జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు ముఖ్యనేతల కుటుంబసభ్యులు పోటీ పడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తమ కుటుంబంలోని మహిళలను పోటీకి దింపి మేయర్ పదవిని దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలు ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. ఈ జాబితాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉన్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తమ ఇంటి నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కు అందరికి ఉంటుందన్న మంత్రి తలసాని.. మేయర్ అభ్యర్థిపై తమకు ఆశలు లేవని తెలిపారు. చిన్న వయసులోనే తన కుమారుడికి ఎంపీగా పోటీ చేసే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారని గుర్తు చేసిన తలసాని.. అదే ఎక్కువగా భావిస్తున్నామని అన్నారు. కేంద్రం తీరుపై తలసాని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ వరదలపై పక్క రాష్ట్రాలు సాయం చేయడానికి ముందుకు వచ్చినా కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ప్రతిపక్షాలకు పేదల ఉసురు తగులుతుందని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం 4,75,781 మందికి నేరుగా వరదసాయం అందజేసిందని తలసాని అన్నారు. మీసేవ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించామని, గత మూడురోజుల్లో రూ. 165 కోట్లు మీసేవ ద్వారా వరద బాధితులకు పంపిణీ చేసినట్లు వివరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ వరదసాయం నిలిపివేసినా, ఫలితాల అనంతరం ఈ మొత్తాన్ని ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రతిపక్షాలు టీఆర్ఎస్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాయని... వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి తలసాని అన్నారు. స్వాతంత్రం వచ్చాక ఇక్కడ ఎన్నడూ జరగని అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలో జరిగిందని... వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వ్యాఖ్యానించారు. . తెలంగాణ వచ్చాక ప్రభుత్వం ఏమి చేసిందో హైదరాబాద్ ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఒక ఎన్నిక గెలిచిన్నంత మాత్రాన మొత్తం అదే ప్రపంచం అనుకుంటే ఎలా అంటూ దుబ్బాక విజయంపై బీజేపీకి తలసాని చురకలు అంటించారు. ఎవరు ఎన్నిరకాలుగా అడ్డుపడినా, ఎన్నికల తర్వాత ప్రజలకు వరద సాయం అందిస్తామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad - GHMC Elections 2020, Talasani Srinivas Yadav, Telangana