E. Santosh, News18, Peddapalli
మావోయిస్ట్ వారోత్సవాల నేపథ్యంలో రామగుండం కమిషనరేట్ పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ తలదాచుకున్న వారిని పోలీసులు విచారించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్ ఏన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీ, భీముని పట్నం ప్రాంతంలో డీసీపీ రూపేష్ ఐపిఎస్, గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, ఎన్టీపీసీ గోదావరిఖని పోలీసులతో ఆకస్మిక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఈ ప్రాంతాల్లో నివాసముంటున్న సుమారు 600 మందిని వ్యక్తిగత వివరాలు సేకరించి, వారి ముఖగుర్తింపు మరియు వారి వేలిముద్రలు సేకరించారు పోలీసులు. పలువురు అనుమానితులను గుర్తించి గతంలో వారిపై ఏదైనా నేరాలు ఉన్నాయా అనే వివరాలు చెక్ చేశారు పోలీసులు.
సీపీఐ ఎంఎల్ పీపుల్స్ వార్ సంస్థ, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఎంసీసీ విలీనం జరిగి సీపీఐ మావోయిస్టుగా ఏర్పడి సెప్టెంబర్ 21వ తేదీ నాటికి 16 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు వారోత్సవాలు జరపాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈక్రమంలో పెద్దపల్లి జిల్లా సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంపై మావోయిస్టులు తమపట్టు సాధించుకునేందుకు అలజడి రేపాలన్న ఆలోచనలో ఉన్నారని, ఇప్పటికే ఈ ప్రణాళికను అమలు చేసేందుకు యాక్షన్ టీం ఒకటి చెన్నూరు మీదుగా గోదావరిఖనిలోకి వచ్చిందన్న సమాచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే గత మూడు నాలుగు రోజులుగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
రామగుండం ఎమ్మెల్యే టార్గెట్టా?
మావోయిస్టులు గత ఆగస్టు నెలలోనే ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించారని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో జరిగిన ఉద్యోగ కుంభకోణంపై రామగుండం ఎమ్మేల్యే కొరుకాంటి చందర్‌కు మావోలు హెచ్చరిక లేక జారీ చేశారు. బాధితులకు డబ్బులు తిరిగి ఇవ్వకుంటే ప్రజా క్షేత్రంలో శిక్ష తప్పదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆర్‌ఎఫ్‌సిఎల్ బాధితుల కుంభకోణంలో దళారులు రిమాండులో ఉండగా వీరి జాబితాలో ఇంకా ఎవరు ఉన్నారో తెలియాల్సి ఉంది. ఎమ్మేల్యే చందర్ కూడా ప్రోగ్రామ్స్ అన్ని రద్దు చేసుకోగా పోలీసులు అప్రమత్తం చేశారని తెలుస్తోంది.
మావోయిస్ట్ లిస్టులో దళారులు ఎంత మంది?
రామగుండం నియోజికవర్గంలో సంచలనం కలిగించిన ఆర్‌ఎఫ్‌సిఎల్ ఉద్యోగ కుంభకోణంలో ఇప్పటికే మావోలు హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు కొంత మంది అనుచరుల పేర్లు పేర్కొన్నారు. లిస్టులో ఉన్న కొంత మంది దళారులు జైల్లో ఉన్నారు. బాధితుల నుండి డబ్బులు దండుకుని పర్సెంటేజి పంచుకున్న వారు ఇంకెందరో ఉన్నారు. ఆ లిస్టు కూడా మావోల వద్ద ఉండిఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఇక మావోయిస్టుల కదలికల నేపథ్యంలో రామగుండం సరిహద్దుల్లో పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Maoist, Peddapalli, Telangana