KCR Versus Centre: ఇప్పటికే ఎఫ్ఐసీ దగ్గర మూడేళ్లకు సరిపడా పారాబాయిల్డ్ రైస్ నిల్వలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ పెంచామని స్పష్టం చేసింది.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం(Centre) మరోసారి క్లారిటీ ఇచ్చింది. పారాబాయిల్డ్ రైస్‌ను కొనలేమని తేల్చిచెప్పింది. 2021-22 రబీ సీజన్‌కు ధాన్యం సేకరణ (Paddy Procurement) ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం ఇంకా పంపలేదని కేంద్రం పేర్కొంది. ముడి బియ్యం సేకరణ ప్రతిపాదనలు కోసం ఎదురుచూస్తున్నామని కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి పాండే తెలిపారు. పారా బాయిల్డ్ రైస్‌ను(Paraboiled Rice) మాత్రం సేకరించలేమని తెలిపారు. ఎఫ్‌సీఐకి ముడి బియ్యం మాత్రమే ఇస్తామని.. పారా బాయిల్డ్ రైస్ ఇవ్వమని.. భవిష్యత్తులో పారాబాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఎఫ్ఐసీ దగ్గర మూడేళ్లకు సరిపడా పారాబాయిల్డ్ రైస్ నిల్వలు ఉన్నాయని పేర్కొంది. గత ఐదేళ్లలో తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ పెంచామని స్పష్టం చేసింది.
అంతకుముందు తెలంగాణలో పండిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని.. ఒకే దేశం-ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ అధికార టీఆర్ఎస్ ఢిల్లీలో దీక్షకు దిగింది. గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలోనే ఉంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana Cm kcr) ఈ దీక్షలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజులు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని సీఎం తేల్చిచెప్పారు.
రైతుల సమస్యల విషయంలో దేశంలో భూకంపం సృష్టిస్తామని.. పీయూష్ గోయల్ పరుగులు తీయాల్సిందేనని కేసీఆర్ హెచ్చరించారు. హిట్లర్, నెపోలియన్ వంటి అహంకారులు కాలగర్భంలో కలిసిపోయారని.. ఇప్పుడున్న కేంద్రానికి ఎందుకింత అహంకారమని కేసీఆర్ ప్రశ్నించారు. మోదీ సర్కార్ కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ.. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రానికి ఎదురుతిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేస్తారని ఆరోపించారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారని.. దమ్ముంటే రావాలని కేసీఆర్ సవాల్ విసిరారు.
ఢిల్లీ దీక్షలో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ పయనమయ్యారు. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో ధాన్యం సేకరణతో పాటు కేంద్రంపై పోరాటం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.