Home /News /telangana /

PEDDAPALLI IN LURE OF EMPLOYMENT IN RFCL TOP LEADERS COLLECT MONEY FROM UNEMPLOYED YOUTH IN RAMAGUNDAM PSE BRV PRV

Peddapalli: నిరుద్యోగులను నిండా ముంచుతున్న బడా నేతలు.. ఉద్యోగాల పేరిట రూ. లక్షల్లో వసూలు

ఆర్​ఎఫ్​సీఎల్​

ఆర్​ఎఫ్​సీఎల్​

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలో కొందరు రాజకీయ నేతలు నిరుద్యోగులను దారుణంగా మోసగిస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన ముగ్గురు, నలుగురు నేతలు..ఉద్యోగం ఆశ చూపి ఒకే అభ్యర్థి నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి

ఇంకా చదవండి ...
    (E. Santhosh, News 18, Peddapalli)

    ప్రజల ఓట్లతో గెలిచిన నేతలు, ఆ ప్రజల బాగోగులు చూడాల్సింది పోయి..తిరిగి వారినే మోసగిస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ స్థానిక బడా నేతలు నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారు. సాక్షాత్తు నియోజకవర్గ స్థాయి నేతలే రూ. లక్షల్లో వసూలు చేసి అమాయక నిరుద్యోగులను నిండా ముంచుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం (Ramagundam) నియోజకవర్గ పరిధిలో కొందరు రాజకీయ నేతలు నిరుద్యోగులను దారుణంగా మోసగిస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన ముగ్గురు, నలుగురు నేతలు.. ఉద్యోగం ఆశ చూపి ఒకే అభ్యర్థి నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

    ఉద్యోగాలపై బడా నేతల కన్ను..

    పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండంలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ఎరువుల కర్మాగారం 22 ఏళ్ల అనంతరం ఇటీవల పునఃప్రారంభమైంది. ఎరువుల కర్మాగారం ప్రారంభమైతే రామగుండంలోని నిరుద్యోగులకు ఉద్యోగ (Job) అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ వారి ఆశలు నిరాశగానే మిగిలాయి. విద్యార్హత ఉన్న కొందరు అభ్యర్థులను నోటిఫికేషన్ ద్వారా తీసుకున్నప్పటికీ మిగతా కాంట్రాక్ట్ ఉద్యోగాలు (Contract Jobs) స్థానికులకే కేటాయించాలని అధికార పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేశారు. అయితే ఆయా నేతల మాటలు పైపై మాటలేనని.. RFCLలో కాంట్రాక్టు ఉద్యోగాల్లో అభ్యర్థులను మభ్యపెట్టేందుకు ఆయా నేతలు చేసిన జిమ్మిక్కులేనని అర్ధం అయింది. "అధికార పార్టీ బడా లీడర్ చెబితేనే ఎరువుల కర్మాగారంలో ఉద్యోగం (Job) వస్తుంది, లేకపోతే రాదు" అన్న మాటను నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.



     ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 8 లక్షలు..

    రామగుండం ఎరువుల కర్మాగారంలో (Ramagundam Fertilizer Factory) అధికార పార్టీకి చెందిన నాయకులు కనీస పాపపుణ్యాలు చూడకుండా 'నొట్ల కట్టల ఆకలి వేట' మొదలుపెట్టారు. బుడ్డ లీడర్ నుండి మొదలుకుని రాష్ట్ర స్థాయి లీడర్ (Leaders) వరకు నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు బహిరంగ ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గ బడా నేత కోట్లాది రూపాయలను వెనకేసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నిరుద్యోగుల ఆశను ఆసరా చేసుకుని అధికార పార్టీకి చెందిన నాయకులు ఒక్కో ఉద్యోగానికి ముగ్గురి చొప్పున డబ్బులను వసూలు చేశారని, ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 8 లక్షలు - రూ. పది లక్షల వరకు వసూలు చేసినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. డబ్బులు నొక్కిన నేతలు ఆయా అభ్యర్థులకు తాత్కాలిక పాసులు ఇప్పించి చేతులు దులుపుకున్నారు. పాసులైతే ఉన్నాయిగానీ, ఒక్కరికీ జీతాలు రావు. మూడు నెలలు గడిచినా జీతాలు అందక పోవడంతో కొంత మంది నిరుద్యోగులు నిలదీశారు. మరికొందరు ఉద్యోగం మానేశారు.

    నియోజకవర్గం అంతటా ఇదే కథ:

    రామగుండం (Ramagundam) నియోజీకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే కథ వినిపిస్తుంది. 50 డివిజన్లు, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లో చిన్నాచితకా లీడర్లు పెద్ద ఎత్తున వసూళ్లు చేసి నిరుద్యోగులకు దొరకకుండా తిరుగుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఈ విషయాన్ని అధికార పార్టీకి చెందిన బడా నేత దృష్టికి తీసుకెళ్లినా, స్పందన లేకపోవడంతో, ఆ బడా నేతనే ఇదంతా నడిపిస్తున్నాడంటూ ఊరు ఊరంతా కోడైకూస్తోంది. ఉద్యోగాల కోసం నేతలకు డబ్బులు ఇచ్చి వారి చుట్టూ పాద ప్రదక్షిణలు చేసి ప్రాధేయ పడుతున్నా ఎటువంటి స్పందన రాకపోవడంతో కొంత మంది అభ్యర్థులు ఆత్మ హత్యలకు యత్నించారు. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన అభ్యర్థులపై ఇంటికి వెళ్లి మరీ నేతలు దాడికి పాల్పడుతున్నారంటే రామగుండంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ఖద్దరు చొక్కాకు లగ్జరీ జీవితం, నిరుద్యోగికి మరణ శాపం

    రామగుండం నియోజకవర్గంలోని ఎరువుల కర్మాగారం (RFCL) పునఃప్రారంభమై నియోజకవర్గంలోని ఖద్దరు చొక్కాలకు లగ్జరీ లైఫ్ ఇచ్చిందంటూ స్థానికులు అంటున్నారు. RFCLలో ఉద్యోగాల కోసం సుమారు 500 మంది అభ్యర్థులు ఆయా నేతలకు లక్షల్లో డబ్బులు ఇచ్చి మోసపోయారట. డబ్బులు వసూలు చేసిన నాయకులు లగ్జరీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటే, డబ్బులు ఇచ్చిన నిరుద్యోగులు మాత్రం ఇక తమకు ఆత్మహత్యే శరణ్యమంటూ అంతులేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తున్న అధికార పార్టీ బాస్ కూడా స్పందించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోందని బాధితులు వాపోతున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Fake jobs, Government jobs, Local News, Peddapalli, Ramagundam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు