ఆధునిక సమాజంలో కూడా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతుందా.. అదికూడా పసిపిల్లలను చంపేస్థాయికి కుటుంబ సభ్యులు చేరుకున్నారా.. అంటే అవుననే సంఘటనలు మనకు దర్శనమిస్తున్నాయి. ముగ్గురు ఆడపిల్లలతో పాటు మగ సంతానం లేకపోవడం ఇంకా కొంతమంది తండ్రులు జీర్జించుకోలేక పోతున్నారు. మరోవైపు మగపిల్లవాడు పుట్టకపోవడం.. ఆడపిల్లలు పుట్టడానికి కారణం మహిళలనే కారణంగా చూస్తున్నవారు కోట్లమందే ఉన్నారు. దీంతో ఆడపిల్లలకు జన్మనిచ్చారనే అక్కసుతో అటు భార్యతో పాటు పుట్టిన పసిపిల్లల ప్రాణాలు కూడా తీస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తండ్రి స్థానానికి మచ్చ తెచ్చేలా కిరాతకుడిగా మారిన ఓ తండ్రి నెల రోజుల పసిగుడ్డును ఆడపిల్లై పుట్టిందన్న కారణంతో పేగుబంధాన్ని కూడా మరిచి కిరాతంగా కడతేర్చిన ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండల పరిధిలోని లైన్ గూడ గ్రామానికి చెందిన మెస్ర బాపురావు కు 2015 లో అంటే ఐదేళ్ళ క్రితం మహారాష్ట్రకు చెందిన మనుసబాయితో వివాహాం జగిరింది. వీరికి ఇదివరకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. మొదటి కూతురి వయసు ఐదు సంవత్సరాలు కాగా రెండవ కూతురు వయసు మూడు సంవత్సరాలు. ఇద్దరి పిల్లలకే చాలు అని భావిస్తున్న తరుణంలో మూడవ సంతానం కోసం అది కూడా మగపిల్లవాడు పుడతారని ఆశించారు.. తాజాగా వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మనుసబాయికి మూడవసారి కూడా ఆడపిల్ల పుట్టింది.
ఇది చదవండి : ముగ్గురు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత దారుణానికి పాల్పడ్డాడు.. !
అయితే బాపురావు అసహనానికి గురయ్యాడు. తనకు వారసులు లేరని అనవసర ఆలోచనలో పడ్డాడు.దీంతో తన తప్పు లేకున్నా... భార్యపై కోపం పెంచుకొని తరచు గొడవపడేవాదు. తాజాగా భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. దీంతో భయపడిపోయిన భార్య ఊళ్ళొని పెద్ద మనిషి మెస్రం బొజ్జురావు ఇంటికి వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకుంది. భార్య అక్కడ ఉన్న విషయం తెలుసుకున్న బాపురావు అక్కడికి వెళ్ళి ఊరి పెద్దమనుషుల ముందే మరోసారి భార్యతో ఘర్షణకు దిగాడు...ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో భయపడిపోయి అక్కడి నుండి తప్పించుకొని మనసబాయి వెళ్ళిపోయింది.
దీంతో కోపోద్రిక్తుడైన బాపురావు భార్యను తిడుతూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళి పుట్టిన బిడ్డను చంపుతానని బెదిరిస్తూ వెంబడించాడు. ఇంటికి వెళ్ళి పొత్తిళ్ళలో సేద తీరుతున్న 38 రోజుల ఆడ శిశువును బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి లైన్ గూడా గ్రామంలోని సెంటర్ లోకి తీసుకువెళ్ళి సిసి రోడ్డుపై బలంగా పడేశాడు. అంతటితో ఆగకుండా బండ రాయితో పసి గుడ్డు తలపై గట్టిగ బాదడంతో రక్తస్రావమై ఆ పసికందు అక్కడికక్కడే మృతి చెందింది.
విషయం తెలుసుకున్న కాగజ్ నగర్ గ్రామీణ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఆడ పిల్ల అయితేనేం, మగ పిల్లవాడు అయితేనేం, తన పిల్లలే కదా అని వారి బాగోగుల గురించి ఆలోచించకుండ భార్యపై అసహనంతో నెలలు నిండని పసికందును కడతేర్చిన కసాయి తండ్రి ఉదంతం తెలిసిన జిల్లా ప్రజలు ఆ కసాయిపై శాపనార్ధాలు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.