మటన్ కొట్టుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగి.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు

సిరిసిల్ల డిపోలో ఏడీసీగా పనిచేస్తున్న ఎల్ రామ్ రెడ్డి కుటుంబ పోషణ కోసం మటన్ కొడుతున్నాడు.

news18-telugu
Updated: November 15, 2019, 3:51 PM IST
మటన్ కొట్టుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగి.. కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు
మటన్ అమ్ముకుంటున్న ఆర్టీసీ ఏడీసీ రామ్ రెడ్డి
  • Share this:
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 42వ రోజుకు చేరింది. అయితే, అటు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఇటు రెండు నెలలుగా వేతనాలు లేకపోవడంతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో కొందరు తమకు వచ్చిన పనులు చేసుకుంటున్నారు. కొందరు పొలం పనులు చేసుకుంటుంటే, మరికొందరు ఇతరత్రా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకు బండిలాగుతున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల డిపోలో ఏడీసీగా పనిచేస్తున్న ఎల్ రామ్ రెడ్డి కుటుంబ పోషణ కోసం మటన్ కొడుతున్నాడు. తన సొంత గ్రామం నిమ్మపల్లిలో మటన్ కొట్టి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

‘మూడు నెలల నుంచి జీతాల్లేవు. కేసీఆర్ తెలంగాణ వచ్చినప్పుడు ఓ మాట. ఇప్పుడో మాట. కేసీఆర్‌కు జ్ఞానోదయం అవడం లేదు. ఆయన మాటమీద నిలబడడు. జీతాల్లేక ఓ మేకను కోసుకున్నా. ఐదేళ్ల నుంచి సబ్సిడీ డబ్బులు ఇవ్వడం లేదు. అధికారులతో అన్నీ దొంగలెక్కలు చెప్పిస్తున్నారు. ఆయనో రాజు అయిపోయాడు. ఆంధ్రలో ఉన్నా మంచిగా ఉండేది. ఆంధ్ర నుంచి విడిపోయి కష్టాలు వచ్చాయి. ఇంకోసారి ఓటేస్తే కేసీఆర్ తెలంగాణ మొత్తం అమ్మేస్తారు. పిల్లల ఫీజు కట్టాలి. ఏదో మాంసం అమ్ముతున్నా. ఇంట్లో వాళ్లు పత్తి ఏరడానికి వెళ్తున్నారు.’ అని రామ్ రెడ్డి చెప్పాడు.

జేఏసీ నాయకులను పిలిచి చర్చలు జరిపితే వెంటనే సమ్మెను విరమిస్తామని రామ్ రెడ్డి అంటున్నాడు. ‘కేసీఆర్ ఇప్పుడు ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు. 26 డిమాండ్లలో ఒక్కటి కూడా ఇవ్వాల్సిన పనిలేదు. జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి.. నేను తర్వాత చేస్తా అని ఒక్క మాట ఇస్తే చాలు. గంటలో డ్యూటీకి వెళతాం’ అని రామ్ రెడ్డి తెలిపాడు. కేసీఆర్ తీరు వల్ల ఆర్టీసీ మరింత నష్టపోతుందని రామ్ రెడ్డి అన్నాడు. ఆర్టీసీకి రోజుకు రూ.13 కోట్ల ఆదాయం కోల్పోతుందని చెప్పాడు. ఒక్క సిరిసిల్ల డిపోలో తాము బస్సులు నడిపినప్పుడు రోజుకు రూ.8 లక్షల నుంచి రూ.9లక్షల కలెక్షన్ వచ్చేదని, ఇప్పుడు కేవలం రూ.లక్ష మాత్రమే కడుతున్నారన్నారు. అంతా ఎవరు తింటున్నారో ఏమో అని రామ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.First published: November 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>