Home /News /telangana /

PEDDAPALLI GODLESS TEMPLE IN PEDDAPALLI DISTRICT TELANGANA SNR KNR

Peddapalli: ఇది దేవుడు లేని ఆలయం..మన దగ్గరే ఉంది..దీని వెనుక పెద్ద కథ కూడా ఉంది

(దేవుడు లేని దేవాలయం)

(దేవుడు లేని దేవాలయం)

Peddapalli:పెద్దపల్లి జిల్లాలో ఓ అద్భుతమైన ఆలయం ఉంది. మరి ఆ ఆలయంలో ఏ దేవుడు కొలువై ఉన్నాడని ఆశ్చర్యపోకండి. అందులో ఏ దేవుడి విగ్రహం లేదు. శతాబ్ధాల క్రితం నిర్మించిన పుణ్యక్షేత్రం ఇప్పుడు షూటింగ్ స్పాట్‌గా మారడంపై జిల్లా ప్రజలు, భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దేవత విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయానికి ఆధ్యాత్మికశోభ తేవాలని వేడుకుంటున్నారు.

ఇంకా చదవండి ...
  (P.Srinivas, News18, Karimnagar)

  దైవం కొలువైన ఉన్నచోటునే దేవాలయం అంటారు. దేవాలయం ఉందంటే ఖచ్చితంగా అక్కడ దేవుడు కొలువుదీరి ఉంటాడు. దైవదర్శనం కోసం వెళ్లే భక్తులతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతు ఉంటుంది. నిత్యం భగన్మామస్మరణతో ఆ ఆలయం మహాక్షేత్రంగా విరాజిల్లుతుంది. కాని పెద్దపల్ల(Peddapalli)జిల్లాలో మాత్రం ఓ అద్భుతమైన ఆలయం దేవుడు లేని గుడిగా..భక్తులు కనిపించని దేవాలయంగా ఊరి చివరన విసిరివేసినట్లుగా పడి ఉంది. ధర్మాబాద్‌(Dharmabad) గ్రామంలోని రంగనాయకస్వామి (Ranganayakaswamy) ఆలయా(Temple )నికి అనుబంధంగా వందల ఏళ్ల క్రితం అండాళ్లమ్మ (Andallamma) ఆలయం(Temple)  నిర్మాణం జరిగింది. గుడైతే కట్టారు కాని..అందులో అమ్మవారిని ప్రతిష్టించలేదు. దీంతో దేవత లేని గుడిగా మిగిలిపోయింది. ఆలయం చూడటానికి ఎంతో అద్బుతంగా నిర్మించారు. అందమైన గోపురం, తెలుగు సంస్కృతి ప్రతిబింభించేలా వివాహ వేడుక , పట్టాభిషేకం ఘట్టాలకు సంబంధించిన చిత్రాలను ఆలయ గోపురంపై చెక్కారు . ప్రధాన గోపురంలో అమ్మవారు , గర్భగుడికి ఇరుపక్కల దేవతామూర్తుల కోసం ప్రత్యేక గదులు , అందమైన మండపం నిర్మించారు . మండపానికి కొద్ది దూరంలో ఆలయానికి మరింత శోభను తీసుకొచ్చే విధంగా విశాలమైన స్వాగత తోరణం ఏర్పాటు చేయడం జరిగింది.

  దేవతలు లేని ఆలయం..
  ఆండాళ్లమ్మ ఆలయ నిర్మాణానికి అప్పటి రాఘవపూర్ గ్రామ సంస్థానాధీషుడు ఎరబాటి లక్ష్మీనర్సింహారావు , ఆయన కుమారుడు లక్ష్మీకాంతరావు అంకురార్పణ చేశారు . రంగనాయకస్వామి ఆలయం నుంచి 500 మీటర్ల దూరంలో గుట్టకు సమీపంలో ఆలయం నిర్మించారు . ఏటా నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి ప్రతిపాదిత ఆలయం నుంచి రోప్‌ వే ద్వారా అమ్మవారిని రంగనాయకస్వామి ఆలయానికి తీసుకొచ్చి కల్యాణ వేడుక జరిపించాలన్న అద్భుతమైన ఆలోచనతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆండాళ్లమ్మ ఆలయ నిర్మాణం పూర్తైనప్పటికి రోప్ వే నిర్మించేందుకు ఇంజినీర్లు రాకపోవడంతో గుడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిలిచిపోయింది. అంతే కాదు రాఘవపూర్ గ్రామ సంస్థానాధీషుడు లక్ష్మీకాంతరావు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆలయ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.

  వందల ఏళ్ల క్రితం నిర్మించిన గుడి..
  ఆ తర్వాత అండాళ్లమ్మ ఆలయ అభివృద్ధిపై ఎవరూ పట్టించుకోలేదు. ప్రధాన ఆలయమైన రంగనాయకస్వామి దేవస్థానానికి సంబంధించిన 400 ఎకరాల మాన్యం ఆక్రమణకు గురి కావడంతో ఆండాలమ్మ ఆలయ నిర్మాణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారిపోయింది. ఎంతో అద్బుతంగా నిర్మించాలని పట్టుబట్టిన దేవాలయం దేవత లేని ఆలయంగా మిగిలిపోవడంతో చివరకు షూటింగ్‌ స్పాట్‌గా మారింది.

  షూటింగ్‌ స్పాట్‌గా మారిన వైనం..
  ధర్మాబాద్ గ్రామంలో గతేడాది పల్లె ప్రకృతివనంలో భాగంగా ఆండాళ్లమ్మ ఆలయ సమీపంలోని ఖాళీ స్థలంలో అందమైన ఉద్యానవనం నిర్మించారు . ఆలయానికి వెళ్లేందుకు అందమైన దారి వేసి , ఉద్యానవనాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. చుట్టూ ఎత్తయిన గుట్టల చెంత సుందరమైన మైదానంలో నిర్మించిన పల్లె ప్రకృతివనం ఆలయానికి మరింత అందాన్ని తీసుకొచ్చింది. అద్భుతమైన లొకేషన్‌గా మారిపోయింది. దాంతో ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు, మ్యారేజ్ ఫ్రీ వెడ్డింగ్ షూట్స్, అలాగే షార్ట్ ఫిలిమ్స్‌కు నిలయం మారింది. దశాబ్ధాల కాలం నుంచి ఆదరణకు నోచుకోని ఇంతటి అద్భుతమైన దేవాలయానికి ఆధ్యాత్మికశోభ తేవాలని, జిల్లాలో మరో పుణ్యక్షేత్రంగా మార్చాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరి ప్రజల కోరిక ఎంత కాలానికి తీరుతుందో చూడాలి.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: PEDDAPALLI DISTRICT, Temple

  తదుపరి వార్తలు