HOME »NEWS »TELANGANA »online friendship leads to young guy and minor girl marriage police filed case in hyderabad hsn

Hyderabad: ఆన్‌లైన్‌లో పరిచయం.. బర్త్ డే పార్టీకి రమ్మని ఆ బాలిక పిలిస్తే వెళ్లిన యువకుడి నిర్వాకమిదీ..!

Hyderabad: ఆన్‌లైన్‌లో పరిచయం.. బర్త్ డే పార్టీకి రమ్మని ఆ బాలిక పిలిస్తే వెళ్లిన యువకుడి నిర్వాకమిదీ..!
ప్రతీకాత్మక చిత్రం

ఆన్ లైన్ స్నేహాలు చాలా వరకు దారుణాలకు కారణమవుతున్నాయి. హైదరాబాద్ లో(Hyderabad) తాజాగా ఓ ఘటన జరిగింది. ఓ మైనర్ బాలిక, 21 ఏళ్ల యువకుడితో నెట్టింట స్నేహం చేసింది. దీంతో పుట్టిన రోజు వేడుకలకు రావాల్సిందిగా ఆ యువకుడికి చెప్పింది. తీరా వెళ్లిన తర్వాత అతడు చేసిన ఘోరం ఏంటంటే..

  • Share this:
    16 ఏళ్ల బాలిక. 21 ఏళ్ల యువకుడు. ఇద్దరికీ సోషల్ మీడియాలో పరిచయం. రెండేళ్ల పాటు ఇద్దరూ ఆన్ లైన్లోనూ, ఫోన్ కాల్స్ ద్వారానూ మాట్లాడుకున్నారు. ఏరా, పోరా అనే స్థాయి దాకా వారి స్నేహం వెళ్లింది. ఈ క్రమంలోనే ఓ స్నేహితురాలి బర్త్ డే ఫంక్షన్ కు రమ్మని ఆ యువకుడిని బాలిక కోరింది. అతడు కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు. అక్కడే అసలు కథంతా జరిగింది. బర్త్ డే పార్టీ నుంచి నేరుగా ఆమెను గుడికి తీసుకెళ్లి ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల కేసుతో పోలీసులు ఎంట్రీ ఇచ్చే సరికి ఆ యువకుడు పరారయ్యాడు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని తిరుమలగిరి గౌలిపురా శాలిబండకు చెందిన అభిషేక్ అనే 21 ఏళ్ల యువకుడు సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతూ ఉంటాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ 16 ఏళ్ల బాలిక పరిచయం అయింది. ఇద్దరూ రెండేళ్లుగా చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. వ్యక్తిగత వివరాలను పంచుకునేవారు. ఫోన్ నెంబర్లకు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే జనవరి 23న ఆ బాలిక తన స్నేహితులతో కలిసి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లింది. అభిషేక్ కు కూడా ఫోన్ చేసి ఆ బర్త్ డే పార్టీకి రమ్మని అడ్రస్ చెప్పింది. దీంతో అభిషేక్ తన స్నేహితులతో కలిసి ఆ బర్త్ డే పార్టీకి వెళ్లాడు. ఇద్దరూ కలిసి మాట్లాడుకునే క్రమంలో తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు ఆ బాలిక చెప్పింది.



    దీంతో, మనిద్దరం పెళ్లి చేసుకుందామా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. అంటూ అభిషేక్ ఆ బాలికతో మాయమాటలు చెప్పాడు. దీంతో అతడిని నమ్మిన ఆ బాలిక సరేనంది. ఆ రోజు రాత్రి ఆ బాలికను స్నేహితుల ఇంట్లో ఉంచాడు. ఆ మరుసటి రోజు ఆ బాలికతో పాటు కొందరు స్నేహితులను తీసుకుని యాదగిరిగుట్టకు తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలిక మెడలో పసుపుతాడు కట్టాడు. ఆ తర్వాత తన గదికి తీసుకెళ్లి ఆమెపై లింగిక దాడి చేశాడు. అయితే బర్త్ డే పార్టీకి వెళ్లిన తన కూతురు ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టారు. తన కూతురిని వెతికి పట్టుకోవాలని కోరారు. ఈ విషయం కాస్తా అభిషేక్ కు తెలిసిపోయింది. పోలీసులకు పట్టుబడితే తనకు కటకటాలు తప్పవని భయపడిన అభిషేక్ ఆ బాలికను జనవరి 25న తిరుమలగిరిలో విడిచిపెట్టి పారిపోయాడు. ఆ బాలిక తన ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు జరిగినదంతా వివరించింది. పోలీసులకు కూడా ఈ వివరాలు తెలిశాయి. ఎట్టకేలకు అభిషేక్ ను శాలిబండ ప్రాంతంలో బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఫోక్సో, అత్యాచారం కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఆన్ లైన్ స్నేహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:January 28, 2021, 07:17 IST

    टॉप स्टोरीज