Nomula Narsimhaiah Passes Away: టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

నోముల నర్సింహయ్య(ఫైల్ ఫోటో)

TRS MLA Nomula Narsimhaiah Passes Away: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

  • Share this:
    టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోముల నర్సింహయ్య.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. కొన్ని వారాల క్రితం కరోనా బారిన పడిన ఆయన.. వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే ఆ తరువాత కూడా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ వచ్చారు. కొద్దిరోజుల నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నోముల నర్సింహయ్య.. గుండెపోటు రావడంతో చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలోని నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి నోముల నర్సింహయ్య ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

    సీపీఎం తరపున రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నోముల నర్సింహయ్య.. ఆ పార్టీ తరపున నకిరేకల్ నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. తనదైన ప్రసంగాలతో ప్రభుత్వాలను ఇరుకున పెట్టి, ప్రజాసమస్యలను లేవనెత్తడంలో నోముల నర్సింహయ్య దిట్టగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం టీఆర్ఎస్‌లో చేరిన నోముల నర్సింహయ్య.. 2014లో నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో తిరిగి నాగార్జునసాగర్ నుంచి పోటీ చేసిన నోముల.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డిపై విజయం సాధించారు. అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, తెలంగాణలో ఒకసారి ఎమ్మెల్యేగా పని చేశారు.

    ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం పట్ల సీఎం కెసిఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పని చేసిన నాయకుడిగా నోముల నర్సింహయ్య నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నోముల నర్సింహయ్య రాజకీయ జీవితం ప్రజా పోరాటాలతోనే కొనసాగిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: