ఆన్‌లైన్ క్లాసులపై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటివరకు విద్యాసంవత్సరం ప్రారంభంపై రాష్ట్రంతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ స్పష్టం చేశారు.

 • Share this:
  రాష్ట్రంలో స్కూల్స్‌లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణపై ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ ప్రాంతీయ విద్యాధికారులకు, జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు విద్యాసంవత్సరం ప్రారంభంపై రాష్ట్రంతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో డీఈవోలు ఆన్‌లైన్‌ తరగతులపై స్కూల్‌ యాజమాన్యాలకు ఎలాంటి ఆదేశాలు జారీచేయవద్దని సూచించారు. విద్యాశాఖ కమిషనర్‌ నిర్ణయాల ప్రకారం డీఈవోలు జిల్లాలవారీగా చర్యలు కొనసాగించాలని ఆదేశించారు.

  అంతకుముందు ఆన్‌లైన్ క్లాస్‌లు ఉంటాయా ? ఉండవా ? అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం ఏంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు స్కూళ్ల దోపిడిని అరికట్టాలంటూ పేరెంట్స్ అసోసియేషన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. జీవో 46ని ఉల్లంఘించి ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఆన్ లైన్ క్లాసెస్ వలన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం కాకున్నా అడ్డగోలు ఫీజులు చెల్లించాలని ప్రయివేటు స్కూల్స్ ఒత్తిడి తెస్తున్నాయని వివరించింది.

  వసూళ్ల కోసం స్కూల్స్ పంపించిన సందేశాలను వాయిస్‌లను సాక్ష్యాలను కోర్టుకు అందించింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వహణపై ప్రభుత్వం ఏమైనా సర్క్యులర్ జారీ చేసిందా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. హర్యానా రాష్ట్రంలో ఇప్పటికే ఆన్‌లైన్ క్లాస్‌లను నిషేధించారని న్యాయస్థానం పేర్కొంది. పంజాబ్, హర్యానా రాష్ట్రంలో విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావద్దని ప్రభుత్వాలు పాఠశాలలకు ఆదేశాలు ఇచ్చాయని గుర్తు చేసింది. ఆన్‌లైన్ క్లాస్‌లపై యూనిఫామ్ పాలసీ తీసుకురావాలని ప్రభుత్వానికి సూచించింది.

  అసలు తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ క్లాస్‌లపై ఎలాంటి నిర్ణయం తీసుకుందని ప్రశ్నించింది. అయితే దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్ క్లాస్‌లపై ఎలాంటి గైడ్ లెన్స్ పాటిస్తున్నారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.


  First published: