E. Santosh, News18, Peddapalli
ఆ శివ లింగానికి సమర్పించిన బొట్టు పెట్టుకుంటే సంతానం కలుగుతుందని అక్కడి ప్రజల నమ్మకం. అక్కడ శివయ్యకు మొక్కితే కోరిన కోర్కెలు తీరుతాయని అక్కడి భక్తుల విశ్వాసం. శతాబ్దాల కాలం పాటు భక్తులచే దివ్య పూజలందుకున్న ఆ శివ లింగం.. నేడు విస్మరణకు గురవుతుంది. ఒకప్పుడు భక్తుల రాకతో కిటకిటలాడిన ఆ ఆలయం ఇపుడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. శివ మాల ధరించే సమయంలో తప్ప ఇక్కడి ఈ శివలింగం గురించి బయట వ్యక్తులకు పెద్దగా తెలియక పోవడం శోచనీయం. తెలంగాణ (Telangana) లోని పెద్దపల్లి జిల్లా (Peddapalli District) రామగుండం మండలం జనగామ గ్రామంలో ఉన్న భీమేశ్వరాలయం గురించే మనం మాట్లాడుకుంటున్నాం.
పెద్దపల్లి జిల్లాలో పలు పురాతన ఆలయాలు కాలగర్భంలో కలసిపోతున్నాయి. కాకతీయ రాజులూ.. అంతకు ముందు రాజులు, రాజ వంశీకులు, గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా నిర్మించుకున్న ఆలయాలు అనేక ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూ... నేడు శిథిలావస్థకు చేరుకున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం జనగామ గ్రామంలో 13వ శతబ్దానికి చెందిన కట్టడం భీమేశ్వరుని ఆలయం. ఒక్కప్పుడు ఈ భీమేశ్వరాలయంలో దర్శనం దొరకాలంటే భారీ క్యూ ఉండేదని, కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకొని శిథిలావస్థకు చేరిందని స్థానికులు అంటున్నారు.
ప్రస్తుతానికి గుడి భాగం మొత్తం కూలిపోయి ఉండగా శివ లింగం మాత్రమే మిగిలింది. గుడిని తిరిగి నిర్మించాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నా దేవాదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం దూపదీప నైవేద్యాలు.. భక్తుల సందడితో ఉండాల్సిన ఆలయాలు గబ్బిలాలకు ఆవాసంగా మారుతున్నాయి.పురాతన ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా ఆ శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్నది భక్తుల ప్రధాన ఆరోపణ.
ఆలయాల మాన్యం భూములు అన్యాక్రాంతం
ఈ ఆలయాల పరిధిలోని భూములు అన్యాక్రాంతం అవడంతో గుడి నిర్వహణ భారంగా మారింది. పట్టణాలు, ప్రధానమైన కొన్ని ఆలయాలకు ప్రాముఖ్యతనిస్తూ దేవాదాయ శాఖ గుర్తింపునిస్తూ వస్తోంది. వాస్తవానికి దేవాదాయ శాఖ గుర్తింపు పొంది, స్థానిక భక్తుల భాగస్వామ్యంతో నిర్వహింపబడేవి పెద్దపల్లి జిల్లాలో బహుతక్కువని భక్తులు పేర్కొంటున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోకి కొన్ని చారిత్రక ఆలయాలు వెళ్లినా అభివృద్ధి మాత్రం జరగలేదని తెలుస్తోంది. ఈ ఆలయాన్నీ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు వీలున్నా అధికారుల చొరవ, ప్రజాప్రతినిధుల కనుచూపు కరువైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు కాలగర్భంలో కలిసిపోవడంపై భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఆలయాల అభివృద్ధికి ఆ శాఖ అధికారులు నామమాత్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామ గ్రామంలోని భీమేశ్వర ఆలయంలో శివ పూజలు చెట్టు కింద చేస్తున్నారు. కాకతీయులకాలం నాటి రాతితో తొలిచిన శిల్పాలతో ఏర్పాటు చేసిన శివాలయం కాలగర్భంలో కలిసిపోయే దీనస్థితిలో ఉంది. రామగుండం మండలం కాట్రపల్లి గ్రామంలో 13వ శతాబ్ధంలో కాకతీయులు ‘టౌన్, టెంపుల్, ట్యాంక్’ ఫార్ములాతో ఈ ఆలయాన్ని గ్రామంలోని చెరువుకు అనుబంధంగా నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hindu Temples, Local News, Peddapalli, Telangana