Home /News /telangana /

PEDDAPALLI CYBERCRIMES INCREASING IN RAMAGUNDAM POLICE COMMISSIONERATE AND POLICE ALERTED PEOPLE PSE BRV PRV

Peddapalli: దొంగలు కనబడని దొంగతనం.. మీ ఇంటి తాళాలేం పగులగొట్టరు.. కానీ, ఉన్నదంతా దోచేస్తారు వీళ్లు..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ప్రపంచం మొత్తం డిజిటలీకరణ వైపు అడుగులేస్తుండగా..నేరాలు కూడా రూపు మార్చుకుంటూన్నాయి. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మనుషులు కనబడరు కానీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులన్నీ క్షణకాలంలో మాయం చేసేస్తారు.

  (E. Santhosh, News 18, Peddapalli)

  "ఒకప్పుడు తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనాలు (Theft) జరిగేవి" రానున్న కాలంలో చోరీల గురించి చెప్పేటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వాడాల్సి ఉంటుందేమో. ఎందుకంటే ప్రపంచం మొత్తం డిజిటలీకరణ వైపు అడుగులేస్తుండగా.. నేరాలు కూడా రూపు మార్చుకుంటూన్నాయి. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు (Cyber crimes) పెరిగిపోతున్నాయి. మనుషులు కనబడరు కానీ బ్యాంకు అకౌంట్లలో డబ్బులన్నీ క్షణకాలంలో మాయం చేసేస్తారు. టెక్నాలజీతో పాటుగా నేరగాళ్లు కూడా సాంకేతికతతో ఆరితేరుతున్నారు. వెబ్ ప్రపంచంలో మన వ్యక్తిగత వివరాలు తస్కరించి అనంతరం మన బ్యాంకులుయి ఖాళీ చేస్తున్నారు. దీన్నే సైబర్ నేరం అని అంటారు. చేతిలో మొబైల్ (Mobile) ఉంది కదా అని.. అందులో వచ్చిన లింకులన్నీ ఓపెన్ చేస్తే మీ జీవితాలు తలకిందులయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మొబైల్‌లో ఇంటర్నెట్‌ వాడుకునేటప్పుడు.. మీ స్క్రీన్‌ మీద అనవసర లింక్‌లను పొరపాటున క్లిక్‌ చేశారంటే మీ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బు క్షణాల్లో మాయమవుతుంది. అంతేకాదు మీ మొబైల్‌లో ఉన్న ప్రైవేట్‌ డేటా మొత్తం సైబర్‌ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుండి మెసేజీలు వచ్చినా, వీడియో కాల్ చేసినా స్పందించకండి. తరువాత ఇబ్బందులు తప్పవు అంటున్నారు రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్.

  పదుల సంఖ్యలో సైబర్ నేరాలు..

  పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జన్నారంకు చెందిన ఒక బాధితురాలు గతంలో ఓ మెడికల్ ఇన్సూరెన్స్‌ ద్వారా తన తండ్రికి ఒక సర్జరీ చేయించింది. ఆ విషయం తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు బాధితురాలికి కాల్ చేసి మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది, డబ్బులు పంపిస్తామని, మీ ఫోన్ పేలో ఒక రిక్వెస్ట్ వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు మీ అకౌంట్‌లో పడతాయని నమ్మబలికారు. బాధితురాలు సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగానే రిక్వెస్ట్ ను అంగీకరించింది. డబ్బులు బాధితురాలి అకౌంట్లో పడక పోగా తన ఎకౌంట్ నుంచే రూ. 30 వేలు కట్ అయ్యాయి. దీంతో మోసం జరిగిందని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి డయల్ చేసి సంబంధిత బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. సకాలంలో స్పందించిన బ్యాంకు అధికారులు ఆ మోసపూరిత అమౌంట్ రూ. 30 వేలు సైబర్ నేరగాడి చేతిలోకి పోకుండా ఆపగలిగారు.

  గూగుల్‌లో వెతికి..

  బెల్లంపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడు హర్యానాలో ఉన్న ఒక ఆయుర్వేద ఆసుపత్రి గురించి తెలుసుకుని వైద్యం నిమిత్తం గూగుల్‌ (Google)లో వెతికి ఆ ఆయుర్వేద ఆసుపత్రి కస్టమర్ కేర్ (Customer care) నెంబర్‌కు కాల్ చేశాడు. కాల్ ఎగ్జిక్యూటివ్ (సైబర్ నేరగాడు) బాధితులతో మీకు డేట్స్ బుక్ చేస్తామని అందుకు మీరు ముందుగా రూ. 50 వేలు చెల్లించాలని చెప్పగా బాధితుడు రూ.35 వేలు చెల్లించాడు. అనంతరం ఆ ఆసుపత్రి నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసం జరిగిందని గ్రహించి వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. సంబంధిత బ్యాంకు అధికారులు స్పందించి రూ. 35 వేలను నేరస్తుడి ఖాతాకు వెళ్లకుండా ఆపగలిగారు.

  ఇలా రామగుండం (Ramagundam) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నేన్నల్ పొలీస్ స్టేషన్ పరిధి, నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక సైబర్ నేరాలు చోటుచేసుకున్నాయి. బాధితులు సకాలంలో స్పందించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయా వ్యక్తుల బ్యాంకు అకౌంట్ల నుంచి లక్షల రూపాయల డబ్బు సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఆపగలిగారు.

  మీడియాతో మాట్లాడుతున్న పోలీసులు


  లోన్ కోసం..

  మంచిర్యాల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఒక వ్యక్తి మనీ వ్యూ, ట్రూ బాలన్స్ , క్రెడిట్ బి, వంటి లోన్ యాప్‌లలో లోన్ కోసం అప్లై చేసుకున్నాడు. కానీ ఎందులోనూ ఇతనికి లోను రాలేదు. అయితే కొన్ని రోజుల అనంతరం ఫోకస్ లోన్ యాప్ అనే అప్లికేషన్ నుంచి మీరు లోన్ అమౌంట్ తీసుకున్నారు తిరిగి చెల్లించాలి అనే మెసేజ్ వచ్చింది. అది చూసి కంగుతిన్న బాధితుడు.. తాను ఎక్కడా లోన్ తీసుకోనందున తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని ఊరుకున్నాడు. అయితే సైబర్ నేరగాళ్లు బాధితుడి ఫోటోని మార్ఫింగ్ చేసి.. అతని స్నేహితులకు పంపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదే విధంగా పలువురు బాధితులు క్రెడిట్ బాక్స్, రూపీ లోన్, యూనియన్ క్రెడిట్ క్యాష్ లోన్ వంటి లోన్ అప్లికేషన్లలో లోన్లు తీసుకుని సైబర్ నేరగాళ్ల చేతిలో ఇబ్బందులకు గురి అవుతున్నారు.

  ఇలా రామగుండం కమిషనరేట్ పరిధిలో జూన్ నెలాఖరు వరకు మొత్తం 128 సైబర్ కేసులు బయటపడగా రూ. 14,84,488ల డబ్బు సైబర్ నేరగాళ్ల చేతికి పోకుండా రామగుండం పోలీసులు అడ్డుకోగలిగారు.

  సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే .. ఈ సూచనలు తప్పక పాటించండి:

  map police station

  1. తెలియని ఫోన్ నెంబర్ నుంచి వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ (Instagram), ఫేస్‌బుక్ (facebook) వంటి యాప్‌ల నుంచి వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయకూడదు.
  2. కస్టమర్ కేర్ నెంబర్‌ల కొరకు ఎట్టిపరిస్థితుల్లోనూ గూగుల్‌లో వెతకకుండా సంబంధిత సంస్థ అధికారిక వెబ్ సైట్, మొబైల్
  అప్లికేషన్స్‌లోనే నెంబర్ ఉంటుంది
  3. ANY Desk అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని గుర్తుతెలియని వ్యక్తులు సూచిస్తే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని గ్రహించండి.
  4. వస్తువులు అమ్ముతామంటూ Instagram, Facebook మరియు YouTubeలలో వచ్చే యాడ్‌లను చూసి ఎటువంటి వస్తువులు కొనవద్దు
  5. డబ్బులు చెల్లిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా నమ్మబలికితే మీరు మోసపోయినట్టే.
  6. OLX, Quikr, Cardekho వెబ్‌సైట్లలో వస్తువులను నేరుగా చూడకుండా, ఆయా వ్యక్తులను కలవకుండా ముందస్తుగా ఎటువంటి చెల్లింపులు చేయవద్దు
  7. కస్టమర్ కేర్ అంటూ కాల్ చేసే కేటుగాళ్లు మాటలు నమ్మి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు వేయవద్దు.
  8. తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామంటే నమ్మవద్దు. వారికి ఫీజుల రూపంలో ఎటువంటి డబ్బు కట్టవద్దు.
  9. ఎవరైనా మెసేజ్/కాల్ చేసి మీకు లోన్ అప్రూవ్ అయ్యిందని అంటే నమ్మకండి.
  10. బహుమతి వచ్చిందంటూ మీకు తెలియని వ్యక్తుల నుంచి సందేశం వస్తే స్పందించకండి
  11. RBI, భారత ప్రభుత్వ రిజిస్ట్రేషన్ లేని లోన్ యాప్‌ల నుంచి లోన్ తీసుకోకండి, వారు పెట్టె బాధలకు గురికావొద్దు.

  అనుకోని సంఘటనల ద్వారా మీరు సైబర్ నేరగాళ్ల భారినపడ్డామని భావిస్తే వెంటనే Cyber Crime phone number 1930కి కాల్ చేయండి లేదా www.cybercrime.gov.inకు లాగిన్ చేసి ఫిర్యాదు చేయండి.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, ONLINE CYBER FRAUD, Peddapalli, Police, Ramagundam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు