హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapalli: రక్త పరీక్షకు ట్యూబులు లేవు.. ఈసీజీకి పేపర్ లేదు..దవాఖానాలో దీన పరిస్థితి !

Peddapalli: రక్త పరీక్షకు ట్యూబులు లేవు.. ఈసీజీకి పేపర్ లేదు..దవాఖానాలో దీన పరిస్థితి !

godavarikhani hospital

godavarikhani hospital

గత పక్షం రోజులుగా రక్తపరీక్షలు చేసుకోవాలనుకున్నవారు..  అవసరమైన ట్యూబులను నేరుగా ప్రైవేటులో కొని తెచ్చుకుంటున్నారు. అంతేకాదు, కాగితం కొరతతో గత వారం రోజులుగా ఆస్పత్రిలో 'ఈసీజీ' సేవలు నిలిచిపోయాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Peddapalle, India

రిపోర్టర్ : సంతోష్

లొకేషన్ : గోదావరిఖని

ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్యం అందిస్తున్నామని గొప్పలు చెపుతున్నా.. నాయకులు అవి ఆచరణలో ఉన్నాయా లేవా అనేవి తెలుసుకోవాలి. లేదంటే ఒక్కసారి వాళ్ళే వెళ్లి ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స చేయించుకోవాలి. అప్పుడు అయితేనే వైద్యం ఎలా అందుతుంది.. ఎలాంటి పరీక్షలు చేస్తున్నారు.. ఎలాంటి చికిత్స అందిస్తున్నారు అనేది తెలుస్తుంది. లేదంటే చెప్పేది ఏమో గొప్ప మాటలు.. చేసేది ఏమో నీటి మూటలు అన్నట్లే అవుతుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితి ఇలాగే ఉంది.  గత కొద్ది రోజులుగా ఇక్కడి సర్కార్ దవాఖానాలో  రక్తపరీక్షలు జరగడం లేదు.

రక్త నమూనాలను సేకరించే ట్యూబులు లేకపోవడంతో గత పక్షం రోజులుగా రక్తపరీక్షలు చేసుకోవాలనుకున్నవారు..  అవసరమైన ట్యూబులను నేరుగా ప్రైవేటులో కొని తెచ్చుకుంటున్నారు. అంతేకాదు, కాగితం కొరతతో గత వారం రోజులుగా ఆస్పత్రిలో 'ఈసీజీ' సేవలు నిలిచిపోయాయి. నాలుగైదు రోజులుగా శస్త్ర చికిత్సలో కీలకమైన మత్తు ఇంజక్షన్లకు సంబంధించిన వాయిల్స్ లేకపోవడంతో తరచూ శస్త్ర చికిత్సలను వాయిదా వేస్తున్నారు.

గర్భిణులకు అత్యవసరమైన మందులు సైతం ఎవరికి వారుగా ప్రైవేటులో కొనుక్కోవాల్సిందే. ఇదీ గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రిలోని వైద్య సేవల దుస్థితి. ఉద్యోగమేమో ప్రభుత్వ ఆసుపత్రిలో.. చేసేదేమో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం. ప్రభుత్వ ఆసుపత్రిలో చేయాల్సిన డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషంట్ లను నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఒక్క డాక్టర్ అదనపు సంపాదన కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. కొంత మంది డాక్టర్లు అయితే ఏకంగా ఆసుపత్రిలే పెట్టేశారు. ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి, మధ్యాహ్నం నుండి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంటున్నారు.

అందుకే ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం ఉదయం మాత్రమే ఓపీలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఆరోగ్య శాఖ మంత్రి ఒక్కసారి గోదావరిఖనిలోని ఆసుపత్రికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ, ఇతర నిధులను స్థానిక అవసరాలకు వినియోగించుకోవాలని మంత్రి స్పష్టం చేసినా గోదావరిఖని ఆస్పత్రి నిర్వాహకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో వచ్చే వారికి వైద్యులు సీబీపీతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలు రాస్తుంటారు. లాబొరెటరీకి వెళ్తే అందులో సీబీపీ సదుపాయం లేకపోగా ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా అందులోని మిగతా వైద్య పరీక్షలు చేసి ఇవి సరిపోతాయంటూ పంపిస్తున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. వీటిపై అవగాహన ఉన్నవారు గొడవకు దిగుతున్నారు.

గుండెపోటు లాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మొదటగా చేయాల్సిన ఈసీజీ సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు ల్యాబులకు వెళ్లక తప్పడం లేదు. గోదావరిఖనికి చెందిన ఓంకార్ అనే వ్యక్తి నడుస్తుంటేనే ఆయాసం వస్తుందని గోదావరిఖని సార్వజనిక ఆస్పత్రికి వస్తే.. ఈసీజీ తీసేందుకు అవసరమైన పేపరు లేదని తిప్పి పంపారు. ఆయాసం తగ్గకపోవడంతో భయమేసి ప్రైవేటుకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అవేదన వ్యక్తం చేశాడు. ఇలా ఒక్కరు అనే కాదు చిన్న చిన్న సమస్యలతో కూడా చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారు.

First published:

Tags: Government hospital, Hospitals, Local News, PEDDAPALLI DISTRICT

ఉత్తమ కథలు