E.Santosh, News18, Peddapalli
గులాబీ (Rose) ని చూడగానే పులకించని మనసు ఉండదు. రకరకాల రంగుల్లో దర్శనమిస్తూ పరిసరాలనే ఆహ్లాదకరంగా మారుస్తాయి గులాబీలు. అటువంటి గులాబీ తోటలకు చిరునామాగా మారింది పెద్దపల్లి జిల్లా (Peddapalli District) రామగుండంలోని భద్రపల్లె. గులాబీ సాగుచేస్తూ చక్కటి ఆదాయాన్ని పొందుతూ సాగుతున్నాడు యువ రైతు. నీరు సమృద్ధిగా ఉండటంతో పాటు, నేల అనుకూలంగా ఉంటే గులాబీలు విరగపూస్తూ.. రైతులకు లాభాల పంట పండిస్థాయి. అందుకే భద్రపల్లెకు చెందిన శ్రీనివాస్ అనే రైతు భూమి అనుకూలంగా ఉండటంతో సాధారణ పంట సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంట వేసేందుకు ముందుకు సాగి మార్కెట్లో డిమాండ్ ఉన్న గులాబీ తోట సాగు చేస్తున్నాడు.
బెంగళూరు (Bengaluru) నుంచి అర్కాస్ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తున్నాడు. బెంగళూరు నుండి రామగుండం భద్రపల్లెకు రావడానికి ట్రావెలింగ్ చార్జితో పాటు ఒక్క మొక్కల 50 రూపాయలు పడిందని శ్రీనివాస్ తెలిపాడు. ఒకటిన్నర ఎకరాల్లో మూడు వేల గులాబి మొక్కలు నాటి పెంపకం చేస్తున్నాడు. నాలుగు నెలల తరువాత నుండి చెట్లు మొదటి కటింగ్ వచ్చిందని తెలిపాడు. ఒక్కసారి కట్టింగ్ కు వచ్చిన తరువాత రోజు తరువాత రోజూ కటింగ్ కు వస్తాయని శ్రీనివాస్ అన్నారు. కొత్తగా కటింగ్ కాబట్టి ఒక్కో కటింగ్ కు 10 కిలోల పువ్వులు వస్తాయని.. కొద్ది రోజులకు పూల సామర్థ్యం పెరిగి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపాడు.
శ్రీనివాస్ మొదట్లో వరి నాటు వేసే వాడు కాగా గిట్టుబాటు రాక నష్టాల్లో కురకుపోయి వ్యవసాయానికి దూరంగా ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహించారు. అయితే వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఉద్యోగం వదిలేసి ప్రత్యామ్నాయ పంట వేయాలని నిర్ణయించుకొని భద్రపల్లెలో 4 ఎకరాలు భూమిని లీజుకు తీసుకుని గులాబీ పూల పంట సాగు చేస్తున్నాడు.
నాలుగు ఎకరాల్లో కొంత భాగంలో గులాబీ తోట, కొంత జామ తోట, మునగ, వంకాయ ఇలా పూలు మరియు కూర గాయాల పండిస్తూ అధిక లాభాలు గడించే విధముగా దీర్ఘకాలిక పంటలు వేస్తున్నాడు. గులాబీకి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండడం, వేసవి కాలంలో పెళ్లిళ్ల సిజన్.. ఇవన్నీ కూడా గులాబీకి ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉండడంతో రైతు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పెళ్ళిళ్ళకి పూలను సరఫరా చేస్తానని.. కావాల్సిన వాళ్ళు సంప్రదిస్తే హోల్ సేల్ ధరకు పంపిస్తానని చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana