హోమ్ /వార్తలు /తెలంగాణ /

డెడ్ లైన్ ఇంకొన్ని గంటలే: ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతుల్లోకే -AP, TS వాదించినా వినని KRMB -మీటింగ్ మమ

డెడ్ లైన్ ఇంకొన్ని గంటలే: ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతుల్లోకే -AP, TS వాదించినా వినని KRMB -మీటింగ్ మమ

కేంద్రం పరిధిలోకి ప్రాజెక్టులు

కేంద్రం పరిధిలోకి ప్రాజెక్టులు

KRMB meeting: జల వివాదాలను పరిష్కరించుకోలేని తెలుగు రాష్ట్రాలు అన్ని ప్రాజెక్టులపై అధికారాలు కోల్పోనున్నాయి. ఇప్పటికే జారీ అయిన గెజిట్ నోట్ ప్రకారం ఈనెల 14 నుంచి ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులు కేంద్రం ఆధీనంలోకి వెళతాయి. డెడ్ లైన్ ఇంకా కొద్దిగంటలే మిగిలుండటంతో రివర్ బోర్డులు రెండు తెలుగు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించింది. కానీ అవి తూతూమంత్రంగానే ముగిశాయి. వివరాలివి..

ఇంకా చదవండి ...

పిట్టల పోరులో పిల్లి తీర్పు లాగా.. జల వివాదాలున్న ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోడానికి అన్ని రకాలుగా సమాయత్తమైంది. కృష్ణా నది జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గొడవలు తారాస్థాయికి చేరి, ఎన్జీటీ నుంచి సుప్రీంకోర్టు దాకా ఫిర్యాదులు చేసుకోవడం, గోదావరి జలాలపైనా గొడవలు పడుతోన్న క్రమంలో పరిష్కారమార్గంగా కేంద్రమే పెత్తనాన్ని స్వీకరిస్తానని చెప్పడం, ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం తెలిసిందే. ఈ నెల 14 నుంచి కేంద్ర గెజిట్‌ అమలు కానున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ నేతృత్వంలోని నదీ యాజమాన్య బోర్డులు.. రెండు తెలుగు రాష్ట్రాలతో కీలక సమావేశాలు నిర్వహించింది. అయితే, అటు ఏపీ వాదనను, ఇటు తెలంగాణ వాదనను బోర్డులు పట్టించుకోకపోవడంతో మీటింగ్స్ నామమాత్రంగా మమ అన్నట్లు ముగిశాయి.

అప్పులెవరు తీరుస్తారు?

కేంద్ర ప్రభుత్వం ఇదివరకే జారీ చేసిన గెజిట్ ప్రకారం.. ఆంధ్రా, తెలంగాణలో గోదావరి, కృష్ణా బేసిన్లలోని అన్ని రకాల ప్రాజెక్టులు ఈనెల 14 నుంచి కేంద్రం పరిధిలోకి వెళతాయి. ఆ ప్రక్రియను సమగ్రంగా నిర్వహించే క్రమంలో రివర్ బోర్డులు సోమ, మంగళవారాల్లో కీలక సమావేశాలు నిర్వహించాయి. సోమవారం నాడు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ జరగ్గా.. ‘ప్రాజెక్టులు అన్నిటినీ జల శక్తి శాఖ స్వాధీనం చేసుకుంటే ఇప్పటికే చేసిన అప్పుల్ని ఎవరు తీరుస్తారు?’లాంటి ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. ఇక మంగళవారం నాటి కృష్ణా రివర్ బోర్డు మీటింగ్ లోనూ రెండు రాష్ట్రాలూ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి..

ఏపీ తలూపినా.. కరెంటునూ తీస్కోండి..

శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు సంబంధించిన అన్ని కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకొస్తూ కేఆర్ఎంబీ చేసిన తీర్మానానికి ఏపీ ప్రభుత్వం ఇదివరకే ఆమోదం తెలిపి, బోర్డు ప్రతిపాదనలను ప్రభుత్వ ఉత్తర్వులుగానూ ప్రకటించింది. అయితే, ఇవాళ్టి మీటింగ్ లో మాత్రం ఏపీ తరఫున ఆ రాష్ట్ర ఇరిగేషన్‌ సెక్రటరీ శ్యామలారావు మాట్లాడుతూ.. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలను కూడా బోర్డు పరిధిలోకి తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చే విషయమై తెలంగాణ ఇప్పటిదాకా ఉత్తర్వులివ్వలేదని, ఆవిషయాన్ని బోర్డే చూసుకోవాలని, గెజిట్ అమల్లోకి వచ్చినా రెండు మూడు నెలలు సంధికాలం ఉంటుంది కదాని ఏపీ అధికారి వ్యాఖ్యానించారు. దీనిపై..

నో చెప్పిన తెలంగాణ.. నీటి వాటా తేలేదాకా..

రాష్ట్రంలోని ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో ఏపీ అంగీకారం తెలిపినా, తెలంగాణ మాత్రం నో చెప్పింది. ముందుగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను బోర్డు తేల్చాలని, నీటి వాటా తేలేదాకా నోటిఫికేషన్ అమలును నిలుపుదల చేయాలని తెలంగాణ ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్ కుమార్ వాదించారు. కేఆర్ఎంబీ మీటింగ్ తర్వాత రజత్ మీడియాతో మాట్లాడారు..

కరెంటును కేంద్రానికి ఇవ్వం..

‘మొత్తం 65 కేంద్రాలు కేంద్ర గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఉన్నాయని, నాగార్జున సాగర్‌పై 18, శ్రీశైలంపై 12 కేంద్రాలు ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది. అయితే, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా కేటాయించే వరకు గెజిట్‌నోటిఫికేషన్‌ ఆపాలని మేం కోరాం. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఏపీ కోరింది, దానికి మేము అంగీకరించలేదు. ఎందుకంటే తెలంగాణకు విద్యుత్‌ ఉత్పత్తి చాలా అవసరమైనది. ప్రాజెక్టు యాజమాన్య హక్కుల విషయమై న్యాయసలహాలు తీసుకుంటున్నాం’అని ఇరిగేషన్ అధికారి రజత్ వివరించారు. ఎలాంటి నిర్మాణాత్మక నిర్ణయాలు లేకుండానే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ ముగిసింది. యథాప్రకారం ఈనెల 14తో కేంద్ర గెటిట్ అమల్లోకి రానుంది..

First published:

Tags: Andhra Pradesh, AP Telangana Water Fight, Krishna River, Krishna River Management Board, Telangana

ఉత్తమ కథలు