కోడిగుడ్డు ధరలు (Egg Price) కొండెక్కాయి. కోవిడ్ (Covid-19) తరవాత రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచుకునేందుకు ప్రజలు కోడిగుడ్లనువిరివిగా వినియోగిస్తున్నారు. 2020 నుంచి కోడిగుడ్ల వినియోగం దేశంలో వేగంగా పెరుగుతోంది. దీంతో గుడ్ల ధరలు క్రమంగా 35 శాతం మేర పెరిగాయి. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కోడిగుడ్డు ధర రూ.7 దాటిపోయింది. కొద్ది రోజుల కిందట కార్తీకమాసం కావడంతో వినియోగం కొంతమేర తగ్గి ఒక్కో గుడ్డు రూ.5.50 పలికింది. కార్తీకమాసం ముగియడంతో గుడ్ల ధరలకు మరలా రెక్కలు వచ్చాయి. రాబోయే కొద్ది రోజుల్లో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తగ్గిన ఉత్పత్తి పెరిగిన వినియోగంగుడ్ల ఉత్పత్తి వ్యయం ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరిగిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు కోళ్ల ఫారాలు మూసివేశారు. దీంతో కోడిగుడ్ల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దీనికితోడు వినియోగం పెరగడంతో ఇక కోడిగుడ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దేశంలో రోజూ 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. అందులో ఏపీలోనే రోజుకు 5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో కోడిగుడ్లు అధికంగా ఉత్పత్తి అవుతున్నప్పటికీ సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఇంకా వినియోగం పెరగలేదు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం తలసరి సంవత్సరానికి 180 గుడ్లు తినాలని సిఫారసు చేయగా, వాస్తవానికి ఇది వైజాగ్, విజయవాడ , గుంటూరులో 90 నుండి 105 మాత్రమే ఉంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది 50 నుంచి 70 వరకు ఉంది.
విదేశాలకూ ఎగుమతులు
సౌదీ అరేబియాతో పాటు మరికొన్ని దేశాలకు ఎగుమతులు పెరగడంతో హోల్‌సేల్‌తో పాటు రిటైల్ మార్కెట్‌లోనూ గుడ్ల ధరలు పెరిగాయని విశాఖపట్నం జోన్ ఎన్‌ఈసీసీ చైర్మన్ టీ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. గుడ్ల డిమాండ్, సరఫరా మధ్య స్వల్ప అంతరం కారణంగా రాబోయే గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 2017-18లో దేశీయంగా అధిక ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఫామ్ గేట్ స్థాయిలో హోల్‌సేల్ గా గుడ్డు ధర రూ.4 ఉండగా, ఉత్పత్తి వ్యయం రూ.3.20గా ఉంది. ఇప్పుడు ఫామ్ గేట్ స్థాయిలో గుడ్డు ధర రూ.5.50 ఉండగా, రానున్న రోజుల్లో ఇది రూ.6కు పెరగవచ్చు.
నాటు కోడి గుడ్డు రిటైల్ మార్కెట్‌లో రూ.10 నుంచి రూ.12 వరకు విక్రయిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో గుడ్ల లభ్యత చాలా తక్కువగా ఉండడంతో సాధారణ గుడ్డు ధర రూ.7కు పెరిగింది. రానున్న రోజుల్లో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వైజాగ్ లోని రిటైల్ గుడ్ల వ్యాపారి పి.సతీష్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.