రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కారణాలు ఏమైనా కానీ రహదారులు మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలి తీసుకుంది. ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకొని ఇంటికి ప్రయాణమైన ఓ కుటుంబాన్ని అనుకోని రీతిలో మృత్యువు ఎదురైంది. ఈ ప్రమాదంలో తల్లి కళ్ల ముందే కొడుకు, కోడలు, కూతురు ప్రాణాలు విడిచారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దొన్‌కల్ గ్రామానికి చెందిన లక్ష్మి తన కుటుంబ సభ్యులతో మంగళవారం బడాభీంగల్ ఎల్లమ్మ వద్దకు మొక్కులు తీర్చు కోవడానికి వచ్చారు. ఎల్లమ్మకు మొక్కలు చెల్లించుకుని తీరుగు ప్రయాణం అయ్యారు. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిసింది అన్నట్టుగా ఉంది. కారులో మొత్తం ఏడుగురు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా ఊహించని రీతిలో మృత్యువు కబళించింది. రాత్రి ఎనిమిది గంటలకు భీంగల్ పట్టణంలోని విద్యుత్తు ఉప కేంద్రం వద్దకు చేరుకోగానే ట్రాక్టర్ ట్రాలీపై ఉన్న పొక్లెయిన్ వెళ్తున్న కారుపై పడింది. దీంతో కారులో ఉన్న లక్ష్మి కొడుకు ముప్పారపు రాజేశ్వర్ (45), కోడలు జ్యోతి (42), కూతురు రమ (41) అక్కడికక్కడే మృతి చెందారు.
నుజ్జునజ్జయిన వాహనంలోంచి మృతదేహాలను, క్షతగాత్రులను బయటికి తీసేందుకు 108 సిబ్బంది గంట పాటు శ్రమించారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మి, అల్లుడు చుక్కాల రాజేశ్వర్ ను అంబులెన్స్ లో నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.. మృతదేహాలను ఆర్మూర్ ప్రాంతీయాసుపత్రికి శవ పరిక్ష నిమిత్తం పంపించారు.. ముప్పారపు రాజేశ్వర్ - జ్యోతి దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు.. తల్లిదండ్రులను కోల్పోయి ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. విగతజీవులైన తన కొడుకు, కూతురు, కోడలిని చూస్తూ లక్ష్మి రోదించడం స్థానికుల్ని కలిచివేసింది. ఎదురుగా వస్తున్న కారుపై ట్రాక్టర్ ట్రాలీ పైనా ఉన్న పొక్లెయిన్ ఎలా పడింది. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో దొన్కల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి వృద్దతల్లి, తల్లిదండ్రులను కొల్పోయి ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.