హోమ్ /వార్తలు /తెలంగాణ /

CM KCR: 48 ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు.. ఆ జిల్లాల్లో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలు..

CM KCR: 48 ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు.. ఆ జిల్లాల్లో కొత్తగా ఆరు మెడికల్ కాలేజీలు..

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

CM KCR: రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కొరత రావొద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో కరోనా థర్డ్ వేవ్ ను కూడా పూర్తిగా తట్టుకునే విధంగా ఆక్సిజన్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రగతిభవన్‌లో సోమవారం కొవిడ్‌ పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.

ఇంకా చదవండి ...

  కరోనా రోగులకు ప్రాణ వాయువును అందించేందుకు 48 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పుటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా అదనంగా హైదరాబాద్‌లో 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాణ వాయువు కొరకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడిన పరిస్థితిని తెలంగాణకు రాకూడదన్నారు. ఒకొకటి 20 టన్నుల కెపాసిటీ గల 11 ఆక్సిజన్‌ ట్యాంకర్లను 10 రోజుల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కంటే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాల ఉన్నాయిని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే ఉచిత సేవను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత ఉండకూడదని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ మందులు సహా అన్నీ అందుబాటులోనే ఉన్నందున ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి, డబ్బులు పోగొట్టుకోవద్దని ప్రజలకు సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు రాగా వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

  అన్ని ఆసుపత్రుల్లో ఒకే విధమైన ఫీజు వసూలు చేయాలని 11 నెలల క్రితం ప్రభుత్వం GO-248 ను జారీ చేసిందని కెసిఆర్ తెలిపారు. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, యుపి ఇతర రాష్ట్రాలలో ఇదే మార్గదర్శకాలను అనుసరిస్తున్నట్లు అధికారులు ఆయనకు తెలియజేశారు. కరోనా రోగులకు తర్వాతి దశలో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి సోకుతున్నదని, దానికి చికిత్స అందించడం కోసం కోఠిలోని ఈఎన్టీ, సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రులకు వైద్య పరికరాలు, అవసరమైన మందులు సమకూర్చాలని సీఎం కేసీఆర్‌ అధికారులను కోరారు. ఇందుకు అవసరమైన 25 మైక్రోడెబ్రిడర్ మిషన్లు, హెచ్‌డీ ఎండోస్కోపిక్ కెమెరాలను తక్షణమే తెప్పించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి తెలంగాణకు 57,30,220 డోసుల వ్యాక్సిన్‌ మాత్రమే వచ్చిందని, కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ కలిపి ప్రస్తుతం 1,86,780 డోసుల స్టాకు ఉన్నదని అధికారులు సీఎంకు తెలిపారు. ఇందులో 58,230 మోతాదుల కోవాక్సిన్, 1, 28, 550 మోతాదుల కోవిషీల్డ్ ఉన్నాయని అధికారులు తెలిపారు.

  కరోనా వ్యాక్సిన్ల సరఫరా కోసం గ్లోబల్‌ టెండర్లను పిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన వ్యాక్సిన్ల కోటా కోసం నిరంతరం సంప్రదిస్తూ, తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు, త్వరితగతిన మందులు అందించడం కోసం కొత్తగా 12 రీజినల్‌ సబ్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. వీటిని సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్‌, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, సూర్యాపేట, భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, వికారాబాద్‌, గద్వాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

  కొత్తగా ఆరు మెడికల్ కళాశాలలు..

  రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో మౌలిక వసతుల కల్ప న కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం ప్రకటించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లో కొత్తగా మెడికల్‌ కాలేజీలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఈ మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలను కూడా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్‌ కాలేజీలు లేని చోట వాటిని మంజూరు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అనుమతులు వచ్చిన నర్సింగ్‌ కాలేజీల మంజూరు ప్రతిపాదలను కూడా వెంటనే పరిశీలించాలని సూచించారు.

  జగిత్యాలలో మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించడం పై మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు వైద్యవిద్య మరింత అందుబాటులోకి రావటమే కాకుండా జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయన్నారు. సంగారెడ్డికి మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: CM KCR, Corona cases, Covid-19, Medical colleges, Oxygen plants

  ఉత్తమ కథలు