
పవన్ కళ్యాణ్, కేసీఆర్ (File)
బరిలో దిగకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీకి జనసేన నుంచి ఓ విషయంలో మాత్రం తప్పకుండా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జనసేన పోటీ చేయడం లేదని, ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటిస్తునట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసైనికులు, కార్యకర్తలు, మద్దతు దారులు బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అయితే, బీజేపీకి జనసేన మద్దతు పలికినా, తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపకపోయినా అది ఆ రెండు పార్టీలకు సంబంధించిన విషయం. అయితే, బరిలో దిగకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీకి జనసేన నుంచి ఓ విషయంలో మాత్రం తప్పకుండా గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అది డిజిటల్ గ్రౌండ్లో. సోషల్ మీడియా వినియోగంలో టీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే జనసేన, బీజేపీ చాలా దూకుడుగా ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీకి కూడా సోషల్ మీడియాలో మద్దతు దారులు ఉన్నాకూడా ఆ పార్టీ ఏదైనా ఇష్యూను ఛాలెంజింగ్‌గా తీసుకుని జాతీయస్థాయిలో ట్రెండింగ్ చేసిన సందర్భాలు చాలా అరుదు. మొన్నటికి మొన్న ప్రధాని మోదీ మీద, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం అంతగా నెటిజన్లలోకి తీసుకుని వెళ్లింది.
అదే సమయంలో ఈ రోజు పవన్ కళ్యాణ్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కలవడం, జనసేన మద్దతును బీజేపీకి ఇస్తున్న విషయాన్ని జాతీయ స్థాయిలో ట్రెండింగ్ చేసింది జనసేన సోషల్ మీడియా విభాగం. మరోవైపు వారికి బీజేపీ కూడా తోడుగా నిలిచింది. దీంతో #GHMCElection అనే హ్యాష్ ట్యాగ్ అందులో బీజేపీకి జనసేన మద్దతు అనే అంశం జాతీయస్థాయిలో ట్రెండింగ్ అయింది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటింటికీ తిరిగి ఓట్లు అడగడం ఎంత ముఖ్యమో, సోషల్ మీడియా క్యాంపెయినింగ్ అంతకంటే ముఖ్యం అయిపోయింది. దీనికి తోడు ప్రచారానికి ఎక్కువ సమయం కూడా లేదు. నవంబర్ 29వ తేదీ సాయంత్రంతో ఎన్నికల క్యాంపెయినింగ్ ముగుస్తుంది. అంటే, కేవలం 9 రోజులు మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడం అయ్యే పనికాదు. అన్ని ప్రాంతాలను కవర్ చేయలేరు. అందుకే, నేతల ప్రచారంతో పాటు సోషల్ మీడియా ప్రచారంపై కూడా అన్ని పార్టీలు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో.. ప్రచారం కోసం సోషల్ మీడియాను కూడా విస్తృతంగా ఉపయోగించుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి. ఇందుకోసం అటు అధికార టీఆర్ఎస్, బీజేపీ కూడా నిపుణుల సేవలను ఉపయోగించుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో బీజేపీ ప్రచారం కోసం ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:November 20, 2020, 21:22 IST