ఎట్టకేలకు సింగరేణిలో ఎన్నికల గంట మోగింది. సుమారు మూడేళ్ల నిరీక్షణ అనంతరం సింగరేణి కార్మిక గుర్తింపు ఎన్నికలకు మోక్షం కలిగింది. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎన్నికైన సంఘం పదవి కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. ఎన్నికల సంఘం ప్రతినిధులను కార్మికులకు సంబంధించిన సమస్యలపై, సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాల సమావేశానికి ఆహ్వానిస్తుంది.
2017 ఎన్నికల సమయంలో కాల పరిమితి నాలుగేళ్లు ఉంటుందని ప్రకటించినప్పటికీ ఎన్నికైన తరువాత అందించే గెలుపు పత్రంలో మాత్రం రెండేళ్ల కాల పరిమితిగానే పేర్కొన్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం గడువు 2019 సెప్టెంబర్ లో ముగిసిపోయింది. రెండేళ్లు, నాలుగేళ్ల వివాదంపై గుర్తింపు కార్మిక సంఘం నాయకులు కోర్టును ఆశ్రయించారు. పదవీ కాలంపై సైతం ఎన్నికల నిర్వహణకు ముందు స్పష్టత ఇవ్వాలని సంఘాల నాయకులు పట్టుపట్టారు. కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్ రెండేళ్ల పదవీ కాలం ఉంటుందని స్పష్టత ఇచ్చారు.
గుర్తింపు కార్మిక సంఘం పదవీకాలం పూర్తి కావడంతో కార్మికుల సమస్యలు, సౌకర్యాలపై యాజమాన్యంతో చర్చించే పరిస్థితి లేకుండా పోయింది. అయితే పదవీకాలం ముగిసినప్పటికీ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు గుర్తింపు సంఘం నాయకులుగానే చలామణి అయ్యారనే విమర్శలు ఉన్నాయి. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ ఇటీవల కోర్టును ఆశ్రయించారు.
ప్రాంతీయ లేబర్ కమిషనర్ కార్యాలయం, కేంద్ర కార్మిక శాఖ ఉప కమిషనర్ ఈనెలసమావేశం నిర్వహించి ఏప్రిల్2న సింగరేణి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించడంతో సింగరేణి వ్యాప్తంగా ఎన్నికల సందడి షురూ అయింది. అనేక మలుపులు తిరిగిన సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు ముందడుగు పడింది. సంస్థ ప్రస్తుతం తెలంగాణలో పెద్దపల్లి , మంచిర్యాల , కొమురం భీం, ఖమ్మం , ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు భదాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉన్నది. సింగరేణి సంస్థకు మొత్తం 11 డివిజన్లలో ఎన్నిక జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Singareni Collieries Company, Telangana