Home /News /telangana /

OLD WOMEN MET HER FAMILY AFTER 30 YEARS AT BHADRARI KOTHAGUDEM DIST VB KMM

Telangana: 70 ఏళ్ల బామ్మ.. తప్పిపోయి 30 ఏళ్లకు తిరిగొచ్చింది.. ఎలాగంటే..

పార్మతమ్మతో తన కొడుకు

పార్మతమ్మతో తన కొడుకు

Bhadrari Kothagudem: గత 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయిన తన తల్లి పార్వతమ్మను తలుచుకుని ఆ కుటుంబం ఏడవని రోజంటూ లేదు. తప్పిపోయిన తన తల్లి.. ప్రస్తుతం ఎక్కడుందో.. ఎలా ఉందో.. అసలు బతికి ఉందో లేదో అనే ఆలోచన ఆ కుటుంబ సభ్యుల గుండెని పిండేసేది. ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉండాలని దేవుడిని కోరుకునేవారు. వారి మొర ఆలకించిన దేవుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత వారి గుండెకోతను దూరం చేశాడు. చివరకు తన తల్లిని బిడ్డలు, కుమారులు, మనవళ్లు , మనవరాళ్ల వద్దకు చేర్చాడు.

ఇంకా చదవండి ...
  ఇంటిల్లిపాది అవసరాలను కనిపెట్టుకుని తీర్చే ఆమెకు ఓరోజు కోపమొచ్చింది. ఎవరికి చెప్పుకోవాలో తెలీక.. కన్న కొడుకు కాకపోయినా తన పట్ల ఆప్యాయత చూపే సవతి కొడుకు వద్దకు వెళ్లింది. హైదరాబాద్‌లో ఐటీఐ చదువుతున్న రవీంద్రనాథ్‌ వద్ద కొద్ది రోజులున్న ఆమెకు కుటుంబ సభ్యులపై కోపం తగ్గింది. ఇక ఇంటికిపోవాలి.. ఎలాగున్నారో.. గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నారో అనుకుంటూ బయలుదేరింది. హైదరాబాద్‌లో బస్సు అయితే ఎక్కింది. కానీ ఎక్కడ దిగిందో తెలీదు. ఎక్కడికెళ్లాలో తెలీదు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఆమెను ఓ అనాధాశ్రమం వాళ్లు చేరదీశారు. పెద్దగా వివరాలు అడగలేదు. తిండి పెడుతున్నారు.. చేతనైన పని చేస్తోంది.. అలా అక్కడ ఏడేళ్లు గడిపింది. తర్వాత ఆ ఆశ్రమ నిర్వాహకులు నడపలేక వదిలేశారు. అప్పుడామె ఎవరి సాయంతోనో విజయవాడ చేరింది. కనకదుర్గమ్మ దేవాలయంలో లడ్డూలు తయారు చేసే పనిలో కుదిరింది. ఇలా ఎన్నాళ్లు.. ఎన్నేళ్లు గడిచాయో కూడా తెలీదు. తీరా గతేడాది కరోనా దెబ్బకు దేవాలయాలు కొన్నాళ్లపాటు మూశారు. అప్పుడామెకు పని దొరకలేదు. దీంతో మరోసారి ఆమెను అనాధాశ్రమమే చేరదీసింది.

  అక్కడ కాలం గడుపుతుండగా.. ఆమెలో ఓ బలమైన కోరిక.. కన్నబిడ్డలను చూసుకోవాలి.. ఒక్కసారి వాళ్లను వడిలోకి తీసుకోవాలన్న ఆరాటం మొదలైంది. ఆమె ఇంటి నుంచి బయటపడి మూడు దశాబ్దాలైంది మరి.. అందుకే ఎలాగైనా తన వాళ్లను కలుసుకోవాలని.. తన గతాన్ని గుర్తు చేసుకుంది. తన ఊరిలో బొగ్గు గనులుంటాయని.. అందరూ బొగ్గు తవ్వుతుంటారని చెప్పడంతో.. అక్కడున్న వాళ్లు కొత్తగూడెం పంపారు.. అక్కడ తనకు పూర్వపు ఆనవాళ్లు దొరక్కపోవడంతో.. ఎలాగోలా ఇల్లెందు చేరింది. ఇల్లెందు బస్టాండు వద్ద తన బంధువుల కోసం వాకబు చేస్తుండగా.. అదృష్టవశాత్తూ ఆమెను అక్కడున్న ఒకరిద్దరు గుర్తించారు.. నువ్వు పార్వతమ్మవు కదూ అంటూ పలకరించి..ఆమెను అక్కడికి దగ్గరిలోని బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. బంధువులు ఆమెను సాదరంగా ఆహ్వానించి.. కుమార్తెలకు కబురు పెట్టారు. అలా ముప్పై ఏళ్లకు మళ్లీ ఆమె కన్నబిడ్డలను.. అయినవాళ్లను కలుసుకుంది. ఇదేదో సినిమా స్టోరీలా ఉన్నా.. నిజమైన జీవితకథ.

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్‌ఆఫీస్‌ ప్రాంతానికి చెందిన పుప్పాల నారాయణకు ఇద్దరు భార్యలు. లక్ష్మీ పెద్ద భార్య.. పార్వతి చిన్నభార్య. లక్ష్మికి ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కుమార్తెలు కాగా.. పార్వతమ్మకు ఇద్దరు కుమార్తెలు. కాపురంలో అప్పుడప్పుడు వచ్చే కలతలకు మనసు చెదిరిన పార్వతమ్మ అలిగి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పటికే హైదరాబాద్‌లో ఐటీఐ చదువుతున్న సవతి కొడుకు రవీంద్రనాథ్‌ వద్దకు వెళ్లింది. అక్కడ కొద్ది రోజులు ఉండి.. ఇంటికి వెళ్తానని బస్సెక్కింది. తీరా ఆమె హన్మకొండకు చేరింది. అక్కడ అనాథాశ్రమం.. అక్కడి నుంచి విజయవాడగుడికి.. అక్కడి నుంచి ఇంటికి చేరడానికి ఆమెకు ముప్పై ఏళ్లు పట్టింది.  ఆమె మనసులో గూడు కట్టుకున్న వేదన.. బాధ.. ఎవరికి చెప్పుకోవాలో తెలీని స్థితిలో ఎక్కడికి పోతున్నదో తెలీని ధీనస్థితిలో ఆమె కష్టాన్నే నమ్ముకుంది. చేతనైన పని చేసుకుంటూ.. ఎట్టకేలకు జీవిత చరమాంకంలో ఇంటికి చేరింది. ఇంటికొచ్చిన తల్లిని ఆమె బిడ్డలు గుండెలకు హత్తుకున్నారు. ఇక జీవితాంతం మమ్మల్ని వదలి ఎక్కడికీ వెళ్లొద్దంటూ వేడుకున్నారు. ఆమె అంగీకరించడంతో.. అప్పటిదాకా ఆసరా ఇచ్చిన విజయవాడలోని మమత అనాధాశ్రమం నిర్వాహకుల అనుమతి కోసం ఇంటిలింలపాది కదిలి వెళ్లారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: After long time, Bhadrari kothagudem, Family, Khammam, Telangana

  తదుపరి వార్తలు