Home /News /telangana /

PEDDAPALLI OCP MINING AND FERTILIZER FACTORY CAUSING AIR POLLUTION AND POSING THREAT IN AND AROUND RAMAGUNDAM BRV PSE PRV

Peddapalli: ఆ ప్రాంతాన్ని కాపాడేదెవరు..? మైనింగ్ ఓ పక్క, ఫ్యాక్టరీ విషవాయువులు మరో పక్క.. అస్సలు పట్టించుకోరా?

గోదావరిఖని

గోదావరిఖని ప్రాంతంలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం

పెద్దపల్లి జిల్లా రామగుండం - గోదావరిఖని ప్రాంత ప్రజలు కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పేరుకే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు ఇక్కడ ఉన్నప్పటికీ ఆయా పరిశ్రమల నుంచి విడుదలయ్యే విషవాయువులు ఇక్కడి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది.

ఇంకా చదవండి ...
  (E. Santhosh, News 18, Peddapalli)

  పెద్దపల్లి (Peddapalii) జిల్లా రామగుండం - గోదావరిఖని ప్రాంత ప్రజలు కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పేరుకే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు ఇక్కడ ఉన్నప్పటికీ ఆయా పరిశ్రమల నుంచి విడుదలయ్యే విషవాయువులు ఇక్కడి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఒక వైపు ఫ్యాక్టరీలు (Factories), మరోవైపు ఓపెన్ క్యాస్ట్ మైనింగ్‌లు (Open cast Mining) ఈ ప్రాంతాలను చుట్టుముట్టడంతో ఇక్కడ గాలి, నీటి కాలుష్యం (Water and Air Pollution) తీవ్రంగా కనిపిస్తుంది. గాలి కాలుష్యం, నాణ్యతపై గోదావరిఖని ప్రాంతంలో ఇటీవల చేపట్టిన ఓ సర్వే.. ఇక్కడ కాలుష్యం (Pullution) స్థాయిలు ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. దీంతో పట్టణ వాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.

  కాలుష్య కారకాలుగా బడా పరిశ్రమలు:

  రామగుండం (Ramagundam) పరిధిలో గోదావరి బ్రిడ్జి ఆనుకుని ఇందారం ఓసీపీ, గోదావరిఖని ఓసీపీ మైనింగ్ ఉన్నాయి. మైనింగ్ ప్రాంతం నుంచి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు బొగ్గు సేకరించి వెళ్తుంటాయి. ఆ సమయంలో ఆయా వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు, బొగ్గు గని నుంచి కూడా నుసి బయటకు వస్తుంది. ఇది గాలి కాలుష్యానికి కారణం అవుతుంది. ఇటు రామగుండంలోను ఎఫ్‌సీఐ ఎరువుల కర్మాగారం నుంచి విష పూరితమైన వాయువులు వెలువడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.  రామగుండం ఎరువుల కర్మాగారం (Ramagundam Fertilizer Factory) నుంచి సాంకేతిక కారణాల వల్ల లీక్ అయ్యే అమ్మోనియా సమీప ప్రాంత ప్రజలను అనారోగ్యాలకు గురి చేస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ఓసీపీ మైనింగ్ లో చేపట్టే బ్లాస్టింగ్ ద్వారా, బొగ్గు రవాణా సమయంలో విడుదలయ్యే నుసి కారణంగా పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణపై ఆయా పరిశ్రమల వర్గాలు శ్రద్ద తీసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  వాయు, నీటి కాలుష్యంతో అనారోగ్యాలు:

  వాయు, నీటి కాలుష్యం మనుషుల ఆరోగ్యంపై (Health) తీవ్ర ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులపై ప్రభావం.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయ జబ్బులు వంటి సమస్యలతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. గోదావరిఖని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యంపై స్థానిక వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలంటూ స్థానిక వైద్యురాలు సూచిస్తున్నారు. ఉదాహరణకు గాలిలోని నుసి (పార్టిక్యులేట్ మ్యాటర్) ఇది మనకు తెలియకుండానే మన రక్షణ వ్యవస్థను ఛేదించుకొని ఒంట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 2.5 మైక్రాన్ల సైజుగల నుసి గాలిలో ఎక్కువసేపు తేలియాడుతూ ఉంటుంది. ఇది శ్వాస ద్వారా తేలికగా ఊపిరితిత్తుల లోపలి భాగాలకు చేరుకుంటుంది.

  ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ మార్పిడి అయ్యే గాలి గదుల వరకు చొచ్చుకుపోవచ్చు. కాలుష్య కారకాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతరత్రా భాగాలకు చేరుకోవచ్చు. ఇది పూడికలకు, రక్తనాళాల లోపలి మార్గం సన్నబడటానికి దారితీస్తుంది. దీంతో రక్తపోటు పెరిగి, క్రమంగా గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బుల ముప్పు పెరుగుతుంది. ఆయా భాగాలలో వాపు ప్రేరేపితం కావటం వల్ల కాలేయ జబ్బులు, క్యాన్సర్లు వంటివి తలెత్తొచ్చు.

  గాలి కాలుష్యంతో సంతాన లేమి, అల్జీమర్స్ కూడా తలెత్తవచ్చు. భూమిలో కలిసే కాలుష్య కారకాలు ఏడీహెచ్ డీ, ఆటిజం వంటి నాడీ సమస్యలకు... అలాగే ఎముకల జబ్బులకు దారితీయవచ్చు. జబ్బులను ప్రధానంగా ఇన్‌ఫెక్ష‌న్స్‌, పోషణ సమస్యలు, జీవనశైలితో తలెత్తే, క్యాన్సర్లు, పుట్టుకతో వచ్చే లోపాలు, వృత్తి పర్యావరణంతో ముడిపడినవి పలు రకాల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటది.

  నివారణ మార్గాలు..

  నిజానికి జబ్బులన్నింటికీ నివారణ మార్గాలున్నాయి. వీటికి చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వృత్తి ప‌ర్యావ‌ర‌ణానికి సంబంధించిన జ‌బ్బులను నూటికి నూరు శాతం నివారించుకునేందుకు వీలుంది. వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, మాస్కుల వాడ‌కం, ర‌క్ష‌ణ ప‌రిక‌రాలు ధ‌రించ‌డం, కాలుష్య నియంత్ర‌ణ మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించ‌డం ద్వారా వీటిని కొంత వరకైనా నివారించ‌వ‌చ్చని వైద్యులు సూచిస్తున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Air Pollution, Local News, Peddapalli, Ramagundam

  తదుపరి వార్తలు