Corona Effect: ఉపాధిని దూరం చేసిన కరోనా.. రోడ్డున పడ్డ ఆ 20 మంది ఉద్యోగులు..

ప్రతీకాత్మక చిత్రం

Corona Effect: కరోనా మహమ్మారి ఎందరో కుటుంబాలకు ఉపాధిని దూరం చేస్తోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్కులో బ్యాటరీ డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న20 మందిని పర్యాటకుల తాకిడి తక్కువగా ఉందన్న కారణంతో ఉద్యోగం నుంచి తొలగించారు.

  • Share this:
    ప్రస్తుతం ఎవరి నోట విన్నా కరోనా మాటే. కరోనా సోకకుండా చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్క్ లను విధిగా ధరిస్తూ కరోనా దరి చేరకుండా జగ్రత్త పడుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా కారణంగా పర్యాటక రంగం పూర్తిగా నష్టపోయింది. మొదటి వేవ్ లోనే విపరీతంగా నష్టపోగా ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణంగా పర్యాటక రంగానికి  కోలుకోలేని దెబ్బ తగిలింది. హైదరాబాద్ లోని నెహ్రూ జులాజికల్ పార్కులో గత కొన్ని రోజుల నుంచి పర్యాటకుల తాకిడి పూర్తిగా తగ్గిపోయింది. దీంతో యాజమాన్యం ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డారు. అందులో జూలో కాలుష్య రహిత బ్యాటరీ వాహనాలు ప్రారంభమైనప్పటి నుంచి సందర్శకులను బ్యాటరీ వాహనాల్లో తిప్పుతూ వన్యప్రాణుల వివరాలను చెప్పే డ్రైవర్లపై కరోనా పిడుగు పడింది. అందులో 20 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూ మళ్లీ మూతపడటంతో ఇప్పుడు వీరందరికి ఉపాధి కరువైంది. జూ మళ్లీ పున:ప్రారంభమైనప్పుడు మళ్లీ కబురు చేస్తామని.. అప్పటివరకు ఎవరూ జూలోకి రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

    దీంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా అర్దాంతరంగా మమ్మల్ని తొలగిస్తే మేము ఎలా బతకాలంటూ ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు నెలల వేతనం చెల్లించాలని, కానీ జూ అధికారులు ఎలాంటి వేతనాలు చెల్లించకుండా తమను తొలగించడం అన్యాయమని వారు వాపోయారు. కనీసం నెల ఖర్చులు కూడా ఇవ్వకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ మంత్రి వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

    జూలో కాలుష్య రహిత బ్యాటరీ వాహనాలు (ఫైల్) image credit : youtube


    కరోనా మహమ్మారి ప్రతీ రంగాన్ని చుట్టుకుంటోంది. పర్యాట రంగంలో పని చేసే ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు.
    Published by:Veera Babu
    First published: