ఈ కాలంలో ఆహారం విషతుల్యం అవుతుంది. ఆరోగ్యం (Health) నాశనం అవుతుంది. ఏం తినాలన్న దిగులే. అధిక దిగుబడుల కోసమని పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాలు వినియోగం వలన పంటల నాణ్యత తగ్గడంతో పాటు మనుషులకు చేటు జరుగుతుంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజసిద్ధంగా పంటలు పండించుకుంటే రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు మంచి ఆరోగ్యం. అదే లక్ష్యంతో తెలంగాణ (Telangana) లోని పెద్దపల్లి జిల్లా (Peddapalli) సుల్తానాబాద్‌కు చెందిన సుధాకర్ అనే రైతు ప్రకృతి ఒడిలో పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రసాయన ఎరువుల వినియోగంతో పెట్టుబడులు పెరగడం తప్ప రైతుకు లాభం లేదంటున్నాడు రైతు సుధాకర్. అధిక పెట్టుబడితో నష్టాలను మూటగట్టుకోవడం తప్ప లాభం లేదని గుర్తించిన రైతు సుధాకర్ ప్రకృతి సిద్ధమైన సాగు (Natural Farming) చేస్తున్నాడు.
సుల్తానాబాద్‌కు చెందిన రైతు సుధాకర్ 2005లో యోగా నేర్చుకోవడానికని ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ రవిదీక్షిత్ అనే వ్యక్తితో సుధాకర్ కు పరిచయం ఏర్పడింది. వీరి మధ్య మాటల సందర్భంగా భారతీయ ఉత్పత్తులు, ప్రకృతి సహజసిద్ధమైన పంటల గురించి రవిదీక్షిత్ సుధాకర్‌కు వివరించాడు. అది విన్న సుధాకర్‌కు ప్రకృతి పంటపై ఆసక్తి కలిగింది.
వెంటనే ఆవులను కొనుగోలు చేసిన సుధాకర్ ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. తనకున్న పది ఎకరాల పొలంలో కొంత భాగాన్ని విభజించి ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టాడు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పంట వృద్ది చెందుతుందని, పెట్టుబడి తక్కువ అలాగే రాబడి ఎక్కువగా ఉంటుందని రైతు సుధాకర్ వివరించాడు. ఇలా చేయడం వలన భూసారం దెబ్బతినకుండా మట్టి కూడా పోషకాలతో నిండి ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు.
పూర్తి స్థాయిలో ప్రకృతి పంటపై దృష్టి పెట్టిన సుధాకర్ 10 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు. పది ఎకరాల్లో ఒకటే పంట వేస్తే నష్టం వస్తుందని ఆ పది ఎకరాలను భాగాలుగా చేసి పత్తి, వరి, మిర్చి, వేరు సెనగ, నువ్వులు వంటి పంటలు వేశారు. దీనివలన ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చని అంటున్నాడు రైతు సుధాకర్. సిజన్‌ను బట్టి అన్ని రకాల కూరగాయల పంటలను సాగు చేస్తున్నాడు.
Inspiring Story: పాఠశాల ఆవరణలో వ్యవసాయం..విద్యార్ధులే రైతులు..అదెక్కడా..? ఎలాగో చూడండి
ప్రకృతి సాగు చేసే విధానం
ప్రకృతి పంటలో రైతులకు అధిక దిగుబడి రావాలంటే సుధాకర్ చెప్పే విషయాలు తెలుసుకోవాల్సిందే. ప్రకృతి పంట సాగు నిమిత్తం రైతు సుధాకర్ 8 ఆవులను పెంచుతున్నాడు. ఆ ఆవుల నుండి సేకరించిన పేడ, పంచకంను వేరు చేసి నిల్వ ఉంచుతారు. నిల్వ ఉంచిన ఆవు పేడను ఎండకు తాక కుండ నీడలో ఆర పెట్టి అనంతరం పొడిగా చేస్తారు. పంచకంతో జీవామృతం తయారు చేస్తారు. జీవామృతం ఎలా చేస్తారంటే బెల్లం, అన్ని రకాల పప్పులు నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని పంచకంలో వేసి కలిపి మూడు రోజుల పాటు నిల్వ ఉంచితే అది జీవామృతంగా మారుతుంది. ఆ జీవామృతాన్ని ఆర బెట్టిన పేడ పొడిలో కలిపి పొలాల్లో వేదచల్లుతారు.
భవిష్యత్ తరాలకు ప్రకృతి పంట మంచి మార్గం
ప్రకృతి పంట సాగు కొంత కష్టం అనిపించినా పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువ ఉంటుందని సుధాకర్ అంటున్నాడు. ప్రకృతి సహజసిద్ధంగా పంట సాగు చేయడం వల్ల భవిష్యత్తు తరాలకు ఆరోగ్య వంతమైన జీవనాన్ని ఇవ్వచ్చని తెలిపాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Farmers, Local News, Peddapalli