పొదుపు సంఘాలను ప్రోత్సహించేందుకు పట్టణ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వడ్డీ లేని రుణాలను బ్యాంకు లింకేజీ ద్వారా ప్రతి సంవత్సరం మహిళలకు చెల్లిస్తున్నారు. రుణాల లక్ష్యాన్ని చేరుకుని అర్హత సాధించిన సంఘాలకు అందిస్తున్న రుణాలపై వడ్డీని మాత్రం ప్రభుత్వం 2017 నుంచి విడుదల చేయడం లేదు. ఫలితంగా ప్రతీ సంవత్సరం రుణాలు తీసుకుంటున్న మహిళా సంఘాల సభ్యులే మొత్తం చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో రుణాలతో ఉపాధి పొందాలనుకునే మహిళలు వడ్డీ భారం పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. సంఘాల మహిళలు వడ్డీ భారం మోయాల్సి వస్తోంది. ఆరేళ్లుగా ప్రభుత్వం మహిళా సంఘాలు తీసుకుంటున్న రుణాలకు వడ్డీ విడుదల చేయడం లేదు.
బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం ఆ భారం చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులకు రుణభారం పెరిగిపోతోంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు వడ్డీ భారం కారణంగా రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
ఈ ఏడాది ఇప్పటి వరకు పెద్దపల్లి జిల్లాలో6493 సంఘాలు రుణాలు తీసుకున్నాయి. మొత్తం 8802 సంఘాలు ఉండగా అందులో కేవలం కొద్ది మేరకు సంఘాలు మాత్రమే రుణాలు తీసుకోవడానికి ముందుకు వచ్చాయి. వంద శాతం రుణాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నా అంతగా ఆసక్తి చూపడం లేదు.
ఈ ఏడాది రూ. 376.60కోట్ల రుణాలు తీసుకున్నారు.రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు మూడేళ్లలో పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో రుణాలు తీసుకున్న సంఘాల సభ్యులపై ఎంతమేర వడ్డీ భారం పడిందనే వివరాలను బ్యాంకుల నుంచి అధికారులు సేకరిస్తున్నారు. ఆరేళ్లలో బ్యాంకు లింకేజీ రుణాలు, చెల్లించిన వడ్డీ వివరాలను ప్రభుత్వానికి నివేదించే పనిలో పడ్డారు. సకాలంలో రుణాలు చెల్లించిన సభ్యులకు మొత్తం వడ్డీని విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వడ్డీ నిధులు విడుదల కావాల్సి ఉందని డిఆర్డిఓ శ్రీధర్ అన్నారు. అవి వస్తేనే మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు వడ్డీ చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం వడ్డీ చెల్లిస్తున్న మహిళా సంఘాల సభ్యులకు తిరిగి వాటిని ప్రభుత్వం జమ చేస్తుంది. ఇందుకోసం వడ్డీ ఎంత ఉందన్న వివరాలు సేకరిస్తున్నామని డిఆర్డిఓ శ్రీధర్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana