హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dengue Fever: వణికిస్తున్న డెంగ్యూ జ్వరం: అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు

Dengue Fever: వణికిస్తున్న డెంగ్యూ జ్వరం: అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు

డెంగ్యూ జ్వరం

డెంగ్యూ జ్వరం

ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. జ్వరాల భారిన పడి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  ప్రస్తుతం పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. జ్వరాల భారిన పడి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ (Dengue) నిర్ధారణకు ఐజీఎం, ఎన్‌ఎస్‌ యాంటిజెన్‌ కిట్లతో పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారు. ఆ తర్వాత ఏలిసా టెస్టు కోసం కరీంనగర్‌కి (Karimnagar) పంపిస్తారు. రామగుండం 38వ డివిజన్లోని సంజయ్ గాంధీనగర్లో ఇటీవల ఓ బాలుడు డెంగీ లక్షణాలతో మృతి చెందాడు. ఇదే కాలనీకి చెందిన ఓ వంటల నిర్వాహకుడు కూడా వ్యాధి లక్షణాలతో కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారులు మాత్రం ఇంకా ఈ రెండు మరణాలను అధికారికంగా డెంగీగా గుర్తించలేదు. రామగిరి మండలం నాగేపల్లికి చెందిన ఓ తాపీమేస్త్రీ జ్వరంతో బాధపడుతూ మృతి చెందినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. తెల్ల రక్తకణాలు తగ్గడం వల్లే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

  జిల్లాలో ఇటీవలి కాలంలో డెంగీ, విషజ్వరాలు పంజావిసురుతున్నాయి. రెండు మూడు నెలలుగా కురిసిన వర్షాలు, వరదలతో ఎక్కడికక్కడ నీరు నిలిచి దోమల వ్యాప్తి పెరిగింది. ఈప్రభావంతో లోతట్టు ప్రాంతాలు, మురికివాడల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దోమల వ్యాప్తి నిర్ములనకు మునిసిపల్ అధికారులు, సిబ్బంది పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు సీజన్లో వచ్చే వ్యాధులపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

  జ్వరమే (Fever) కదాని నిర్లక్ష్యంగా వహించకుండా డెంగ్యూ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోయి ప్రాణాపాయ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుందని, కావునా డెంగీని తేలిగ్గా తీసుకోకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు పేర్కొన్నారు.

  Oil palm: ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంపై ప్రభుత్వం దృష్టి: రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్న పంట..

  జాగ్రత్తలు: జ్వరం ఉన్నప్పటికీ శరీరం అంతగా వేడిగా ఉండదు. వ్యాధి లక్షణాలు ఉన్నవారిలో పల్స్ తగ్గిపోయి స్పృహ కోల్పోవడం, బలహీనంగా తయారవడం, రక్తపోటు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇటువంటి సమయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంట‌నే వైద్యులను సంప్రదించాలి. ప్రతి రోజు మరిగించి చల్లార్చిన నీటిని తాగాలి. సాధ్యమైనంతవరకు జ్యూస్, గ్లూకోజ్, ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తినాలి. ముఖ్యంగా ఇంటిలోకి దోమలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి కిటికీలకు నెట్ ఏర్పాటు చేసుకోవాలి. పరిసర ప్రాంతాల్లో నీరు నిలవకుండ జాగ్రత్త తీసుకోవాలి. జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Dengue fever, Local News, Peddapalli

  ఉత్తమ కథలు