Non-agri lands registration: తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌

తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ (image credit - twitter - #RealEstateHyderabad)

Non-agri lands registration in Telangana: ధరణి పోర్టల్‌తో రకరకాల సమస్యలు రావడంతో... తెలంగాణ ప్రభుత్వం ఇదివరకటి లాగే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సిద్ధపడింది.

  • Share this:
    తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లపై ధరణి పోర్టల్‌లో గందరగోళం ఏర్పడటంతో... తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) మొన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అందువల్ల కొత్త పద్ధతిలో చేస్తున్న స్లాట్ బుకింగ్స్‌ను నిలిపివేశారు. మొన్నటి నుంచి స్లాట్ బుకింగ్స్ నిలిచిపోయాయి. ఇవాళ్టి నుంచి పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. కార్డు ( C.A.R.D) విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. ఐతే ఇప్పటికే స్లాట్ బుకింగ్స్ చేసుకున్న వారికి... కేటాయించిన తేదీల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లతో పాటు ప్రజలు కూడా ఊపిరిపీల్చుకున్నారు. నేటి నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఊపందుకునే అవకాశముంది.

    హైకోర్టులో కేసుల వలన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు కొన్ని రోజులుగా ఇబ్బందులు తలెత్తాయి. ఆధార్ కాలమ్‌ను తొలగించే వరకు స్లాట్ బుకింగ్, PTIN నిలిపివేయాలని, కులం, కుటుంబసభ్యుల వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దాంతో శనివారం సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి... ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

    వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ నియమించారు. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కే టీ రామారావు (KTR), పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు. మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమై, వారి అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ ఆదేశించారు.

    ఆధార్ కార్డుతో పాటు కొన్ని అంశాలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం డైలామాలో పడింది. బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లుతో పాటు ప్రజలు కూడా ఆందోళనలు చేయడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టుకు వెళ్లడమా ? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతానికైతే పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని అధికారులతో చర్చల తర్వాత సీఎం నిర్ణయించారు.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ రాశుల వారు మానసికంగా సమర్థులు... ఈ లిస్టులో మీరు ఉన్నారా?

    వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం తహసీల్దారు ఆఫీసుల్లో ధరణి పోర్టల్‌లోనే జరుగుతాయి. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే... వారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగాన్ని కలవవచ్చు లేదా కాల్ సెంటర్‌ నంబర్ 1800 5994788 కి కాల్ చెయ్యవచ్చు. ఈమెయిల్ ద్వారా కూడా సందేహాలు తీర్చుకోవచ్చు. ఈమెయిల్ ఐడీ grievance-igrs@igrs.telangana.gov.in సింపుల్‌గా వాట్సాప్ ద్వారా కూడా సమాచారం కోరవచ్చు. వాట్సాప్ నంబర్ 9121220272.
    Published by:Krishna Kumar N
    First published: