(P.Mahendar,News18,Nizamabad)
పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని ఆత్మహత్యాయత్నం చేసుకునే విద్యార్ధుల్ని చూశాం. పిల్లలు చదవకుండా చెడు అలవాట్లు నేర్చుకున్నారనే మనస్తాపంతో బలవన్మరణానికి ప్రయత్నించిన తల్లిదండ్రుల గురించి విన్నాం. కాని నిజామాబాద్(Nizamabad)జిల్లాలో మొట్టమొదటి సారి ఓ ప్రైవేట్ స్కూల్ యజమాని ప్రాణాలు తీసుకునేందుకు గ్రామంలోని వాటర్ ట్యాంక్(Water tank)పైకి ఎక్కాడు. అయితే అతను ఎందుకు వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ (Suicide) చేసుకోవాలనుకున్నాడో తెలిసి పోలీసులు(Police), గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రైవేట్ స్కూల్ యజమాని..
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్న సాయికృష్ణ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం స్థానికుల్ని కలకలం రేపింది. స్కూల్ యజమాని సాయికృష్ణ స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కాడు. అక్కడి నుంచి దూకేస్తానంటూ గ్రామస్తులను బెదిరించాడు. ప్రైవేట్ స్కూల్ యజమాని వాటర్ ట్యాంక్ ఎక్కి గందరగోళం సృష్టించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్‌పైన ఉన్న సాయికృష్ణను ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణం ఏమిటని అడిగారు.
పిల్లల్ని స్కూల్‌లో చేర్పించడం లేదని బాధతో ..
కొద్ది రోజుల క్రితం దుబ్బాక గ్రామాభివృద్ధి కమిటీ గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకే పంపాలి.. ప్రైవేట్ పాఠశాలకు పంపంవద్దని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగనే గ్రామంలో చాటింపు కూడా వేయించారు. దాంతో గ్రామస్తులు ఎవరూ వాళ్ల పిల్లలను ప్రైవేట్ స్కూల్‌కి పంపడం లేదు. అయితే తన స్కూల్‌లో గ్రామస్తులు వాళ్ల పిల్లలను చేర్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు సాయికృష్ణ. అంతే కాదు ముందుగా ఫీజులు చెల్లించిన వాళ్లు కూడా తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండటంతో వాటిని భరించలేకే వాటర్ ట్యాంక్ ఎక్కి చనిపోదామనుకున్నానని పోలీసులకు చెప్పారు ప్రైవేట్ స్కూల్ యజమాని సాయికృష్ణ.
చదువు విషయంలో ఒత్తిడి తగదు..
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కొనసాగించాలంటే విద్యార్ధుల సంఖ్య ఉంటేనే కొనసాగిస్తామని లేదంటే కష్టం అవుతుందని ఎంఈవో చెప్పిన విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేశారు. అందుకోసమే గ్రామస్తులంతా ఒక్క మాటపై నిలబడి ప్రభుత్వ పాఠశాలకే పిల్లల్ని పంపాలని తీర్మానించుకున్నామని ..అందులో భాగంగానే గ్రామంలో చాటింపు కూడా వేయించామని వారి వాదన వినిపించారు. ఇరువర్గాల వాదన విన్న పోలీసులు ప్రైవేట్ స్కూల్ యజమాని సాయికృష్ణకు నచ్చజెప్పి వాటర్ ట్యాంక్‌పై నుంచి కిందకు దింపారు. తల్లిదండ్రులు వారికి ఇష్టమైన పిల్లలను చోట చదివించుకునే స్వేచ్చ ఉందన్నారు. వారి నిర్ణయానికి వ్యతిరేకంగా ఒత్తిడి చేయడం సరికాదని ప్రైవేట్ స్కూల్ యజమానికి సాయికృష్ణకు సర్దిచెప్పారు స్థానిక ఎస్‌ఐ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Private school