(P.Mahendar,News18,Nizamabad)
తల్లిదండ్రులు ఉన్న పిల్లలకే సమాజంలో రక్షణ లేకుండాపోయింది. అలాంటిది ఆలనా, పాలన చూడాల్సిన తండ్రి లేకపోవడం, తల్లి కళ్ల ముందే ప్రాణాలు తీసుకోవడం చూసిన ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో భవిష్యత్తును తలచుకొని బాధపడుతున్న పదేళ్ల వయసు కలిగిన బాలిక తన కళ్ల ముందే ప్రాణాలు తీసుకున్న తల్లికి తలకొరివి పెట్టాల్సిన దుస్థితి కావడం అందర్ని కంట తడిపెట్టించింది. నిజామాబాద్(Nizamabad)జిల్లాలో జరిగిన ఈసంఘటన మనసున్న ప్రతి ఒక్కరిని కదలిస్తోంది.
ఓ అనాథ కథ..
నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్కరి గుండె బరువెక్కే సంఘటన జరిగింది. మాక్లూర్ మండల కేంద్రంలో గాయత్రి అనే 35ఏళ్ల వివాహిత పదేళ్ల కూతురు అన్నపూర్ణతో కలిసి ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం గాయత్రి తల్లిదండ్రులు చనిపోయారు. కట్టుకున్న భర్త ఆమెను విడిచిపెట్టి పోయాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కులవృత్తిని కొనసాగిస్తూ కూతురు అన్నపూర్ణను అల్లరు ముద్దుగా పెంచింది. తన కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న గాయత్రికి కష్టాలు, బాధలను తట్టుకోలేకపోయింది.
తల్లికి తలకొరివిపెట్టిన కూతురు..
గత నెల రోజుల నుంచి తీవ్ర మానసిక క్షోభ అనుభవించింది. బ్రతికి కష్టాలు పడటం కంటే చనిపోవడమే మేలని నిర్ణయించుకుంది.రెండ్రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిన గాయత్రి చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంది. వెంట వచ్చిన కూతురు ఎంతగా ప్రాధేయపడినా వినిపించుకోకుండా బలవన్మరణానికి పాల్పడింది. ఏ బిడ్డకు రాని కష్టం గాయత్రి కూతురు అన్నపూర్ణకు వచ్చింది. నా అన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో ..ఒంటరిగా మిగిలిపోయింది.
పదేళ్లలోనే ఎంత కష్టమో ..
కని, పెంచిన తల్లి కళ్ల ముందే చనిపోయిన దృశ్యాలను తలచకుంటూ పదేళ్ల బాలిక ఆన్నపూర్ణ కన్నీరు పెట్టుకోవడం అందర్ని కలచివేసింది. అయితే మృతురాలు గాయత్రికి సోదరులు ఉన్నప్పటిటికి ఆమె దహన సంస్కారాలు, తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో గాయత్రి కుమార్తె పదేళ్ల అన్నపూర్ణ తల్లికి తానే తలకొరివి పుట్టి రుణం తీర్చుకుంది. అందరూ ఉన్నప్పటికి కన్నతల్లిని కోల్పోయి అనాథ బాలికగా అన్నపూర్ణ మిగిలిపోవడం చూసి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Telangana News, Women suicide