Peddapalli: గతంలో కర్నూలులో ఓ వ్యక్తి నీటిపై ఆసనం వేస్తున్నట్లు పత్రికల్లోచూసి తాను సైతం పట్టుదలతో నీటిపై యోగాసనాలు వేయడం ప్రారంభించారు. కృష్ణమూర్తి యోగాపై పట్టు సాధించడంతో ఆయనను ఆదర్శంగా తీసుకున్న కొందరు స్థానికులు సైతం నీటిపై యోగా నేర్చుకోవాలని ముందుకువచ్చారు.
(santosh,News18,Peddapalli)
జీవితంలో కొన్ని విషయాలు కనుగొనడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, మానవుని యొక్క జీవన శైలిని సులభతరం చేయడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలాంటివాటిల్లో యోగా కూడా ఒకటి. మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతూ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది యోగా. నిస్సందేహంగా మనిషి శరీరం చేయగలిగే అత్యుత్తమ వ్యాయామాల్లో యోగా (Yoga)ప్రథమ స్థానంలో ఉంది. అందుకే మన దేశంలో పుట్టిన యోగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుంటుంది. యోగాలో ఎన్నో రకాల ఆసనాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అన్నిసార్లు అన్ని ఆసనాలు వేయలేరు కానీ సందర్భాన్ని బట్టి యోగా చేస్తుంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడని నిరూపితం అయింది.
నేల మీద కాదు నీటిపై యోగా సాధన చేస్తున్న వ్యక్తి:
సాధారణంగా నేల మీద యోగా చేస్తుంటారు. ఒంటికాలిపై, తలకిందులుగా, ఒక్క చేతిపై నిలబడి..ఇలా అనేక రకాల ఆసనాలు నేలపై చేయవచ్చు. కానీ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి మాత్రం నీటిపై యోగా చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. గోదావరిఖనిలోని సింగరేణిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న రమేష్..ఇలా నీటిపై పలురకాల యోగా ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తున్నారు. సింగరేణి క్వార్టర్స్ ఈతకొలనులో కోచ్‌గా పనిచేస్తున్న కృష్ణమూర్తి ఇక్కడ యువకులకు ఈత నేర్పిస్తారు. తనతో పాటు ఔత్సాహికులకు ఇలా నీటిపై యోగాలో శిక్షణ కూడా ఇస్తున్నారు కృష్ణమూర్తి. ఆయన వద్ద యోగా నేర్చుకున్న రమేష్ సైతం ఇలా నీటిపై యోగా చేస్తూ అబ్బురపరుస్తున్నారు. ఆసనం తీరును బట్టి అరగంట నుంచి గంట వరకు కదలకుండా నీటిపైన ఒకే ఆసనంలో ఉండడం తోటి ఈతగాళ్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
40ఏళ్లుగా ..
గత నలభైఏళ్లుగా క్రమంతప్పకుండా ఈతకు వస్తున్నాడు రమేష్. ఈక్రమంలో కోచ్ కృష్ణమూర్తి శిక్షణ ఇస్తుండగా..నీటిపై యోగా మొదలు పెట్టాడు. కోచ్ కృష్ణమూర్తి శిక్షణలో కేవలం 30 రోజుల్లో నీటిపై సునాయాసంగా యోగాసనం వేయడం నేర్చుకున్నాడు. రోజు ఒక గంట లేదా రెండు గంటల పాటు యోగా చేస్తేనేగానీ ఇంటికి వెళ్లనని అంటున్నాడు రమేష్. ఇలా రోజూ యోగా చేయడం వలన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నాడు.
ఈత కోచ్‌గా పనిచేస్తున్న కృష్ణమూర్తి యోగా సాధన వైపు:
స్విమ్మింగ్ కోచ్‌గా ఔత్సాహిక ఈతగాళ్లకు మార్గదర్శనం చేస్తూ వివిధ స్థాయిల్లో పోటీలకు కూడా పంపిస్తుంటారు కృష్ణమూర్తి. ఆయన వద్ద ఈత నేర్చుకొన్న కొందరు యువకులు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు కైవసం చేసుకున్నారు. అయితే ఈత కోచ్‌గా కొనసాగుతూనే నీటిపై యోగాలో పట్టు సాధించారు కృష్ణమూర్తి. గతంలో కర్నూలులో ఒక వ్యక్తి నీటిపై ఆసనం వేస్తున్నట్లు పత్రికల్లో రావడంతో తాను సైతం పట్టుదలతో నీటిపై యోగాసనాలు వేయడం ప్రారంభించారు. కృష్ణమూర్తి యోగాపై పట్టు సాధించడంతో ఆయనను ఆదర్శంగా తీసుకున్న కొందరు స్థానికులు సైతం నీటిపై యోగా నేర్చుకోవాలని ముందుకువచ్చారు. ఆయన మార్గదర్శనంతో కొందరు యువకులు ఆసనాలు వేయడంలో రాణిస్తున్నారు. గోదావరిఖనిలోని సింగరేణి స్విమ్మింగ్ పూల్‌కి వచ్చేవారిలో ఐదారుగురు సునాయాసంగా ఇలా నీటిపై వివిధ రకాల ఆసనాలు వేస్తూ అబ్బురపరుస్తున్నారు.
నేర్చుకోవాలనుకునే వారు..
నీటిపై తేలుతూ యోగా చేయడానికి గురువు కృష్ణమూర్తి సిద్ధంగా ఉన్నారు. నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులు యోగా కోచ్ కృష్ణమూర్తి ఫోన్ నెంబర్, 9849222778కి కాల్ చేయవచ్చు. లేదంటే ఆయన అసిస్టెంట్ రమేష్(Ramesh) ఫోన్ నెంబర్ +91 9949441744కి కాల్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.