హోమ్ /వార్తలు /తెలంగాణ /

Raja Singh: బీజేపీలో రాజాసింగ్ చాప్టర్ ముగిసినట్లేనా? కాషాయ నేతల మౌనానికి కారణమేంటి..?

Raja Singh: బీజేపీలో రాజాసింగ్ చాప్టర్ ముగిసినట్లేనా? కాషాయ నేతల మౌనానికి కారణమేంటి..?

రాజాసింగ్​ (Photo Credit:Twitter)

రాజాసింగ్​ (Photo Credit:Twitter)

Raja Singh: బీజేపీ నేతలెవరూ రాజాసింగ్‌పై మాట్లాడకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమ పార్టీ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ పెట్టినా.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గానీ.. ఇతర నేతలు కూడా స్పందించలేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజాసింగ్ (Raja Singh).. కొన్నిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఈ బీజేపీ ఎమ్మెల్యే పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈయన గురించే చర్చ జరుగుతోంది. ఇక హైదరాబాద్‌లో అయితే రచ్చ రచ్చ జరుగుతోంది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ (Munawar Faruqui) షో హైదరాబాద్‌లో ఖరారైనప్పటి నుంచి రాజాసింగ్ వార్తల్లో ఉంటున్నారు. హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మునావర్‌ను.. హైదరాబాద్‌ (Hyderabad)లో షో చేయనిచ్చే ప్రసక్తే లేదని రాజాసింగ్ హెచ్చరిస్తూ వచ్చారు. ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్య మునావర్ ఫరూఖీ షో ముగించుకొని వెళ్లిపోయారు. ఐతే మునావర్‌ను తిట్టే క్రమంలో.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. అప్పటి నుంచి రచ్చ మరింత ముదిరింది. మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం, ముస్లిం సంఘాలు ఆందోళనలు చేశాయి. ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాయి.


  BJP vs TRS: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వరంగల్ సభ నిర్వహిస్తాం .. సక్సెస్‌ చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ పిలుపు


  ఈ క్రమంలోనే ఇటీవల రాజాసింగ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో హాజరపరిచారు. ఐతే ఆయనకు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటూ.. రిమాండ్‌ను తిరస్కరించింది కోర్టు. రాజాసింగ్‌కు బెయిల్ మంజూరుచేసింది. ఆ తర్వాతి రెండో రోజే పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. గోషామహల్‌లోని తన నివాసంలో రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి.. నేరుగా చర్లపల్లి జైలుకు తరలించారు. ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ నమోదు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారని చెబుతున్నారు. పీడీ యాక్ట్ పెట్టడమంటే మామూలు విషయం కాదు. పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు పీడీ యాక్ట్ పెట్టి.. కోర్టులు, తీర్పులతో సంబంధం లేకుండా నేరుగా జైల్లో వేస్తారు. కనీసం ఏడాది పాటు జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు రాజాసింగ్‌ పరిస్థితి కూడా అదే..! ఐతే పీడీ యాక్ట్‌ను పోలీసులు నిబంధనల ప్రకారమే నమోదు చేశారా? అనేది తేలాలి. అంతా ఓకే అయితే.. ఆయన జైల్లోనే ఉంటారు. పోలీసులు ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే.. కోర్టు ఆదేశాల మేరకు బయటకు వస్తారు.


  Warangal BJP Meeting: బీజేపీకి మరో షాక్​.. వరంగల్​ సభకు అనుమతికి నిరాకరణ.. పూర్తి వివరాలివే


  ఐతే ఇంత జరుగుతున్నా బీజేపీ నేతలెవరూ రాజాసింగ్‌పై మాట్లాడకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. తమ పార్టీ ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ పెట్టినా.. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గానీ.. ఇతర నేతలు కూడా స్పందించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తీరుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్‌ను వారు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదా? అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. రాజాసింగ్ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. కేసులు నమోదుకావడంతో.. పార్టీకి నష్టం కలుగుతోందని కమలం పెద్దలు భావిస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీకి రాజాసింగ్ తీరు అడ్డంకులు కలిగిస్తోందని అనుకుంటున్నారట. ఆయన్ను పార్టీకి దూరంగా ఉంచితేనే బాగుంటుందని.. లేదంటే నష్టం కలుగుతుందన్న అభిప్రాయానికి వచ్చారట. అందువల్లే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కమలం పెద్దలు స్పందించడం లేదని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.  రానున్న రోజుల్లో రాజాసింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం గానీ.. లేదంటే పార్టీ పెద్దల పట్ల అసంతృప్తితో రాజాసింగే బయటకు వచ్చేయడం గానీ.. జరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలంతా బండి సంజయ్ పాదయాత్రపైనే దృష్టిసారించారని.. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ పెట్టి, జైల్లో వేసినా పట్టించుకోవడం లేదని.. ఈ పరిణామాలు చూస్తుంటే.. బీజేపీలో రాజాసింగ్ చాప్టర్ ముగిసినట్లేనని ప్రచారం జరుగుతోంది. మరి బీజేపీ నిజంగానే రాజాసింగ్‌ను పక్కనబెట్టిందా? లేదంటే దీని వెనక ఇంకేదైనా వ్యూహం ఉందా? అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Bjp, Hyderabad, Raja Singh, Telangana

  ఉత్తమ కథలు