E.Santosh, News18, Peddapalli
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారింది. పంచాయతీలలో చేసిన పలు అభివృద్ధి పనులకు సకాలంలో బిల్లులు రాక.. కాళ్ళ చెప్పులు అరిగేలా తిరిగితే వచ్చిన బిల్లులను అధికారులు కొర్రీలు పెట్టి అడ్డుపడడంతో దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. పేరుకే లీడర్లుకానీచేసిన పనులకు బిల్లులు రాక అనేక ఇబ్బంది పడుతున్నారు. కొందరు పార్టీకి రాజీనామా చేస్తుంటే కొందరు రోడ్డు మీదికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.. మరికొందరు ఆత్మహత్య ప్రయత్నాలకు పాల్పడుతున్నారు. తీరా వచ్చిన బిల్లులను కూడా ఇవ్వకుండా అధికారులు లంచాలను డిమాండ్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. బిల్లులు మంజూరు చేయాలంటే లంచం కావాల్సిందేనని అధికారి డిమాండ్ చేయడంతో ఏకంగా ఒక సర్పంచ్ ఆత్మహత్యాయత్నం చేశాడు.
పెద్దపల్లి జిల్లా (Peddapalli District) సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామ సర్పంచ్ అన్నాడి రవీందర్ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశాడు. రవీందర్ రెడ్డి వివిధ అభివృద్ది పనుల కోసం సొంతంగా దాదాపు రూ.25 లక్షలు ఖర్చు చేశాడు. ఈ డబ్బులకు సంబంధించిన బిల్లులను ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ బిల్లులు విడుదల చేయాలంటే తనకు రూ.15,000 లంచం ఇవ్వాలని ఎంపిడివో ఫయాజ్ అలీ డిమాండ్ చేశాడట. అయితే, సర్పంచ్ ఇప్పటికే ఐదు వేలు ఇవ్వగా మిగతా పదివేలు ఇస్తేనే పని జరుగుతుందని ఎంపిడివో తేల్చి చెప్పాడట.
దీంతో గత 15 రోజులుగా తన బిల్లులు మంజూరు చేయాలని ఎంపీడీఓ కార్యాలయం చుటూ తిరుగుతున్న సర్పంచ్ రవీందర్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి గురై ఎంపీడీఓ కార్యాలయంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్యాలయ సిబ్బంది, తోటి నేతలు అతడిని స్థానిక హాస్పిటల్ కు తరలించగా.. పరీక్షించిన వైద్యులు మైరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగుపడగా.. తన గోడు వెళ్లబోసుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana