పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీతో ఉరుకులు పరుగుల జీవితంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం ఎక్కువైపోయింది. ఇతర దేశాల వస్తువులు ముఖ్యంగా చైనా వస్తువులతో మన భారతీయ చేనేత, హస్త కళాకారులు తయారు చేసిన వస్తువులకు డిమాండ్ తగ్గింది. పూర్వ వైవిధ్య సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పుడు ఎగ్జిబిషన్ల ద్వారా ప్రదర్శించబడుతున్నాయి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వందల ఏళ్లుగా అవి వారసత్వంగా కొనసాగుతున్నాయి. భారతదేశానికే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే హస్తకళలు, చేనేత వస్తువులుచాలా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ చేతి వృత్తులు కనుమరుగవుతున్నాయి. తయారు చేసే వారు ఉన్నా.. వినియోగదారుల నుంచి ఆదరణ కరువైంది.
దీంతో ప్రభుత్వాలు స్పందించి చేనేత హస్తకళలకు ఊతమిచ్చేలా పలు చర్యలు తీసుకున్నాయి. చేనేత వృత్తులు, హస్తకళాకారులను ప్రోత్సహిస్తూ వారికోసం ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో క్రమంగా వాటికి ఆదరణ పెరుగుతూ వస్తుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలో శ్రీ ఉషోదయ చేనేత హస్తకళా సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శన కార్మిక క్షేత్రాన్ని ఆకర్షిస్తుంది. చేనేత కళాకారులకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో హస్తకళా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి చేనేత హస్తకళలు చేరేలా సొసైటీ కృషి చేస్తుంది.
ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 40 మంది హస్తకళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో పెయింటింగ్స్, బ్లాక్ మెటల్, బ్రాస్ ఐటమ్స్, కొండపల్లి బొమ్మలు, లక్క బొమ్మలు, కలంకారీ పెయింటింగ్స్, అద్దకములు, తోలు బొమ్మలు, లేస్ అల్లికలు, బంజారా ఎంబ్రాయిడరీలు, మంచి ముత్యాలు లాంటి సాంప్రదాయక హస్త కళలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన హస్త కళ ఉత్పత్తులు ప్రదర్శించి విక్రయిస్తున్నారు.
తెలంగాణరాష్ట్రానికే ప్రత్యేక గుర్తింపు తెచ్చే పోచంపల్లి వస్త్రాలలో ముఖ్యమైనవి. చీరలు, బెడ్ షీట్లు, కండువాలు వంటివి ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. వైవిద్యమైన డిజైన్లలో ఒక ప్రత్యేకతను చాటుకొంటున్న ఈ పోచంపల్లిచేనేత వస్త్రాలు అందంలోను, ఆధరణలోను, మన్నికలోను తమ ప్రత్యేకతను చాటుకొంటున్నాయి.
ప్రదర్శనలో ఉంచిన పోచంపల్లి వస్త్రాలకు గిరాకీ ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం చేనేత వస్త్రాలకు ఆదరణ బాగా పెరిగిందని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కార్మికులు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో నేరుగా అమ్మకాలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇదివరకు కంటే ఇప్పుడు చేనేత, హస్తకళలకు ప్రభుత్వాలు స్పందించి ఊతమిచ్చేలా పలు చర్యలు తీసుకున్నాయి. చేనేత వృత్తులు, హస్తకళాకారులను ప్రోత్సహిస్తూ వారికోసం ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో క్రమంగా వాటికీ ఆదరణ పెరుగుతూ వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana