హోమ్ /వార్తలు /తెలంగాణ /

Business Idea: ఈ మహిళల ఐడియా అదరహో: మిల్లెట్స్ బిస్కెట్స్ తయారీతో లక్షల సంపాదన

Business Idea: ఈ మహిళల ఐడియా అదరహో: మిల్లెట్స్ బిస్కెట్స్ తయారీతో లక్షల సంపాదన

పెద్దపల్లి

పెద్దపల్లి మహిళల బిజినెస్​

పెద్ద చదువులు లేకపోయినా మంచి అనుభవం, నేర్పరితనం ఉంటే జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఇదే సూత్రాన్ని పాటించిన కొందరు మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తూ తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (E. Santosh, News18, Peddapalli)ఆడాళ్లా మజాకా.. వాళ్లు తలుచుకుంటే సాధించలేనిది ఏమైనా ఉందా. ఇంటా బయట, వ్యక్తిగతంగా వృత్తి పరంగా మహిళలు (Women) ఎన్నో విజయాలు సాధిస్తున్నా స్వేచ సంకెళ్ళు వారిని వెనక్కి లాగుతూనే ఉంటాయి. కానీ ఒక్క అవకాశం (Business Idea) ఆ స్త్రీ మూర్తులను సిరిగల మహాలక్ష్ములుగా మారుస్తుంది. పెద్ద చదువులు లేకపోయినా మంచి అనుభవం, నేర్పరితనం ఉంటే జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఇదే సూత్రాన్ని పాటించిన కొందరు మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తూ తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.
  పెద్దపల్లి (Peddapalli) జిల్లాలోని రామగిరి ఖిల్లాను అడ్డాగా చేసుకొని స్త్రీ శక్తిని చాటుతున్నారు కొందరు మహిళలు. రామగిరి (Ramagiri) మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళలు స్వయం ఉపాధి ద్వారా రాణిస్తూ ఇప్పుడు ఎందరో ఆడబిడ్డలకు ఆదర్శంగా నిలిచారు. చిరుధాన్యాలతో బిస్కెట్లు, కేకులు, రాగి మాల్ట్‌తో పాటు పోషకాహర ఉత్పత్తులు తయారు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడాలన్న పట్టుదలతో నాగారంకు చెందిన మహిళలు మద్దెల మల్లీశ్వరి, బొడ్డు మల్లేశ్వరి, ప్రవలిక, శ్రీలతలు ఒక గ్రూపుకు ఏర్పడి ఏదైనా వ్యాపారం చేయాలని భావించారు.


  రామగిరి ఖిల్లాలో 2010 నుంచి కృషి విజ్ఞాన కేంద్రం పనిచేస్తున్నది. ఈ కేంద్రం ఆధ్వర్యంలో నాగారంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిరుధాన్యాలతో పలురకాల ఉత్పత్తులు తయారు చేసేలా అక్కడి మహిళలకు శిక్షణ ఇచ్చారు. "వనితా జ్యోతి గ్రామైక్య సమాఖ్య" పేరుతో కొంతమంది మహిళలను ఓ గ్రూపుగా చేర్చి పది రోజుల పాటు శిక్షణ అందించారు. వారిలో ఈ నలుగురు మహిళలు ఉన్నారు.
  శిక్షణ (Training) అనంతరం రూ. 1.50 లక్షలతో ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామగ్రిని, యంత్రాలను సైతం కృషి విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు అందజేశారు. అప్పటి నుంచి చిరుధాన్యాలతో పలు రకాల ఉత్పత్తులు తయారుచేయడం మొదలు పెట్టారు నాగారం వనితలు. వారి ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ఆదరణ దక్కడంతో కొత్తగా ‘సిరి ఫుడ్ ప్రొడక్ట్స్’ పేరుతో మరిన్ని ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్లు తయారుచేస్తున్న మిల్లెట్ బిస్కెట్లు (Millet biscuits), కేకులు(Cakes), దిల్ పసంద్, బ్రెడ్, రాగి మాల్ట్(Ragi malt), మల్టీ గ్రెయిన్ పిండి (Multi-grain)ని….పెద్దపల్లి , మంథని, గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్లలో..వేములవాడ, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. అంతేకాదు సింగరేణి, రామగుండం, ఎన్టీపీసీ, జేఎన్టియూ ప్రాంతాల్లో వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు.
  ప్రత్యేకించి ఎవరికైనా ప్రైవేట్ ఆర్డర్లు కావాలన్నా తాము తయారు చేసి ఇస్తున్నామని మహిళలు చెబుతున్నారు. ఆర్డర్ల కోసం సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్ సిరి ఫుడ్ ప్రొడక్ట్స్ : +91 9949581665.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Business Ideas, Local News, Peddapalli, Women

  ఉత్తమ కథలు