గాంధీ ఆస్పత్రిలో సమ్మెకు సిద్ధమైన నర్సింగ్ సిబ్బంది

గాంధీ ఆస్పత్రి

ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని గాంధీ ఆస్పత్రిలోని ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు ఆరోపించారు.

  • Share this:
    కరోనాపై పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిలో భాగమైన ఔట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో బుధవారం నుంచి విధులను బహిష్కరించనున్నట్లు మంగళవారం సమ్మె నోటీస్‌ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వారు ఆరోపించారు. తమను రెగ్యులరైజ్‌ చేయాలని లేదా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. తమకు ప్రతినెల వేతనాలు కూడా సక్రమంగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తమ సేవలను ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు గుర్తించడంలేదని వాపోతున్నారు. తమకు రూ.17,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారని... పారిశుధ్య కార్మికులకు రూ.7,500 ఇన్‌సెంటివ్‌ ప్రకటించిన ప్రభుత్వం తమకు కంటితుడుపు చర్యగా కేవలం 10 శాతం ఇన్‌సెంటివ్‌ ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సులకు రూ.23,000 ఇవ్వాల్సి ఉన్నా... నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద పనిచేస్తున్న కొందరికి మాత్రమే అది వర్తింపజేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం గాంధీ ఆస్పత్రి ఇన్‌వార్డులో సమ్మె నోటీస్‌ అందించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఇదిలా ఉంటే గాంధీ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్‌లో 200, రెగ్యులర్‌ స్టాఫ్‌నర్సులు 150 మంది విధులు నిర్వహిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: