Telangan Rains: పొంగుతున్న వాగులు, వంకలు.. ఆ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు..

పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కోరారు.  గత నాలుగు రోజుల నుండి నిరంతరాయంగా  కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 • Share this:
  (సయ్యద్. రఫీ, మహబూబ్ గర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు) 
  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు కోరారు.  గత మూడు,నాలుగు రోజుల నుండి నిరంతరాయంగా  కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను  అధికారులను అప్రమత్తం చేసే విషయమై గురువారం ఆయన  కలెక్టర్ కార్యాలయం నుండి  మండలాల ప్రత్యేక అధికారులు ,మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిరంతర వర్షాల వల్ల  లోతట్టు ప్రాంతాలలో నీరు చేరేందుకు అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండి తక్షణమే గ్రామాలకు వెళ్లాలని ఆదేశించారు. గ్రామాలలో పరిస్థితులను తనిఖీ చేసి ప్రజలకు సహాయకరంగా ఉండాలని , ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు కింది స్థాయి వర్క్ ఇన్స్పెక్టర్ వరకు జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు రోడ్లు, కుంటలు, చెరువులు దెబ్బ తిన్న,విద్యుత్ స్తంభాలు,చెట్ల వంటివి పడిపోయిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా   తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పారు. వర్షం వల్ల నాని, పడిపోయెందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లను గుర్తించి అక్కడి నుండి ప్రజలను ఖాళీ చేయించి పాఠశాలలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లాంటి సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని  ఆదేశించారు. తహసీల్దారు లు, ఎంపీడీవోలు వీఆర్వోలను గ్రామాలకు పంపించి  పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల వివరాలు సేకరించి అందులో నివాసం ఉంటున్న ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా  అప్రమత్తం చేయాలని చెప్పారు.

  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కృష్ణానదికి భారీ మొత్తంలో వరదనీరు వస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి పాలమూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు గురువారం ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయని, గతంలో నిర్మించిన మట్టి మిద్దెలు కూలిపోయే పరిస్థితుల్లో ఉంటాయని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, గద్వాల జోగులాంబ జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. కర్ణాటక నారాయణపుర ప్రాజెక్టు నుండి లక్షా ఇరవై వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం, దానికి వర్షం నీరు చేరి, కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు పేర్కొన్నారు.

  మున్సిపాలిటీలలో కూడా మున్సిపల్ కమిషనర్లు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు . రహదారులు, చెరువులు తెగిపోయినా లేదా  గండ్లు పడినట్లయితే స్థానికుల సహకారంతో ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు ఇసుక బస్తాలతో వాటిని అక్కడే తక్షణం పూడ్చి వేసేలా  చర్యలు తీసుకోవాలని చెప్పారు.  వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ అధికారులు  24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ,అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలు పని చేయాలని ఆదేశించారు. తహసిల్దార్ లు ,ఎంపీడీవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వైద్యులు ,సిబ్బంది వచ్చారో లేదో పర్యవేక్షించాలని, ఆయా శాఖలకు సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేస్తున్నది లేనిది పరిశీలించాలని అన్నారు.  వర్షాల వల్ల తలెత్తే సమస్యలను పరిష్కరించే విషయంలో జిల్లా సీనియర్ అధికారులు ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవాలని.. ముఖ్యంగా మహబూబ్ నగర్, చుట్టుపక్కల గ్రామాలను స్థానిక సస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్,  జడ్చర్ల నుండి అడ్డాకుల  వరకు రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, దేవరకద్ర, కోయిల్ కొండ ప్రాంతాలను ఆర్డీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు.

  అవసరమైతే ప్రత్యేక అధికారులు గ్రామాల్లో బస చేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఆదేశించారు.  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు, వాగులు, వంకలు పొంగి పొర్లి రహదార్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, రహదారులు దెబ్బ తిన్నట్లయితే ప్రమాద సంకేతాన్ని సూచించేలా జెండాలు పెట్టాలని, అంతేకాక రెండు వైపులా సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రమాదం జరగకుండా చూడాలని ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఉండాలని చెప్పారు.      ప్రత్యేక అధికారులు హరితహారం కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించాలని, జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని, అదేవిధంగా జియో ట్యాగింగ్ తో పాటు, ఉపాధి హామీ పథకం కింద ఎఫ్ టి ఓ జనరేషన్  పూర్తి చేయాలని, గుంతలు తవ్వటం, మొక్కలు పెట్టడాన్ని  వెంటనే పూర్తి చేయాలని.  ఈనెల 24వ  బృహత్ పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.కేజీ వీల్స్ తో రహదారుల పై ట్రాక్టర్లు  తిరిగి నట్లయితే  కేసులు నమోదు చేసి పది వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని, అందువల్ల రహదారులపై  కేజీ  వీల్స్ తో ట్రాక్టర్లు తిప్పకూడదని జిల్లా కలెక్టర్ చెప్పారు.
  Published by:Veera Babu
  First published: