PALLE PATTANA PRAGATHI POSTPONED TO JUNE 3 AND TRS CM KCR ASSURES FARMERS TO PURCHASE RAIN STAINED FOOD GRAINS MKS
CM KCR : పల్లె పట్టణ ప్రగతి వాయిదా.. రైతులకు శుభవార్త.. తడిసిన ధాన్యం కొంటామన్న కేసీఆర్..
సీఎం కేసీఆర్
పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం అనూహ్యంగా వాయిదా పడింది. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందంటూ సీఎం కేసీఆర్ రైతులకు శుభవార్త చెప్పారు. పూర్తి వివరాలివే..
తెలంగాణలో అభివృద్ది కార్యక్రమాల సమీక్ష, అకాల వర్షాలు, తడిసిన ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం అనూహ్యంగా వాయిదా పడింది. అదే సమయంలో, ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంటుందంటూ రైతులకు సీఎం శుభవార్త చెప్పారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలివే..
తెలంగాణ వ్యాప్తంగా తలపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ, జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం ఈనెల 20 నుంచి మొదలుకావాల్సి ఉండగా, దానిని రెండు వారాలకు వాయిదా వేశారు.
పల్లె పట్టణ ప్రగతి వాయిదా: వేసవి ఎండలు విపరీతంగా మండుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాల్సిందిగా మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్ ను అభ్యర్థించారు. దీనిపై సమాలోచనలు జరిపిన సీఎం చివరికి కార్యక్రమాన్ని వాయిదా వేసేందుకు అంగీకరించారు. ‘‘పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి ప్రారంభించాలన్న విజ్ఞప్తి మేరకు.. జూన్ 3వ తేదీ నుంచి 15 రోజులపాటు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం కేసిఆర్ నిర్ణయించారు’అని సీఎంవో నుంచి సందేశం వెలువడింది. మరో ముఖ్యమైన అంశం..
రైతులకు శుభవార్త: ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ వరిధాన్య సేకరణపైనా సమీక్షించారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన శుభవార్త చెప్పారు. తడిసిన వరిధాన్యాన్ని కూడా కొంటామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని సీఎం అన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో ధాన్య సేకరణ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతోన్న వరిధాన్యం సేకరణపై ఆరా తీసిన సీఎం.. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణ, మిల్లుల్లో దిగుమతి తదితర విషయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత లక్ష్యం 56 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించామని అధికారులు సీఎంకు తెలిపారు. అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ వరిధాన్యం తడుస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం.. తడిసిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు.
కేంద్ర పథకాలపై సంచలన వ్యాఖ్యలు: తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాలకు కేంద్రమే నేరుగా నిధులు పంపడాన్ని తీవ్రంగా నిరసించిన ఆయన.. అన్నిటికి అన్ని పథకాలూ రాష్ట్రాల ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రం నేరుగా గ్రామాలకు నిధులు ఇవ్వడం ద్వారా మహోన్నతమైన పంచాయితీ రాజ్ వ్యవస్థ కుంటుపడిపోతున్నదని కేసీఆర్ అన్నారు. జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదని, అన్ని పథకాలను రాష్ట్రాల ద్వారానే అమలు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.