Hyderabad potholes : సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడ్పడవోయ్ అనే వ్యాఖ్యలను ఓ వృద్దదంపతులు అక్షరాల పాటిస్తున్నారు. తమ స్వలాభాన్ని మానుకుని సమాజం కోసం పదకొండు సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు.ఇలా ఏడు పదుల వయస్సులో 40 లక్షలు ఖర్చుపెట్టి రోడ్లపై గుంతలు పూడ్చుతూ.. నగర ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలం వచ్చిందంటే ప్రయాణం నరకమే అని చెప్పాలి.. కనీసం రెండు గంటలు గట్టిగా వర్షం పడినా..నగర ప్రజలు తమ ప్రయాణంలో నరకం చూస్తుంటారు..వర్షాలతో రోడ్లపై నీళ్లు ప్రవహించడం, వర్షం దాటికి రోడ్లు గుంతలు పడడంతో.. రోడ్ల పై ప్రయాణం కష్టతరంగా మారుతుంటుంది..కొన్ని సంధర్భాల్లో ప్రయాణికులు వర్షపు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతుంటారు. దీంతో వర్షం పడితే ఎక్కడ గుంతలు, మ్యాన్‌హోల్స్..నోళ్లు తెరుచుకుంటాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రయాణం కొనసాగిస్తారు.
అయితే ఇవన్ని నగర ప్రజలకు సుపరిచతమే అయినా..ప్రతి సంవత్సరం ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా తమ గమ్యాన్ని చేరుతున్నారు.. ఇక బాధ్యత గల పౌరులతో పాటు మీడియా సైతం గుంతలు పూడ్చాలని ప్రభుత్వానికి విన్నపాలు చేస్తుంది..సగటు మానవుడు ఇంతకంటే చేసేది లేక తమ దారిన పోతుంటారు.
కాని...నగరంలో నివసిస్తున్న ఓ రిటైర్డ్ ఉద్యోగి మాత్రం ఈ పరిస్థితులను చూస్తూ కూర్చోలేదు...ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న రోడ్డు తేలుతున్న గుంతల పని పట్టాడు. అందరూ చూస్తూ..పోతుంటే తాను మాత్రం ఆరు పదుల వయస్సులో కూడా చూస్తూ ఊరుకోలేదు. తనవంతు భాద్యతగా రోడ్లపై గుంతలు పూడ్చడంపై దృష్టిసారించాడు. ఇలా 11 సంవత్సరాలుగా సుమారు 40 లక్షల రూపాలయల ఖర్చుతో సుమారు 2000 పైగా గుంతలను ఆ వృద్ద దంపతులు పూడ్చి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. నగరంలో నివసించే గంగాధర్ తిలక్ 74 సంవత్సరాల వయస్సులో ఆయన భార్య వెంకటేశ్వరితో కలిసి సమాజసేవకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే గంగాధర్ తిలక్ ఇండియన్ రైల్వేలో 35 సంవత్సరాల పాటు.. ఉద్యోగం చేసి పదవి విరమణ పొందాడు. అనంతరం సాఫ్ట్వేర్ డిజైనర్‌గా మారాడు. ఈ సమయంలోనే రోడ్డు గుంతల ద్వార పలువురు ప్రమాదానికి గురికావడం ఆయన స్వయంగా చూశాడు. దీంతో చలించిపోయిన తిలక్..అందరిలా చూస్తూ ఊరుకోలేదు.. తనవంతు బాధ్యతగా గుంతల సమాచారాన్ని మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. అయితే సాధారణంగా తాము అనుకున్నప్పుడే పనులు చేసే..మున్సిపల్ అధికార గణంతో ఆయన విసుగు చెందాడు.అధికారులకు రోడ్ల గుంతలపై ఫిర్యాదు చేయడంపై లాభం లేదనే నిర్ణయానికి వచ్చాడు..
దీంతో తానే గుంతలు పూడ్చేందుకు నడుంబిగించాడు. ఇందుకోసం ఉన్న సాఫ్ట్వేర్ డిజైనర్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు..ఆ తర్వాత తన భార్య సహాయం కూడా తీసుకున్నాడు. తన కారులో గుంతలు పూడ్చేందుకు కావాల్సిన మెటిరియల్‌ను వేసుకుని రోడ్డుపైకి వస్తున్నారు.ఇలా 11 సంవత్సరాలుగా తన భార్య సహాకారంతో గుంతలు పూడ్చుతున్నారు. ఇలా తమ సొంత డబ్బులు సుమారు 40 లక్షలు ఖర్చు పెట్టి 2000 కు పైగా గుంతలు పూడ్చినట్టు తెలిపారు.
అయితే ఇలా ఆయన చేస్తున్న సమాజ సేవతో.. "రోడ్డు డాక్టర్‌గా" గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో..తిలక్ శ్రమను గుర్తించిన మున్సిపల్ అధికారులు ముందుకు వచ్చారు...గుంతలు పూడ్చేందుకు కావాల్సిన మెటీరియల్‌ను అందించేందుకు సహకరించారు. దీంతో అప్పటి నుండి ప్రభుత్వ మెటిరియల్తో పాటు తాను కూడా ఖర్చుకు వెనకాడకుండ గుంతలు పూడ్చే కార్యక్రమంలో మునిగి తేలారు తిలక్ దంపతులు. మరోవైపు ఇందుకోసం ఇతరులను ఒక్క రూపాయి కూడా చేయి చాచి అడగలేదని ఆయన మీడియాకు వివరించారు.
అయితే ఇతరులకు సహాయం చేయడం కోసం ముందుకు వస్తే..ఇలాంటీ సమస్యలను అధిగమించడం చాలా సులభం అని తిలక్ పేర్కొంటున్నారు. ఆయన చెప్పేది వాస్తవమే అయినా...నగర ప్రజలు కొద్ది మంది అయినా తమ వంతు బాధ్యతగా ముందుకు వస్తే ఎలాంటీ ప్రజా సమస్యలైనా..అతి సులువుగానే పరిష్కరించుకునే అవకాశాలు మెరుగవుతాయి...మరి తిలక్ దంపతులను ఎంతమంది ఆదర్శంగా తీసుకుని భవిష్యత్‌లో ముందుకు వస్తారో వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.