PEDDAPALLI HUSBAND BUILDS A TEMPLE FOR HIS DEAD WIFE AND WORSHIPS AN IDOL IN PEDDAPALLI DISTRICT SNR KNR
Peddapalli: ఆ పెద్దాయనకు భార్య అంటే ఎంతో ఇష్టం .. అందుకే ఆ పని చేశాడు
(భార్యకు గుడి కట్టిన భర్త)
Peddapalli: భార్య చనిపోతే వెంటనే రెండో పెళ్లి చేసుకునే భర్తలు ఉన్నారు. భార్య బ్రతికుండగానే వేధించే వాళ్లు ఉన్నారు. కాని పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఓ పెద్దాయన భార్యపై ఉన్న ప్రేమతో చేసిన పనికి స్థానికులు అభినందిస్తున్నారు.
(P.Srinivas,New18,Karimnagar)
పెళ్లైన మరుసటి రోజు నుంచే అదనపు కట్నం, అనుమానంతో పీడించే భర్తలు ఉన్న ఈ కాలంలో కట్టుకున్న భార్య కోసం ఏకంగా గుడి కట్టాడో పెద్దాయన. తనను ఒంటరి వాడ్ని చేసి తిరిగి రాని లోకలకు వెళ్లిన తన ధర్మపత్నిని దేవతగా కొలుస్తూ పూజలు చేస్తున్నాడు. భార్యను ఆరాద్యదైవంగా పూజిస్తున్న వ్యక్తి పెద్దపల్లి(Peddapalli)జిల్లాలో ఉన్నాడు. భార్యకు గుడి కట్టి పూజిస్తున్న పెద్దాయన పేరు ముత్తయ్య. సుల్తానాబాద్ (Sultanabad) మండలం తోగారాయి(Togarai)గ్రామానికి చెందిన ముత్తయ్య (Muttiah)కు భార్య లక్ష్మీ(Lakshmi)అంటే ఎంతో ఇష్టం. అతి చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు. ఆమె బ్రతికున్నంత కాలం ఎంతో అన్యోన్యంగా జీవించారు.
భార్యపై ప్రేమతో..
2016లో ముత్తయ్య భార్య లక్ష్మీ చనిపోయింది. తనను ఒంటరివాడ్ని చేసి అనంతలోకాలకు వెళ్లిన భార్యను మర్చిపోలేకపోయాడు ముత్తయ్య. ఆమె నిత్యం తన కళ్ల ముందే ఉండేలని భావించి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేసి భార్య పేరుతో గుడి కట్టించాడు. అందులో భార్య లక్ష్మీ విగ్రహంతో పాటు పక్కనే శివుడు, నంది, విగ్రహాలను ప్రతిష్టించాడు. రోజు నిత్యం ఆ గుడిని శుభ్రంగా కడిగి పూజలు చేసి ఇంటికెళ్లి భోజనం చేయడం ముత్తయ్య తన రోజువారి పనిగా మార్చుకున్నాడు. ఇదంతా తన భార్య మీద ఉన్న ప్రేమతోనే చేస్తున్నట్లు తెలిపాడు ముత్తయ్య. అంతే కాదు ఏ వ్యక్తికైనా జీవితాంతం తోడుగా ఉండేది ఒక్క భార్యేనని చెప్పుకొచ్చాడు.
విడిచి ఉండలేక..
ఈ పెద్దాయన తల్లి చనిపోయిన సమయంలో చేతిలో డబ్బులు లేకపోవడంతో పాటు దహన సంస్కరాలు నిర్వహించడానికి భూమి కూడా లేకపోవడంతో కష్టపడి కొంత పొలం, భూమి కొనుక్కున్నాడు. తమ మరణానంతరం ఆ భూమిలోనే తమకు దహన సంస్కారాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ముత్తయ్య భార్య లక్ష్మీ ముందుగా మరణించడంతో తన భూమిలోనే భార్య లక్ష్మికి గుడికట్టి నిత్యం ఆమెను ఆరాధిస్తున్నాడు. కట్టుకున్న భార్య బ్రతికుండగానే వేరే మహిళలతో తిరిగే వారు కొందరైతే. కట్న, కానుకల కోసం భార్యను వేధించే వారు మరికొందరు. కాని ముత్తయ్య వారందరిలా కాకుండా జీవితభాగస్వామి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఆమెకు గుడి కట్టి పూజించడం చూస్తున్న గ్రామస్తులు సైతం అతడ్ని అభినందిస్తున్నారు.
మధురజ్ఞాపకాలు నెమరవేసుకుంటూ..
ఇదే తరహా ఘటన జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో కూడా ఓ వ్యక్తి చనిపోయిన తన భార్య జ్ఞాపకార్ధం ఇంటి ఆవరణలో గుడి కట్టాడు. నిత్యం ఆమె విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ భౌతికంగా తన నుంచి దూరమైన భార్యను విగ్రహం రూపంలో చూస్తూ వాళ్ల జ్ఞాపకాల్లో బ్రతికేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.