HOME » NEWS » telangana » NOT ONE TWO TIGERS IN BHADRADRI KOTHAGUDEM DISTRICT CONFIRMS FOREST OFFICIALS BA KMM

Tiger in Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం ఘటనలో ట్విస్ట్

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకటి కాదు, రెండు పులులు తిరుగుతున్నాయి. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.

news18-telugu
Updated: November 27, 2020, 10:02 PM IST
Tiger in Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం ఘటనలో ట్విస్ట్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
(జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్‌18)

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకటి కాదు, రెండు పులులు తిరుగుతున్నాయి. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. బూర్గంపాడు మండలంలో ఒకటి, అశ్వాపురం మండలంలో మరో పులి సంచరిస్తున్నట్టు అధికారులు నిర్ధరించారు. వాటి పాదముద్రల ఆధారంగా బూర్గంపాడు మండలంలో ఉన్నది ఆడ పులిగా, అశ్వాపురంలో మగ పులిగా నిర్ధారణకు వచ్చారు.  మొదట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాక పుష్కరవనంలో పులి సంచారం కలకలం రేపింది. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలోకి పులి వచ్చిందన్న వార్తతో జనం ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది గంటల కొద్దీ ఆ ప్రాంతంలో ఆనవాళ్ల కోసం వెతికారు. ఎట్టకేలకు పులి ఆ ప్రాంతంలో సంచరించినట్టు గుర్తించారు. గోదావరి తీరం వెంట ఈ ప్రాంతమంతా పారిశ్రామికవాడగా ప్రసిద్ధి పొందింది. అటవీ ప్రాంతానికి కొన్ని మైళ్ల దూరం ఉన్నప్పటికీ ఇక్కడికి పులి ఎలా రాగలిగింది అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి.

గురువారం రాత్రి ఈ ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఓ యువకుడు, తనకు రోడ్డు దాటుతున్న పులి కనిపించిందని అటవీశాఖాధికారులకు సమాచారం అందించాడు. అయితే తాము వచ్చేదాకా అక్కడే ఉండాలని కోరినప్పటికీ, భయంతో ఆ యువకుడు వెళ్లిపోయాడు. దీంతో పులి కనిపించిందన్న ఖచ్చితమైన ప్రదేశం విషయంలో గందరగోళానికి గురైన అటవీశాఖాధికారులు రాత్రి పొద్దుపోయేదాకా గాలించారు. జనావాసాలపై దాడిచేస్తుందేమోనన్న భయంతో ఆ ప్రాంతంలోని గ్రామస్తులను అప్రమత్తం చేశారు. అయితే శుక్రవారం ఉదయం ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను గుర్తించగలిగారు. ఆ ప్రాంతం నుంచి 20 కిలోమీటర్లకు పైగా దూరం ఉండే పాల్వంచ అభయారణ్యం నుంచి వచ్చిందని భావిస్తున్నారు. అటవీశాఖాధికారులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వాస్తవానికి పులి కనిపించిన ప్రాంతం సారపాక పుష్కరవనం బూర్గంపాడు మండలంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఐటీసీ పీఎస్‌పీడీ పేపర్‌ మిల్స్‌ ఉన్నాయి. వేల సంఖ్యలో కార్మికులు, కార్మిక కుటుంబాలు ఉంటాయి. ఇక్కడికి కొద్ది దూరంలోనే పాల్వంచ శివారుల్లో నవభారత్‌ ఫెర్రోఅల్లాయిస్‌ ఫ్యాక్టరీ, ఎన్‌ఎండీసీ, కేటీపీఎస్‌ ఇంకా పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర పరిశ్రమలున్నాయి. సింగరేణి గనుల ప్రాంతానికి కూడా ఇది పెద్ద దూరమేంకాదు. దీంతోబాటుగా దక్షిణాది అయోధ్య భద్రాచలం వెళ్లే దారి అంతా దాదాపు అటవీప్రాంతం మధ్య నుంచే ఉంటుంది. ఇది కాకుండా సారపాక క్రాస్‌రోడ్స్‌ నుంచి అశ్వాపురం, మణుగూరు, పినపాకలకు దారితీసే మార్గం కూడా ఇదే. అశ్వాపురంలో భారజల కేంద్రం ఉంది. అయితే ఈ పులి పాల్వంచ టైగర్‌ శాంక్చువరీ నుంచి దారి తప్పి వచ్చినట్టా లేక ఆహారం కోసం వచ్చినట్టా అన్నదానిపై అటవీశాఖాధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఎక్కడికక్కడ చెరువులు, వాగుల్లో నీళ్లు పుష్కలంగాగానే ఉన్నప్పటికీ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి గోదావరి తీరం దాకా వచ్చిందంటే.. దీనికి కారణం ఏంటన్న దానిపై అధికారుల్లో గందరగోళం నెలకొంది. కొన్ని సార్లు మేటింగ్‌ సమయంలోనూ పులులు ఇలా ప్రయాణిస్తూ ఉంటాయని ఓ అధికారి 'న్యూస్‌ 18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధికి తెలిపారు. ప్రస్తుతం ఓ ఆడపులి, మరో మగపులి తిరుగుతున్నట్టు తెలియడంతో బహుశా తోడు కోసమే ఆ రెండూ వెతుకుతున్నాయని భావిస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 27, 2020, 9:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading