Telangana: తెలంగాణలో తెరపైకి మరో కొత్త జిల్లా.. ఊపందుకున్న ఉద్యమం..

ప్రతీకాత్మక చిత్రం

వాస్తవానికి తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో పరకాల జిల్లా డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. జిల్లా సాధన సమితి నేతలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఐతే ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లలేదని అఖిలపక్షం నేతలు మండిపడుతున్నారు.

 • Share this:
  గతంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఇప్పుడు 33 జిల్లాల రాష్ట్రంగా మారిపోయింది. ఏకంగా 23 కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఐతే ఇంకా కొత్త జిల్లాల డిమాండ్ వినిపిస్తోంది. ఇటీవలే వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండగా మార్చారు. త్వరలో హుజూరాబాద్ జిల్లాను ప్రకటిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరకాల ప్రజల కూడా తమ ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నారు. పరకాల కేంద్రంగా అమరవీరుల జిల్లాను ఏర్పాటు చేయాలని పరకాల జిల్లా సాధనసమితి ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తోంది. రజకార్లను తరిమికొట్టిన పోరాల గడ్డను ప్రత్యేక జిల్లా చేయాలని డిమాండ్ చేస్తోంది. కొత్త జిల్లా కోసం గత పది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. శనివారం పరకాల బంద్‌ పాటించారు. ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థల స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌లో భాగంగా పరకాలలో ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

  పరకాలలో ర్యాలీకి అనుమతి లేదని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆందోళనల్లో పాల్గొన్న నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై పరకాల జిల్లా సాధన సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అరెస్ట్‌లతో ఉద్యమాన్ని అణచలేరని నేతలు మండిపడుతున్నారు.

  ప్రస్తుతం రెవెన్యూ డివిజన్‌గా పరకాల కొనసాగుతోంది. కొత్త జిల్లా ఇవ్వకపోగా.. ఉన్న రెవెన్యూ డివిజన్‌ను కూడా కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పరకాల వాసులు ఆందోళనలు చేస్తున్నారు. పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆత్మకూరు, శాయంపేట మండలాలను ఇటీవల ప్రకటించిన హన్మకొండ జిల్లాలో కలిపేశారు. ప్రస్తుతం పరకాలలో దామెర, నడికూడ మండలాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండు మండలాలలతో పరకాలను రెవెన్యూ డివిజన్‌ను కొనసాగించడం సాధ్యం కాదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  వాస్తవానికి తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో పరకాల జిల్లా డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. జిల్లా సాధన సమితి నేతలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఐతే ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లలేదని అఖిలపక్షం నేతలు మండిపడుతున్నారు. అప్పుడు కేవలం కేవలం రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి సరిపెట్టుకున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు హుజూరాబాద్ కేంద్రంగా పీవీ నరసింహారావు జిల్లాను ప్రకటిస్తారని... అక్కడ ఉపఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ప్రకటన రావచ్చొని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరకాల ప్రజలు కొత్త జిల్లా కోసం అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. కాగా, కొన్ని రోజుల క్రితం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల విషయంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్‌గా, వరంగ్ అర్బన్ జిల్లాను హన్మకొండగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
  Published by:Shiva Kumar Addula
  First published: