నిజామాబాద్ పసుపు రైతు ఒక్క ఐడియా.. రైతులకు ఖర్చు, సమయం ఆదా..

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా ఎకరం పసుపు నాటేందుకు రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది మంది కూలీలు అవసరమవుతుంది.

  • Share this:
    మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వీటిని అనురిస్తూ సొంత ఆలోచనకు పదును పెట్టాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు. పసుపు నాటేందుకు ఇజ్రాయిల్ తరహాలో ట్రాక్టర్ కు యంత్రాన్ని అమర్చి వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టాడు.

    గంగారెడ్డి తయారు చేయించిన యంత్రం


    నిజామాబాద్ జిల్లా పసుపు పంట సాగుకు ఎంతో ప్రసిద్ధి. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభంలో అంటే జూన్ మొదటి వారంలోనే ప‌సుపు పంటను నాటుకుంటారు. కానీ వ‌ర్షాభావ ప‌రిస్థితుల్లో జూలై మొద‌టి వారంలో ప‌సుపు పంట‌ను నాటుతున్నారు. ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని వేల్పూర్, కమ్మర్ పల్లి, మోర్తాడ్, బాల్కొండ తదితర మండలాల్లో వివిధ రకం పసుపును సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తారు.

    గంగారెడ్డి తయారు చేయించిన యంత్రం


    అయితే గ‌తంలో పసుపు నాటడంలో ఎలాంటి యంత్రాలు గానీ పరికరాలు గానీ అందుబాటులోకి రాలేదు. కేవలం దుక్కి దున్ని ఎద్దులు నాగలి సహాయంతో భూమిని సాల్లుగా చేసి ఈ పంటను పండిస్తారు. అయితే ఈ విధానంలో ఎకరం పసుపు నాటేందుకు రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది మంది కూలీలు అవసరమవుతుంది. కూలీల కొరత కారణంగా పంట సాగులో అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి..ఈ సమస్యకు చెక్ పెడుతూ వినూత్న ఆలోచనకు తెరతీశాడు బాల్కొండ మండలం వెంచిర్యాలకు చెందిన గంగారెడ్డి అనే యువ రైతు.

    గంగారెడ్డి తయారు చేయించిన యంత్రం


    తన ట్రాక్టర్కు వెనుకవైపు రాడ్లు వెల్డింగ్ చేసి వాటికి ప్లాస్టిక్ పివిసి పైపులు అమర్చాడు. అడుగు దూరంలో ఒకేసారి నాలుగు సాళ్లలో పసుపుతో పాటు అంతర్ పంటల విత్తనాలు వేసే విధంగా పైపులను ఏర్పాటు చేశాడు. నలుగురు కూలీలు కూర్చునే విధంగా స్టాండును అమర్చాడు. ఇజ్రాయిల్ తరహాలో విత్తనాలు నాటే ఈ విధానం కోసం సుమారు రూ.50 వేల వరకు ఖర్చు చేశాడు. ఈ విధానం వల్ల కేవలం రెండు గంటల్లోనే ఎకరం భూమిలో పసుపు నాటవచ్చని ఖర్చు కూడా ఆదా అవుతుందని రైతు చెప్తున్నాడు.

    గంగారెడ్డి తయారు చేయించిన యంత్రం


    ఈ ప‌ద్ద‌తిలో పంట వేస్తే ఖర్చుతో పాటు స‌మ‌యం ఆదా ఆవుతుంద‌ని రైతులు చెబుతున్నారు.. పసుపు నాటే యంత్రం తయారు కావడంతో దీని ద్వారా ఎద్దుల సమస్య తీరిందని పైగా ఎంతో సులభంగా పంట నాటడం పూర్తవుతుందని స్థానిక రైతులు చెబుతున్నారు. హార్టికల్చర్ ద్వారా సబ్సిడీపై ఇలాంటి యంత్రాలు అందజేస్తే తమకెంతగానో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు.

    (పి.మ‌హేంద‌ర్, న్యూస్ 18 తెలుగు ప్ర‌తినిధి)
    First published: