పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ కి చెందిన అంధుడు దేసిని రామస్వామి గత 40 ఏళ్లుగా తబలా వాయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రామస్వామి పుట్టుకతోనే అంధుడు కావడంతో చిన్న వయసులోనే గోస్కుల కొమురయ్య అనే కళాకారుడు రామస్వామిని గుంటూరులోని ఓ తబలా కళాకారుని వద్ద నేర్పించాడు. దాదాపు ఎనిమిది రోజుల్లోనే తబలా నేర్చుకొని అద్భుత ప్రదర్శన చేశాడు. అప్పటి నుండి దాదాపు 40 ఏళ్ల నుండి ఇప్పటి వరకు తబలా వాయిస్తునే జీవనం సాగిస్తున్నాడు రామస్వామి. అడవి శ్రీరాంపూర్ ఉగ్గు కళాకారులకు, యక్ష కళాకారులకు రామస్వామి ఒక్కడే తబలా కళాకారుడు. కళాకారులకు సంబంధించి ఎక్కడ కార్యక్రమాలు జరిగినా రామస్వామి తబలా కీలకం.
తెలంగాణ ఉద్యమాల్లో కీలకం..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జానపద కళాకారుల పాత్ర ఓ మైలు రాయి. తెలంగాణ పాటలతో చౌరస్తా ధర్నాలో దరువు అదిరిపోయేది. అందులోరామస్వామి మిగితా కళాకారులతో పాటు కీలక పాత్ర పోషించాడు. ఉద్యమాల పాటలకు రామస్వామి తబలా కొడుతూ తన వంతుగా తన కళా పోషణ రాష్ట్ర సాధనలో కృషి చేశాడు.
తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలి..
తన కళా నైపుణ్యంతోనే కొన్నేళ్ళుగా జీవనం సాగిస్తున్నా..ప్రస్తుతానికి తబలా నైపుణ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత లేకపోవడంతో రామస్వామికి జీవనం ఇబ్బందిగా మారింది. అంధుడు కావడంతో వేరే పని చేయలేక వచ్చిన పనికి ఆదరణ లేక ప్రభుత్వం ఇచ్చే బియ్యంతోనే జీవనం సాగిస్తున్నారు రామస్వామి కుటుంబం. ప్రభుత్వం ఇచ్చే అంధుల ఫించను వస్తున్నా అది సరిపోవడం లేదు. ఒక కళాకారుడిగా గుర్తించి ఆ శాఖ నుండి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాడు రామస్వామి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana