PEDDAPALLI DISTRICT SERIAL CRIME INCIDENTS CREATES TENSION IN GUNJAPADUGU VILLAGE SU KNR
Peddapalli District: అసలు ఆ ఊరికి ఏమైంది.. ఓ పక్క హత్యలు.. మరోపక్క దోపిడీలు..
సంచనాలకు కేంద్రంగా గుంజపడుగు గ్రామం
Gunjapadugu Village: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. మొన్న లాయర్ల హత్య.. నిన్న బ్యాంకు రాబరీ.. నేడు చైన్ స్నాచింగ్.. ఇలా వరుస ఘటనలతో గుంజపడుగు గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న పెద్దపల్లి జిల్లాలోని గుంజపడుగు గ్రామం తాజాగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. మొన్న హైకోర్టు లాయర్ దంపతుల హత్యలు , నిన్న ఎస్బీఐ బ్యాంకులో చోరీ , నేడు చైన్ స్నాచింగ్ సంఘటనలతో గుంజపడుగు పేరు వార్తల్లో మార్మోగుతుంది. గత కొన్నేళ్లుగా ప్రశాంతం గా ఉన్న పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలతో తెరపైకి వచ్చింది. నెలరోజుల క్రితం గుంజపడుగు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయ వాదుల జంట హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత నెలరోజులుగా ఏనోట విన్నా , ఎక్కడ మాట్లాడినా గుంజ పడుగు విషయమే ఉండేది. పత్రికలు, మీడియాలో సైతం పతాక స్థాయిలో గ్రామం పేరు మార్మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా అందరి చూపు గ్రామం వైపు ఉన్న సమయంలో గత మూడు రోజుల క్రితం జరిగిన ఎస్బీఐ బ్యాంకు చోరీ మరోసారి గుంజపడుగును తెరపైకి తీసుకు వచ్చింది.
రాష్ట్రంలో ఎక్కడా జరుగని రీతిలో ఈ బ్యాంకు దోపిడీ జరిగింది. రూ. 18.46లక్షల నగదుతోపాటు 2.90కోట్ల విలువైన 6 కేజీల బంగారం చోరీకి గురైంది. చోరికి పాల్పడిన దొంగలు పకడ్బందీగా ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించకుండా చేయడంతో పాటు సీసీ కెమెరా లు, అల్లారం మ్రోగకుండా ముందుగానే వైర్లు కట్ చేసి చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు . అయితే ఇటీవల జరిగిన జంట హత్యల నేపద్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. నిత్యంపెట్రోలింగ్ చేపట్టిన క్రమంలో బ్యాంకు దోపిడికి పాల్పడటం తీవ్ర సంచలనం రేపింది. ఇప్పటికే గ్రామంలో ఏం జరుగుతుందోననే ఆందో ళనలో ప్రజలు ఉన్న క్రమంలో బ్యాంకు దోపిడి గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
అది అలా ఉండగానే తాజాగా మరో సంఘటన సైతం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఆదివారం గ్రామానికి చెందిన వంగ లక్ష్మి అనే వృద్ధురాలు వ్యవ సాయ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు . ఈ విషయం తెలుసుకున్న పోలీ సులు హుటాహుటీన గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు . గ్రామంలో ఏర్పాటు చేసిససీసీ కెమెరాలను పరిశీలించి దుండగులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అదే విధంగా బాధితురాలిని కలిసి వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు . వరుసగా గ్రామంలో జరుగుతున్న సంఘటనలు ఇటు పోలీసులకు , అటు గ్రామస్తులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.జంట హత్యలా తరువాత పోలీసులు ఆ గ్రామములో పహారా కాస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మరి ఇదోపిడిలు తెలిసినవారే చేస్తున్నారా లేదా ఇంకా ఎవరైనా అనే కోణంలో పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
-(పి శ్రీనివాస్, న్యూస్ 18 కరీంనగర్ కరస్పాడెంట్)
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.