Home /News /telangana /

PEDDAPALLI PEDDAPALLI DISTRICT RESIDENT GIVE TRAINING FOR CHILDREN IN WUSHU SPORT AS NATIONAL LEVEL ATHLETES SNR PSE BRV

Peddapalli : ఉషు క్రీడలో రాణిస్తున్న పెద్దపల్లి జిల్లా బాలలు .. ఆ ఆరుగురి ట్రాక్‌ రికార్డే వేరు

(

( లిటిల్ ఛాంపియన్స్)

Peddapalli: క్రీడాకారులు ఎక్కడివారైనా క్రీడాస్ఫూర్తి మాత్రం ఒకటే. ఆట, అలసట, ఆరాటం అన్నీ గెలుపు కోసమే. అదే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ లిటిల్ ఛాంపియన్స్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆరుగురు చిన్నారులు ఉషు క్రీడలో సత్తా చాటుతున్నారు. కోచ్‌ రాధే శ్యాం ట్రైనింగ్‌లో జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (santosh,News18,Peddapalli)
    భాషలు వేరైనా భావం మాత్రం ఒకటే.. క్రీడాకారులు ఎక్కడివారైనా క్రీడాస్ఫూర్తి మాత్రం ఒకటే. ఆట, అలసట, ఆరాటం అన్నీ గెలుపు కోసమే. అదే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ లిటిల్ ఛాంపియన్స్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆరుగురు చిన్నారులు వుషు క్రీడ (Wushu Game)లో సత్తా చాటుతున్నారు. ఉషు’ క్రీడా అంటే క్రీడలతో పరిచయమున్న వారిలోనూ చాలా మందికి తెలియని క్రీడ ఇది. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఏ కొద్ది మంది వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లకు కూడా ఈక్రీడ పరిచయమే తప్ప, అందులో నియమనిబంధనలపై అవగాహన చాలా తక్కువ. ‘ఉషు’ లేదా \"వుషు\" అనే పదం మాండోరిన్ భాష నుంచి వచ్చింది. ఉ, వు అంటే..రణం (యుద్ధం), షు అంటే.. కళ (విద్య) అని అర్థం. యుద్ధకళల్లో ఒకటిగా దీన్ని భారతదేశానికి చెందిన బోధిసత్తుడు అనే వ్యక్తి ప్రపంచానికి (ముఖ్యంగా గౌతమబుద్ధుని ఆరాధించే ప్రాంతాలకు) పరిచయం చేసినట్లు తెలుస్తోంది.

    ఏమిటీ \"వుషు క్రీడ\"? ఎక్కడి నుంచి వచ్చింది?:
    కిక్‌లు...పంచ్‌లు...ఎదుటివారిని పడగొట్టే సామర్ధ్యం. ఇది బాక్సింగ్ కాదు..కరాటేకు సంబంధం లేదు. కానీ, అంతర్జాతీయంగా ఒలింపిక్ సంఘం గుర్తించిన క్రీడ. అందుకే ఇది విశ్వ క్రీడల్లోనూ భాగం అయింది. కరాటే..జూడో.. బాక్సింగ్ మిలితమై ఉండే క్రీడ ఉషు. చేతులకు బాక్సింగ్ మాదిరిగా గ్లోవ్స్, తలకు రక్షణగా హెడ్ బ్యాండ్ ధరించాలి. నడుం నుంచి మెడ భాగం వరకు ఫెదర్ దుస్తులు ధరించాలి. లెగ్ కిక్‌తో స్పారింగ్‌లో ఇద్దరు ఆటగాళ్లు పోటీపడాలి. అటువంటి ఈ ఉషు క్రీడలో ప్రావీణ్యం సంపాదించారు గోదావరిఖని పట్టణానికి చెందిన చిన్నారులు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పలు పతకాలు సాధించిన ఆరుగురు చిన్నారులు, ప్రస్తుతం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం యూత్ ఒలింపిక్స్ లో ఈ క్రీడకు గుర్తింపు ఇవ్వడంతో, కరాటే.. జూడో.. బాక్సింగ్ లో ప్రావీణ్యం ఉన్న క్రీడాకారులు ఉషుపై ఆసక్తి కనబరస్తున్నారు. గోదావరిఖనికి చెందిన ఆరుగురు బాలలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

    ఇది చదవండి : నిజామాబాద్‌లో షాపింగ్‌మాల్ సిబ్బంది నిర్లక్ష్యం..మంచినీళ్లడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చాడు



    గోదావరిఖనిలో మాస్టర్ రాధే శ్యాం పర్యవేక్షణలో శిక్షణ:
    ఇప్పుడిప్పుడే ఈ ఉషు ఆటకు ప్రాధాన్యం పెరుగుతుంది. నగరాల్లోనూ అడపాదడపా ఒకరిద్దరు కోచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మాస్టర్ రాధే శ్యాం పర్యవేక్షణలో ఈ బాల క్రీడాకారులకు శిక్షణ అందిస్తున్నారు. చిన్నారులను సుశిక్షితులను చేస్తున్న రాధే శ్యాం, వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు సిద్ధం చేయడంతో పాటు, ఒలింపిక్స్ పోటీలకు సన్నద్ధం చేసేలా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు.

    బాల క్రీడాకారులు, వారి విజయాలు:
    సి.హెచ్ పార్ధు: ఇప్పటికే కరాటేలో నాలుగు పతకాలు సాధించిన సి.హెచ్. పార్ధు ఉషు పోటీల్లో బంగారు పతకం సాధించాడు. 14 ఏళ్ల వయసున్న పార్ధు 56 కిలోల విభాగంలో పోటీ పడి ఉషు ఆటలో బంగారు పతకం కైవసం చేసుకొని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కరాటే, జూడోలోనూ ప్రావీణ్యం ఉంది. గోదావరిఖనిలోని ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నపార్ధు ఒలింపిక్ పోటీల్లో పాల్గొనాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నట్లు వివరించాడు.

    డీ. ధర్మ తేజ: ఒలింపిక్స్ లక్ష్యంగా ఉషు ఆట సాధన చేస్తున్నాడు డి. ధర్మ తేజ. ఉషుపోటీల్లో 14 ఏళ్లు- 48 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న ధర్మ తేజ హైదరాబాద్, కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించాడు.

    ఎస్.కే అర్యా: 10 ఏళ్లు - 21 కిలోల విభాగంలో పోటీపడ్డ ఎస్.కె. ఆర్య బంగారు పతకం సాధించాడు. గతంలో హైదరాబాద్, ఖమ్మం, బెల్లంపల్లిల్లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకాలు సాధించాడు. 4వ తరగతి చదువుతున్న ఆర్య, సబ్ జూనియర్ స్థాయి విభాగంలో హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు.

    ఎస్.కే. రియాన్: పట్టుదలతో సాధన చేస్తున్న ఎస్.కె.రియాన్ జాతీయ స్థాయి పోటీలపై గురిపెట్టాడు. 12 ఏళ్లు- 42 కిలోల విభాగంలో ఉషు పోటీల్లో పాల్గొన్న రియాన్ బంగారు పతకం సాధించాడు. 7వ తరగతి చదువుతున్న రియాన్, వరంగల్, హైదరాబాద్, బెల్లంపల్లిల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

    ఎండీ గౌస్: జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకంపై గురిపెట్టాడు ఎండీ గౌస్. 12 ఏళ్లు - 30 కిలోల విభాగంలో పోటీ పడ్డ గౌస్ తనదైన శైలిలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. సునాయాసంగా బంగారు పతకం సాధించాడు. గతంలో హైదరాబాద్, బెల్లంపల్లిలో నిర్వహించిన కరాటే పోటీల్లో రాష్ట్రస్థాయిలో రెండు బంగారు పతకాలు సాధించాడు.

    ఎస్.కే. అయాన్: జాతీయ స్థాయి పోటీల్లో రాణించేందుకు క్రమశిక్షణతో సాధన చేస్తున్నాడు ఎస్.కే.అయాన్. 10 ఏళ్లు - 42 కిలోల విభాగంలో పోటీపడ్డ అయాన్, ఫైనల్ పోటీల్లోప్రత్యర్థిని మట్టికరిపించాడు. తనదైన పంచ్‌లతో ముచ్చెమటలు పట్టించాడు. సైనిక్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. వరంగల్, హైదరాబాద్, బెల్లంపల్లిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించాడు.

    ఉషు క్రీడ కోచ్: రాధే శ్యాం,
    లొకేషన్ : గోదావరిఖని
    ఫోన్ నెంబర్: 919908188626
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Local News, Peddapalli

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు