(జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
నల్లా బిల్లు కట్టలేదన్న సాకుతో ఇంట్లో ఉన్న మంచాన్ని జప్తు చేయడం వింటే సహజంగా కలిగే భావన ఇది. ఓవైపు రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చి సురక్షిత నీటిని సరఫరా చేస్తున్నా.. పైసా బిల్లు చెల్లించకుండానే రక్షిత నీరు ఇంటిలోని నల్లాలోకి రావాల్సి ఉన్నా.. క్షేత్ర స్థాయిలో గతి తప్పుతోంది. ప్రభుత్వం ఎంతో ఉదాత్తంగా తీసుకొచ్చిన పథకం పేదలకు చేరడం లేదు. పైగా సామాన్య జనంపై దౌర్జన్యాలకు, స్థానికంగా ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా నమోదైన ఓ ఘటన క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో తెలుపుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామం.. చింతల కవిత అనే పేదింటి ఇల్లాలు. కాయకష్టం చేస్తే తప్ప పూటగడవని దుస్థితి. అసలే కరోనా కాలం. పనలు లేక.. పస్తులుంటున్న పరిస్థితి. అయినా ఆమె అభిమానాన్ని చంపుకోలేకపోయింది. త్వరలో చెల్లిస్తానని చెప్పినా వినకుండా ఇంట్లో ఉన్న మంచాన్ని పంపు ఆపరేటర్ దౌర్జన్యంగా నెత్తిన పెట్టుకుని తీసకెళ్లడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
ఇక్కడ పనిచేస్తున్న ఆపరేటర్ పుల్లయ్య ఉద్యోగం అసలు అధికారికమో.. అనధికారికమో తెలీదు. అయినా అందరిపై ఇలా దౌర్జన్యం చేస్తుంటాడని చెబుతున్నారు. ఇలా పేదింటి మహిళ చింతల కవితపై దౌర్జన్యంగా మాట్లాడడం.. ఆమె ఉంటున్న ఇల్లు పూరిగుడిశ లాంటి ఇంటిలోకి చొరబడడం.. ఉన్న ఒకే ఒక్క నవారు మంచాన్ని బలవంతంగా తీసుకుని వెళ్లిపోవడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఆపరేటర్ పుల్లయ్య ఆమె ఇంటికి వచ్చి దౌర్జన్యంగా ప్రవర్తించడం.. తన అసిస్టెంట్‌తో ఇంటిలోని మంచం తెప్పించి బండిమీద పెట్టుకుని బలవంతంగా తీసుకెళ్లడం.. అసహాయురాలైన ఆ మహిళ ఇదంతా చేష్టలుడిగి చూస్తుండడం అక్కడ గుమిగూడిన సాటిజనం చూసి కూడా కనీసం మాటసాయం చేయకపోవడం మరో వైచిత్రి. అయితే ఇక్కడ మరో విశేషం ఏమంటే అసలు సదరు మహిళ ఎంత బకాయి ఉందో నోటీసు ఇవ్వలేదు.. మూడు నోటీసులు ఇచ్చిన అనంతరమే పంచాయతీ తీర్మానంతో ఏదైనా చర్యలకు పూనుకోవాలి.
అదీ కూడా జీవించడానికి అత్యవసరమైన నీటి కనెక్షన్ తొలగించరాదు. కానీ ఇక్కడ అలాంటి సహజ న్యాయసూత్రాలేవీ పట్టించుకోలేదు. కేవలం దళిత మహిళ అనే కారణంగా దౌర్జన్యానికి పాల్పడి.. ఆమె పూరిగుడిశెలోని మంచాన్ని బలవంతంగా లాక్కెళ్లారని చెబుతున్నారు. దీనిపై ఇంకా లోతైన కారణాలు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయమై జిల్లా స్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించడం పట్ల చర్యలకు ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Mission Bhagiratha, Telangana News